‘సర్’ పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:56 AM
రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్లుగా నియమించింది.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్లుగా నియమించింది. గురువారం ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారులకు(డీఈవోలు), ఎన్నికల నమోదు అధికారులు(ఈఆర్‌వోలు) చేపడుతున్న పనులను సమీక్షిస్తూ, లోపాలను సకాలంలో సరిదిద్దేలా వీరు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సక్రమంగా సాగుతుందో లేదో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారంలో జిల్లా ఎన్నికల అధికారులతో వీరు సమన్వయం చేసుకుంటారు. ప్రతి పరిశీలకుడు తనకు కేటాయించిన జిల్లాను ప్రత్యేక సవరణ కాలంలో కనీసం మూడు సార్లు సందర్శించాలి. మొదటి పర్యటన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ దశలో, రెండో పర్యటన వాటి పరిష్కార దశలో, మూడో పర్యటన బీఎల్‌వోలు వర్కింగ్ కాపీల పరిశీలన, అనుబంధ జాబితాల ప్రచురణ సమయంలో నిర్వహించనున్నారు.