Share News

ఎల్‌నినోను ఎదుర్కొందాం వేసవిలో మండుటెండలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:32 AM

రాష్ట్రానికి ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌నినోను ఎదుర్కొందాం వేసవిలో మండుటెండలు

అమరావతి, విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ రోజులు పొడి వాతావరణం కొనసాగడం ఎల్‌నినో ప్రత్యేకతలు. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయి. ముఖ్యంగా మార్చి, మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా, ఏప్రిల్‌లో సాధారణంగా ఉండనున్నాయి. జూన్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రమంతా సాధారణ స్థాయిని మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నైరుతి రుతుపవన కాలంలో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌ పంటలకు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. జూలై, ఆగస్టులో కరువు లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా గత దశాబ్దకాలంలో రాష్ట్రంలో 2015, 2016, 2018లోనూ ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడగా, 2018లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ప్రభావం ఉండొచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో 11-12ు లోటు వర్షపాతం ప్రభావం చూపే జిల్లాల్లో ఏలూరు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అల్లూరి, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, కోనసీమ ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ విషయాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ వివరించారు. కాగా, వేసవి నేపథ్యంలో పండ్ల తోటలకు నీటి లభ్యతపై ఉద్యాన శాఖ దృష్టి పెట్టింది. అన్ని జిల్లాల్లో వేడి గాలుల సమయంలో పంటలను కాపాడుకోవాలని రైతులకు సంక్షిప్త సందేశాలు పంపడం, సూక్ష్మనీటి పారుదల విధానాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించారు.

పెరగనున్న ఎండలు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో గరిష్ఠంగా 37.7 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని, ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎల్‌నినో సన్నద్ధత చర్యలు

ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని గ్రామీణ మండలాలను కవర్‌ చేస్తూ ఉత్తమ సహజ వ్యవసాయ పద్ధతులపై ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనున్నది. వర్షాధార ప్రాంతాల్లో వర్షాకాలం ముందస్తు వ్యవసాయ విధానాలు, ఉద్యాన పంటల సాగు, పంట వైవిధ్యం, పశుగ్రాస లభ్యత కోసం గడ్డి జాతుల పెంపకం, గుళిక విత్తనాలను ప్రోత్సహించడం, నీటి పారుదల ఉన్న తోటల్లో అంతర పంటల సాగు వంటి చర్యలను అధికారులు ప్రతిపాదించారు.

Updated Date - Mar 12 , 2026 | 03:32 AM