Share News

రుతుపవనాలపై ఎల్‌నినో పిడుగు

ABN , Publish Date - May 30 , 2026 | 04:13 AM

దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఈసారి ‘ఎల్‌నినో’ పిడుగు పడనుంది.

రుతుపవనాలపై ఎల్‌నినో పిడుగు

  • నైరుతిలో సగటు వర్షపాతం 90 శాతమే.. ఈసారి సాధారణం కంటే తక్కువ

  • గత అంచనాలను మరింత కుదించిన ఐఎండీ.. ఏపీ రైతులకు కాస్త ఊరట

  • రాష్ట్రంలోని సగం ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వానలు

విశాఖపట్నం, మే 29(ఆంధ్రజ్యోతి): దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఈసారి ‘ఎల్‌నినో’ పిడుగు పడనుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు గల నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. దీర్ఘకాల సగటు (87 సెంటీమీటర్లు)లో 90 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు వచ్చే నైరుతి సీజన్‌లో దేశంలో 92 శాతం వర్షపాతం (అటుఇటు నాలుగు శాతం) నమోదవుతుందని ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనా నివేదికను ఐఎండీ సవరించింది. ఈశాన్య భారతం తప్ప దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. జూన్‌లో ఉత్తర, మధ్య, తూర్పు భారతంతోపాటు దక్షిణాదిలోని ఏపీలో వడగాడ్పులు వీయనున్నాయని పేర్కొంది. నైరుతి సీజన్‌ ప్రారంభమయ్యే జూన్‌లో ఎల్‌నినో పరిస్థితులు ఆవిర్భవిస్తాయని, ప్రారంభంలో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాతి నెలల్లో ఎల్‌నినో బలపడుతుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్రా తెలిపారు.


కోర్‌ జోన్‌లో సాధారణం కంటే తక్కువ

1971 నుంచి 2020 వరకు కురిసిన వర్షపాతాన్ని అంచనాగా తీసుకుని దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) లెక్కిస్తారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో ఈశాన్య భారతంలో ఎల్‌పీఏలో 94 నుంచి 106 శాతం సాధారణ వర్షపాతం కురుస్తుందని ఐఎండీ తాజా అంచనాల్లో పేర్కొంది. తూర్పు, మధ్య, దక్షిణ భారతంలో 94 శాతం కంటే తక్కువగా, వాయవ్య భారతం లో 92 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుంది. దేశంలోని వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో అధిక భాగాన్ని కలిగివున్న ‘మాన్‌సూన్‌ కోర్‌జోన్‌(మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు)లో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. వర్షాలకు సంబంధించి వాతావరణ అంచనా మోడల్‌ మేరకు(ఫోర్‌కాస్ట్‌ ప్రోబబిలిటి) నైరుతి సీజన్‌లో 60 శాతం లోటు వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు ప్రారంభమైన జూన్‌లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలు, ఉత్తర తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే జూన్‌లో దేశంలో అనేక ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదు కావడంతోపాటు, ఒడిశా, ఏపీల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తాజా బులెటిన్‌లో హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు దేశంలో నైరుతి రుతపవనాలపై ప్రభావం చూపి వర్షాలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది.


ఏపీలోని సగం ప్రాంతాల్లో బెటర్‌!

నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏపీలోని సగం ప్రాం తాల్లో సాధారణం, అంత కంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో దీర్ఘకాల సగటు కంటే ఎక్కువగా, మధ్య కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కానుంది. అయితే తెలంగాణలో ఎక్కువ ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా డెల్టాలో వర్షాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురి స్తే.. దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమ జిల్లాలకు కొంత మేలు జరుగుతుందన్నారు. జూన్‌లో రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలు, దక్షిణ కోస్తా లో పలుచోట్ల ఎక్కువగా, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో తక్కవగా వర్షాలు కురుస్తాయని, దీనివల్ల కోస్తాలో వడగాడ్పులు, ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

Updated Date - May 30 , 2026 | 04:16 AM