Share News

జూలై చివరికల్లా ఎల్‌నినో?

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:39 AM

గత రెండేళ్లు నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. లానినా, ఆ తరువాత తటస్థ పరిస్థితులతో మంచి వర్షాలకు అవకాశం కలిగింది.

జూలై చివరికల్లా ఎల్‌నినో?

  • ఆసియా, పసిఫిక్‌ క్లైమెట్‌ సెంటర్‌ అంచనా.. నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం

  • వర్షాలు తక్కువగా కురుస్తాయని ఆందోళన

  • మార్చి నాటికి మరింత స్పష్టత: స్కైమెట్‌

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లు నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. లానినా, ఆ తరువాత తటస్థ పరిస్థితులతో మంచి వర్షాలకు అవకాశం కలిగింది. అయితే ఈ ఏడాది వర్షాల జోరు తగ్గనున్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. జూలై నెలాఖరుకల్లా ఎల్‌నినో ఏర్పడుతుందని పేర్కొంది. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా, పసిఫిక్‌ క్లైమెట్‌ సెంటర్‌ (ఏపీసీసీ) తాజాగా విడుదల చేసిన వాతావరణ అంచనా నివేదిక వివరాలను స్కైమెట్‌ శనివారం తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీసీసీ అంచనా ప్రకారం గత నెల నుంచి లానినా బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెలకు పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఏప్రిల్‌ నెలలో తటస్థ పరిస్థితుల ప్రభావం బలహీనపడి ఎల్‌నినో వైపు మారనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై నెలాఖరుకు ఎల్‌నినో ఏర్పడుతుందని ఏపీసీసీ అంచనా వేసినట్లు స్కైమెట్‌ పేర్కొంది. దీనివల్ల నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో పూర్తి స్పష్టత వస్తుందని స్కైమెట్‌ వివరించింది. కాగా, పసిఫిక్‌ మహాసముద్రంలోని భూమధ్య రేఖ సమీపంలో ఉన్న ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కడాన్ని ఎల్‌నినో అంటారు. దీని ప్రభావం భారత్‌లోని నైరుతి రుతుపవ నాలపై పడి వర్షాలు తగ్గుతాయి. ఎల్‌నినోకు పూర్తి విరుద్ధంగా ఉండే లానినా పరిస్థితుల్లో పుష్కలంగా వర్షాలు పడతాయి.


నేడు పలుచోట్ల వర్షాలు

సముద్రం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో శ్రీలంక, తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి విస్తరించింది. దీంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు తమిళనాడు మీదుగా రాయలసీమ, దక్షిణ కోస్తావైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుతుందని, ఉత్తరకోస్తాలో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:39 AM