రబీకీ ఎల్‌నినో గండం
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:25 AM
ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ కంటే రబీ సీజన్‌పై తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ‘వర్షాలు తక్కువగా ఉండటంతో ఖరీఫ్ సాగు తగ్గింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం
ఖరీఫ్‌లో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం
30.84 లక్షల హెక్టార్లకుగాను 16.78 హెక్టార్లలోనే పంటలు
ఎల్‌నినో మరింత బలపడే అవకాశాలు
భూతాపం కూడా తోడైతే మరింత గడ్డుకాలం
డిసెంబరు వరకూ ప్రతికూల పరిస్థితులే?
వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక
ఎల్‌నినో ప్రభావంపై రంగా వర్సిటీలో వర్క్‌షాపు
గుంటూరు సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ కంటే రబీ సీజన్‌పై తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ‘వర్షాలు తక్కువగా ఉండటంతో ఖరీఫ్ సాగు తగ్గింది. భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువుల్లో నీరు తగ్గితే దాని ప్రభావం రబీపై పడుతుంది. రబీ పంటలకు అవసరమైన నీరు అందకపోతే సాగు విస్తీర్ణం మరింత తగ్గే ప్రమాదం ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి పీవీ సత్యనారాయణ అధ్యక్షతన గురువారం ఎల్‌నినో-2026 కార్యాచరణ ప్రణాళిక వర్క్‌షా్‌ప జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎల్‌నినో మరింత బలపడే సూచనలు ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత లోటు కొనసాగడం, ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో వచ్చే రబీ సీజన్‌పై ముందుగానే అప్రమత్తం కావాలని చెప్పారు.
28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం
జూన్ 1 నుంచి ఆగస్టు 19 వరకు ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా 75.4 శాతం లోటు నమోదైంది. ప్రకాశంలో 67.1, చిత్తూరులో 65.7, వైఎస్సార్ జిల్లాలో 52.3, బాపట్లలో 52.7, పల్నాడులో 47.3, గుంటూరు జిల్లాలో 44.2 శాతం లోటు ఉంది. పశ్చిమగోదావరిలో 56.4 శాతం, తూర్పుగోదావరిలో 56, కోనసీమలో 52.6, కాకినాడలో 46.3, ఏలూరులో 46.2 శాతం లోటు నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో 54.3, శ్రీకాకుళంలో 51.2, అనకాపల్లిలో 47.3 శాతం లోటు ఉంది. రాయలసీమలోని అనంతపురంలో 39, సత్యసాయి జిల్లాలో 55.9, కర్నూలులో 36.6, నంద్యాలలో 49.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు 21 నుంచి 27 వరకు రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరుగా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
16.78 లక్షల హెక్టార్లలోనే పంటలు
ఆగస్టు 12 నాటికి రాష్ట్రంలో సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లకు గాను 16.78 లక్షల హెక్టార్లలోనే (54 శాతం) పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 17.99 లక్షల హెక్టార్లలో సాగైంది. గత ఏడాదితో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిన జిల్లాల్లో విజయనగరం ముందుంది. గత ఏడాది ఆగస్టు 12 నాటికి 55,856 హెక్టార్లలో సాగవ్వగా, ఈ ఏడాది 29,882 హెక్టార్లకే పరిమితమైంది. విశాఖపట్నంలో 1,280 నుంచి 749, అనకాపల్లిలో 7,810 నుంచి 5,931, కాకినాడలో 63,300 నుంచి 49,037, ఏలూరులో 65,077 నుంచి 47,448 హెక్టార్లకు సాగు తగ్గింది. కృష్ణా ప్రాంతంలోనూ సాగు తగ్గుదల కనిపించింది. కృష్ణా జిల్లాలో 1,24,023 నుంచి 1,05,601, ఎన్టీఆర్ జిల్లాలో 69,047 నుంచి 47,605, గుంటూరులో 52,892 నుంచి 33,297, పల్నాడులో 51,610 నుంచి 39,758 హెక్టార్లకు సాగు పడిపోయింది. బాపట్లలో 27,812 నుంచి 26,912, ప్రకాశంలో 7,400 నుంచి 4,933 హెక్టార్లకు సాగు తగ్గింది. అనంతపురంలో 1,50,998 నుంచి 1,60,659 హెక్టార్లకు సాగు పెరిగినా.. సత్యసాయి, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు తదితర జిల్లాల్లో సాధారణ లక్ష్యాలతో పోలిస్తే సాగు వెనకబడింది. దీంతో ప్రధాన పంటల సాగు కూడా ఆశించిన స్థాయిలో లేదు. వరి సాధారణ సీజన్ విస్తీర్ణం 15.14 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 8.17 లక్షల హెక్టార్లలోనే సాగైంది. పత్తి మాత్రం 3.60 లక్షల హెక్టార్లలో సాగై గత ఏడాదికంటే మెరుగ్గా ఉంది.
ఎల్‌నినో మరింత బలపడే అవకాశం!
ఆగస్టు 13న నవీకరించిన అంచనాల ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరులో అత్యంత బలమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశం 95 శాతం ఉంది. 2026-27లోనూ ఎల్‌నినో కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఐఎండీ కూడా ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇవి బలపడే అవకాశం ఉందని తాజా నివేదికలో పేర్కొంది.
భూతాపం కూడా పెరిగితే మరింత ముప్పు
ఎల్‌నినోకు తోడు భూతాపం పెరుగుతున్న పరిస్థితులు వ్యవసాయంపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగితే నేలలో తేమ త్వరగా తగ్గడంతోపాటు పంటలకు నీటి అవసరం పెరుగుతుంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు కలిస్తే వర్షాధార పంటలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ‘వాతావరణం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రైతులు నిర్ణయాలు తీసుకోవాలి. వాతావరణ సూచనలను ఆధారంగా చేసుకుని విత్తనాలు, ఎరువులు వేయడం, మందుల పిచికారీ, కోత వంటి పనులు చేపట్టాలి. నీటిని పొదుపుగా వినియోగించాలి’ అని శాస్త్రవేత్తలు సూచించారు. వర్క్‌షా్‌పలో రీసెర్చ్ డైరెక్టర్ సుమతి, ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ జి.రామచంద్రరావు, రిజిస్ర్టార్ ఎ.మణి, పరిశోధనా శాస్త్రవేత్తలు జీవీ సునీల్‌కుమార్, జి.నారాయణస్వామి, కేవీ రావు (ఐకార్-క్రిడా) తదితరులు పాల్గొన్నారు.