కరెన్సీపై ఎన్నికల ఎఫెక్ట్!
ABN , Publish Date - May 12 , 2026 | 05:41 AM
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు ఉపసంహరణలు పెరిగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో కొన్ని రోజులుగా కరెన్సీ కష్టాలు నెలకొన్నాయి.
5 రాష్ర్టాల ఎలక్షన్స్‌తో పెరిగిన ఉపసంహరణలు
బ్యాంకుల్లో నిధుల కొరత
పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రం
ఆర్‌బీఐని ఆశ్రయించిన బ్యాంకులు
విజయవాడ, మే 11(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు ఉపసంహరణలు పెరిగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో కొన్ని రోజులుగా కరెన్సీ కష్టాలు నెలకొన్నాయి. అయితే, సోమవారం సాయంత్రానికి కొంత ఉపశమనం లభించినట్టు తెలిసింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో.. ప్రచార వ్యయం, అభ్యర్థుల ఖర్చు, నగదు పంపిణీ ఇలా అనేక కారణాలతో ఉపసంహరణలు పెరిగాయి. ఆయా బ్యాంకులకు ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో నగదు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఎన్నికలు లేని రాష్ట్రాల్లో నగదుకు కొరత ఏర్పడింది. వాస్తవానికి ఎలక్షన్ల సమయంలో బ్యాంకుల నుంచి అసాధారణ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగకుండా చూస్తారు. కానీ, ఈ దఫా బ్యాంకుల నుంచి చిన్న మొత్తాల రూపంలో నగదు ఉపసంహరణ చేయించటం ద్వారా రాజకీయ పార్టీల అభ్యర్థులకు డబ్బులు చేరినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా నిల్వలు తగ్గిపోవటంతో బ్యాంకులు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వరుస సెలవులు కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. బ్యాంకులు, ఏటీఎం విత్‌డ్రాయల్స్ కోసం తగినంత డబ్బు లేకపోవటంతో వినియోగదారులు ఇరకాటంలో పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు డ్రా చేయటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని బ్యాంకుల అధికారులు తెలిపారు.
స్పందించిన ఆర్బీఐ
ప్రస్తుతం నెలకొన్న కరెన్సీ కొరత నేపథ్యంలో ఆర్‌బీఐ తన దగ్గర ఉన్న డబ్బును కరెన్సీ చెస్ట్‌లకు పంపిస్తోంది. అయితే, నగదు చెస్ట్‌లకు రావటంలో కూడా జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది. దీనికితోడు ప్రతి శుక్రవారం బ్యాంకుల్లో నగదు ఉంచకపోవడం, శని, ఆదివారాలు సెలవు దినాలు కావటంతో సోమవారం సొమ్ములు లేక.. వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా, ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి కరెన్సీ చెస్ట్‌ల నుంచి డబ్బు రావటంతో బ్యాంకులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, వినియోగదారులు, బ్యాంకుల అవసరాలకు సరిపడా డబ్బులు వచ్చాయా?.. లేక, ఇంకా కొరత ఉందా? అన్నది మంగళవారం తెలియనుంది.