‘గ్రేటర్’ చేశాకే ఎన్నికలు!
ABN , Publish Date - May 06 , 2026 | 12:41 AM
గ్రేటర్ విజయవాడపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. నగరానికి గ్రేటర్ హోదా ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అతి త్వరలోనే విజయవాడ గ్రేటర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజమండ్రి టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు స్పష్టత ఇవ్వటంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
- గ్రేటర్ విజయవాడపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
- కార్పొరేషన్, విలీన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేనట్లే!
- జనగణన పూర్తయ్యాకే గ్రేటర్ నోటిఫికేషన్
- ఇప్పటికే 64 నుంచి 86 డివిజన్లకు పెంచుతూ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన వీఎంసీ
- గ్రేటర్ విజయవాడ అయితే 120 డివిజన్లుగా మారేందుకు అవకాశం
- 61.88 చ.కిలోమీటర్ల నుంచి 661.79 చ.కిలోమీటర్లుగా విస్తీర్ణం
- గ్రేటర్ విజయవాడను ప్రకటించడానికి ఏడాది సమయం పట్టే అవకాశం!
గ్రేటర్ విజయవాడపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. నగరానికి గ్రేటర్ హోదా ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అతి త్వరలోనే విజయవాడ గ్రేటర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజమండ్రి టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు స్పష్టత ఇవ్వటంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గ్రేటర్ విజయవాడపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నగరానికి గ్రేటర్ హోదా ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరపనున్నట్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వీఎంసీ, విలీన గ్రామాల్లో లేనట్టేనని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కూటమి ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో విజయవాడ గ్రేటర్ అంశాన్ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. గ్రేటర్ ప్రక్రియను చేపడితే ఎన్నికలను ఆపవలసి వస్తోందన్న అభిప్రాయం సీఎం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఆపకుండా గ్రేటర్ చేస్తే.. ఆ తర్వాత సమస్యలు వస్తాయన్న అనుమానాలను ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మొత్తం 75 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ పంచాయతీలన్నింటికీ ఎన్నికలను ముందే నిర్వహించి ఆ తర్వాత గ్రేటర్ ప్రక్రియను ప్రారంభిస్తే సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమను ఐదేళ్లు పరిపాలన సాగించకుండా చేస్తున్నారన్న బలమైన వాదనలను తీసుకువస్తే న్యాయస్థానాల్లో చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా.. గ్రామపంచాయతీల తీర్మానాలను తీసుకోవటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రామపంచాయతీల తీర్మానాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనుకుంటే గ్రేటర్‌లో వాటిని విలీనం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. మేము సానుకూలంగా తీర్మానం చేయకుండానే.. విలీనం చేస్తున్నారని పంచాయతీల పాలకవర్గాలు న్యాయస్థానాలను అశ్రయిస్తే మాత్రం ఈ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే గ్రేటర్ ప్రక్రియను చేపట్టాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. గ్రేటర్ ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా ప్రకటించడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జనగణన జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ ప్రక్రియను చేపట్టడం వీలుపడదు. ఈ లోపు అంతర్గతంగా గ్రేటర్ ప్రక్రియను పూర్తి చేసుకోవటానికి అవకాశం ఉంది.
ఏడాది పాటు ఎన్నికలు ఉండవు!
ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఎన్నికలతో పాటు, గ్రేటర్ విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో ఏడాది పాటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లటానికి నోటిఫికేషన్ ఇస్తే.. వీఎంసీ, 75 గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరిగే అవకాశం లేదు. జనగణన పూర్తయ్యాక గ్రేటర్ విజయవాడను అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి ఏడాది సమయం పడుతుంది.
120 డివిజన్ల పెంపు దిశగా అడుగులు వేయాలి
ప్రస్తుతం నగరంలో 64 డివిజన్లు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 86 డివిజన్లను పెంచుతూ డ్రాఫ్ట్‌ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలి ఉంది. గ్రేటర్‌పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో తక్షణం కార్పొరేషన్ అధికారులు 120 డివిజన్లుగా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం 15 లక్షల లోపు జనాభా ఉంటే 120 డివిజన్లు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాలను కూడా డివిజన్లుగా వర్గీకరించాల్సి ఉంటుంది.
పదిరెట్లు పెరిగిన విస్తీర్ణం
విజయవాడ నగరం 1981లో కార్పొరేషన్ హోదాను సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగున్నర దశాబ్దాల కాలం పాటు విజయవాడ నగరం కేవలం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. గ్రేటర్ విజయవాడ ద్వారా ఒక్కసారిగా విజయవాడ నగర పరిధి పది రెట్లు పెరుగుతుంది. మొత్తంగా 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. విజయవాడ నగరం ఇప్పటికే 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేపథ్యంలో గ్రేటర్ విలీన గ్రామాల పరిధిలో 599.91 చదరపు కిలోమీటర్ల మేర అదనంగా కలపాల్సి ఉంది. గన్నవరం మండలంలో అత్యధికంగా 157.08 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలో 122.56 చదరపు కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 77.66 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు మండలంలో 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు మండలంలో 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ (కృష్ణా)లో 62.51 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు మండలంలో 26.68 చదరపు కిలోమీటర్లు, జి.కొండూరు మండలంలో 23.72 చదరపు కిలోమీటర్ల మేర గ్రేటర్ విజయవాడలో అంతర్భాగమవుతుంది.
విలీనమయ్యే గ్రామాలు ఇవే..
గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా 31 గ్రామాలు
- గన్నవరం మండలంలో అజ్జంపూడి, అల్లాపురం, బీబీగూడెం, బుద్ధవరం, చిన్న అవుటపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, వెంకట నరసింహాపురం, సావారిగూడెం, బూతిమిల్లిపాడు, సూరంపల్లి, తెంపల్లి, వెదురుపావులూరు, కొండపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహాపురం(పీ) మొత్తం 19 గ్రామాలు.
- ఉంగుటూరు మండలంలో అత్కూరు, పెద అవుటపల్లి గ్రామలు.
- విజయవాడ రూరల్ (కృష్ణా) మండలంలో అంబాపురం, దోనె ఆత్కూరు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, ఫిర్యాది నైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు మొత్తం 10 గ్రామాలు.
మైలవరం నియోజకవర్గంలో 23 గ్రామాలు
- జి.కొండూరు మండలంలో కడియం పోతవరం, కవులూరు గ్రామాలు.
- ఇబ్రహీంపట్నం మండలంలో ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, జూపూడి, కొండపల్లి, మల్కాపురం, తుమ్మలపాలెం, కేతనకొండ, మూలపాడు, నవీపోతవరం, త్రిలోచనాపురం, జమీ మాచవరం మొత్తం 13 గ్రామాలు.
- విజయవాడ రూరల్ (ఎన్టీఆర్) మండలంలో గొల్లపూడి, జక్కంపూడి, కొత్తూరు, పైడూరుపాడు, రాయనపాడు, షాబాద, తాడేపల్లి, వేమరం మొత్తం 8 గ్రామాలు.
పెనమలూరు నియోజకవర్గం 19 గ్రామాలు
- కంకిపాడు మండలంలో ఈడ్పుగల్లు, గోసాల, కంకిపాడు, పునాదిపాడు, ఉప్పులూరు. వేల్పూరు, దావులూరు, గొడవర్రు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు మొత్తం 11 గ్రామాలు.
- పెనమలూరు మండలంలో యనమలకుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప, వణుకూరు మొత్తం 8 గ్రామపంచాయతీలు.