ఈవీ.. జోరు!
ABN , Publish Date - May 24 , 2026 | 04:19 AM
రాష్ట్రంలో ఎలక్ర్టికల్ వాహనాల వినియోగం, విక్రయాలు జోరందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొనుగోళ్లలో 2025-26లో 36.15 శాతం వృద్ధి నమోదు కాగా...
ఊపందుకున్న ఎలక్ర్టికల్ వాహనాల విక్రయాలు
రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లోనే 20 వేల అమ్మకాలు
పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభం ఎఫెక్ట్
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పొదుపుబాట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలూ ఊతం
గత రెండేళ్లలోనూ అమ్మకాలలో వృద్ధి
గతేడాది 56,195 ఈవీల కొనుగోళ్లు.. 36.15శాతం వృద్ధి
ద్విచక్ర వాహనాలకు అధిక డిమాండ్.. తర్వాత కార్లకు
ప్రధాన నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్
శబ్దం ఉండదు.. పొగ కాలుష్యం లేదు.. స్టార్ట్ చేయగానే గుర్రాల్లా దూసుకెళ్తాయి.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వాహనాలకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన సంక్షోభం ఏర్పడటం.. ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు పొదుపుబాట పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లోనే 20 వేల ఈవీల అమ్మకాలు జరిగాయి.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఎలక్ర్టికల్ వాహనాల వినియోగం, విక్రయాలు జోరందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొనుగోళ్లలో 2025-26లో 36.15 శాతం వృద్ధి నమోదు కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే అసాధారణ స్థాయిలో 20 వేల ఈవీల అమ్మకాలు జరిగినట్టు వాహన డీలర్లు చెబుతున్నారు. ఇంధన సంక్షోభం.. ఈవీలపై భరోసా పెరగడం.. బ్రాండెడ్ కంపెనీలన్నీ ఈవీలను తీసుకురావటం.. బ్యాటరీల నాణ్యత, మైలేజీ బాగుండటం.. ఈవీల కొనుగోళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలు. 2024-25లో రవాణా శాఖ పరిధిలో 41,273 ఎలక్ట్రికల్ వాహనాలకు రిజిస్ర్టేషన్లు జరగగా, 2025-26లో 56,195 ఈవీలకు రిజిస్ర్టేషన్ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయి.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వాహనాలకు పన్ను రాయితీలు కల్పిస్తోంది. దీంతో వాహన రేంజ్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు భారం తగ్గుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని పెట్రోల్ బంకులలోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకం కూడా దోహదపడుతోంది.
ద్విచక్రవాహనాలదే జోరు
ఈవీల కొనుగోళ్లలో ద్విచక్ర వాహనాలదే అగ్రస్థానం. 2024-25లో 32,450 ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయగా, 2025-26లో 44,120 కొన్నారు. ఏడాదిలో 11,670 ద్విచక్ర వాహనాల విక్రయాలు పెరిగాయి. 35.96 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఈవీ అమ్మకాలలో కార్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. 2024-25లో 4,125 కార్లను కొనుగోలు చేయగా, 2025-26లో 5,680 కార్ల విక్రయాలు జరిగాయి. ఎక్కువగా కోస్తా జిల్లాలకు చెందినవారు కొన్నారని అంచనా. మొత్తం మీద కార్ల కొనుగోళ్లలో 37.69 శాతం వృద్ధి నమోదైంది. మూడు చక్రాల ప్యాసెంజర్-గూడ్స్ వాహనాలు, ఈ-సైకిళ్లు, బస్సుల కొనుగోలు సంఖ్య కూడా పెరిగింది. మూడు చక్రాల ప్రయాణికుల వాహనాలను 2024-25లో 2,840, 2025-26లో 3,950 కొనుగోలు చేశారు. 39.08 శాతం వృద్ధి నమోదైంది. మూడు చక్రాల సరకు వాహనాలను 2024-25లో 1180, 2025-26లో 1510 కొనుగోలు చేశారు. మొత్తంగా 330 వాహనాలు పెరగగా, 27.96 శాతం వృద్ధి నమోదైంది. ఈ-రిక్షా, ఈ-సైకిల్, ఓమ్ని బస్సులకు సంబంధించి చూస్తే.. 2024-25లో 678, 2025-26లో 935 వాహనాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 257 వాహనాల పెరుగుదలతో 37.97 శాతం వృద్ధి నమోదైంది.
ప్రధాన నగరాలలో డిమాండ్
రాష్ట్రంలో విజయవాడ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో ఈవీ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ద్విచక్ర వాహనాలతో పాటు కమర్షియల్ ఈ-ఆటోలు, ఎలక్ర్టికల్ కార్ల రిజిస్ర్టేషన్లు అత్యధికంగా జరిగాయి. తిరుపతి ఆర్టీఏ కార్యాలయం పరిధిలో ఈ-రిక్షా (త్రీ వీలర్స్) సంఖ్య గణనీయంగా పెరిగింది. కాకినాడ, రాజమండ్రి ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో రెండు నగరాలలో ఎలక్ర్టికల్ ద్విచక్ర వాహనాలు పెరిగాయి. వేగంగా విస్తరిస్తున్న ఇతర ముఖ్యపట్టణాల విషయానికి వస్తే.. అనంతపురం ఆర్టీఏ కార్యాలయం పరిధిలో గూడ్స్, ప్యాసింజర్ (త్రీ వీలర్), టూ వీలర్ల సంఖ్య పెరిగింది. భీమవరం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోలులో పురోగతి ఉంది. బాపట్ల, నరసారావుపేట, చీరాల, కావలి వంటి రవాణా యూనిట్ కార్యాలయాల పరిధిలో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో ఎలక్ర్టికల్ వాహనాలకు రిజిస్ర్టేషన్ జరిగింది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న, మధ్య తరహా పట్టణ ప్రాంతాలలో కూడా ఈవీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
విశాఖలో టూ వీలర్ కావాలంటే 15 రోజులు ఆగాల్సిందే
విశాఖపట్నం, మే 23(ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాక విశాఖపట్నంలో ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ప్రధాని మోదీ పిలుపును అందుకొని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈవీ కార్లను వాడుతున్నారు. విశాఖ సిటీలో ఎలక్ర్టిక్ కార్లు, స్కూటీలు కలిపి 26,257 ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఈ-కార్లు, స్కూటీలు బుక్ చేసుకున్న వెంటనే డెలివరీ ఇచ్చేవారు. ఉదయం వెళితే సాయంత్రానికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ నడుస్తోంది. స్కూటీల కోసం కనీసం రెండు వారాలు ఆగాలని డీలర్లు చెబుతున్నారు. వీటికి ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది.