Share News

APSRTC Crisis: విద్యుత్‌ బస్సు.. ఎప్పుడు వచ్చు

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:00 AM

రాష్ట్రంలో విద్యుత్‌ బస్సుల వ్యవహారం ప్రకటనలకే పరిమితమవుతోంది. అన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్‌(ఈవీ) బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

APSRTC Crisis: విద్యుత్‌ బస్సు.. ఎప్పుడు వచ్చు

  • ప్రకటనలకే పరిమితమైన ప్రగతి రథం

  • రాష్ట్రంలో 11 నగరాలకు 750 కేటాయింపు.. అదనంగా మరో 300 కోసం కేంద్రానికి లేఖ

  • 2029నాటికి మొత్తం ‘ఈ-బస్సు’లేనని ప్రకటన

  • 2025లో ఒక్క బస్సూ రాని వైనం

  • ప్రస్తుత ఉన్న వాటిలో సగం కాలం చెల్లినవే

  • క్రిస్మస్‌, సంక్రాంతికి తప్పని ఇబ్బందులు

  • ముందస్తు ప్రణాళికలు చేయని అధికారులు

  • చైర్మన్‌ సహా పాలకమండలి ఎవరిదారి వారిదే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో విద్యుత్‌ బస్సుల వ్యవహారం ప్రకటనలకే పరిమితమవుతోంది. అన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్‌(ఈవీ) బస్సులు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 750 ఈవీ బస్సులు ఇస్తామని చెప్పింది. అయితే, ఇవి సరిపోవని.. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు అదనంగా మరో 300 బస్సులు కావాలని సీఎం చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు 300 అద్దె బస్సులు కూడా విద్యుత్‌వే తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రధాన నగరాలైన విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలుతో పాటు అనంతపురం వంటి 11 నగరాలను ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఎంపిక చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయని చెప్పడంతో ప్రయాణికులు సంతోషంతో ఎదురు చూస్తున్నారు. 2024తో పాటు 2025 కూడా వెళ్లిపోతోంది తప్ప విద్యుత్‌ బస్సులు మాత్రం ఆర్టీసీ డిపోలకు చేరలేదు. రాష్ట్రంలో రోజూ 40 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యం చేరుస్తున్న 10,500 ఏపీఎ్‌సఆర్టీసీ బస్సులు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో 45 లక్షల మందికి పైగా ప్రయాణ సేవలు అందిస్తున్నాయి. వాటిలో అద్దె బస్సులు మినహాయిస్తే ఆర్టీసీ సొంత బస్సులు 8,275 ఉన్నాయి. అయితే, వీటిలో కాలం చెల్లినవి చాలానే ఉన్నాయి. 12 లక్షల కిలో మీటర్లు తిరిగిన బస్సులు 1,954(అక్టోబరు నాటికి), 15లక్షల కి.మీ. దాటినవి 2,626 బస్సులు ఉన్నాయి. అంటే మొత్తం 8,257 ఆర్టీసీ బస్సుల్లో పక్కన పెట్టాల్సినవి 4,580 వరకు ఉన్నాయని తెలుస్తోంది. రవాణా శాఖ మార్గదర్శకాలతో పాటు విద్యుత్‌ బస్సులు రాగానే 13 లక్షల కి.మీ. దాటిన సిటీ ఆర్డినరీ బస్సులు, 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సు లు, పల్లె వెలుగు, 10లక్షల కి.మీ. దాటిన సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌, 8 లక్షలు నడిచిన ఎక్స్‌ప్రె్‌సలు, మెట్రో సర్వీసులు, ఆరున్నర లక్షల కి.మీ. ప్రయాణించిన సప్తగిరి(తిరుమల ఘాట్‌) బస్సులు పక్కన బెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ బస్సుల రాక ఆలస్యంతో పాతవి పక్కన పెట్టలేక, డొక్కు బస్సులతో ప్రయాణ సేవలు అందించలేక యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రవాణా మంత్రి సొంత జిల్లా(అన్నమయ్య)లోని బస్సుల్లోనే 45 శాతం బస్సులు డొక్కువి ఉండటం. రాష్ట్రంలో ఇటీవల ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు డ్రైవర్లు, అధికారులను భయపెడుతున్నాయి.


పండగ సీజన్‌ గట్టెక్కేదెలా..

రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు హైదరాబాద్‌, బెంగళూరు నగరాల నుంచి సంక్రాంతికి లక్షలాది మంది ప్రజలు వస్తారు. ప్రతి ఏటా డిసెంబరు మూడో వారం నుంచి క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి నేపథ్యంలో వందలాది బస్సులు అదనంగా నడుపుతున్నారు. రాష్ట్రంలోని పలు డిపోల నుంచి హైదరాబాద్‌కు వేల సంఖ్యలో, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వందల సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. ఈ ఏడాది డిసెంబరు మూడో వారం గడిచి పోయినా అదనపు బస్సుల ఊసే వినిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రతి డిపోలో కనీసం పది-20 బస్సుల వరకు అదనంగా అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బస్సుల కొరత ఉంటే పొ రుగు రాష్ట్రాలకు ప్రత్యేక సర్వీసులు నడప డం ఎలాగో అర్థం కావట్లేదని అంటున్నారు.

మళ్లీ ఇక్కట్లే: గత ఏడాది జనవరి రెండో వారంలో ఎక్కడికక్కడ బస్టాండ్లలో జనం ఆగిపోయారు. హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, విశాఖ, నెల్లూరు తదితర ప్రాంతాలకు ప్రయాణికులు చేరుకున్నా, ఇక్కడి నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు చాలినన్ని బస్సులు లేక ఎక్కడికక్కడ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఈ పరిణామాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించి హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆగమేఘాల మీద రప్పించి సమస్యను పరిష్కరించారు. ఇక, రానున్న సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలాం టి ముందస్తు ఏర్పాట్లు చేశారో వెల్లడించలేదు. దీంతో వచ్చే సంక్రాంతికి ఇక్కట్లు తప్పవనే ఆందోళన వ్యక్తమవు తోంది. గతఅనుభవంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు.


ఎవరి దారి వారిదే..

ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీలో సమస్యలు ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాల్సిన పెద్దలు ఎవరి దారిలో వారు ఉన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి విజయవాడలోని ఆర్టీసీ వైపు కన్నెత్తి చూడడం లేదనే వాదన వినిపిస్తోంది. సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, బోర్డు సభ్యులు, ఆర్టీసీ ఈడీలు ఎవరూ కనీసం సమీక్షించలేదు. ఆర్టీసీ హౌస్‌లో స్పెషల్‌ బస్సుల ప్రస్తావన తీసుకొస్తే ‘మంత్రిది రాయలసీమ దారి, ఎండీది హైదరాబాద్‌ రూటు.. చైర్మన్‌ ఆరోగ్యం బాగలేదంటారు.. ప్రయాణికుల గురించి పట్టించుకునే స్థితిలో ఆర్టీసీ పెద్దలు ఉన్నారా.?’ అని అంటున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 05:02 AM