Share News

చినుకు రాలక.. వరదలూ రాక విలవిల..

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:15 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆకాశంలో చినుకు జాడ లేదు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి.

చినుకు రాలక.. వరదలూ రాక విలవిల..

  • రాష్ట్రంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం.. ముఖం చాటేసిన వానలు, వరదలు

  • ఎగువ రాష్ట్రాల్లోనూ ఇదే దుస్థితి.. కృష్ణా నదిలో కనిపించని నీటి జాడ

  • అడుగంటిన శ్రీశైలం జలాశయం.. సాగు, తాగునీటికి కటకటే

  • పశ్చిమ కర్నూలు జిల్లాకు తుంగభద్ర దిగువ కాలువే ఆధారం

  • ఆ నదిలోనూ నీరు లేక ఎండిపోతున్న ఎస్‌ఎస్‌ ట్యాంకులు

  • మరో 20 రోజులకే సరిపడా నీరు.. ఈలోపు వరద రాకుంటే కష్టాలే

  • బిందెలతో రోడ్లెక్కక తప్పదు.. తుంగభద్రకు అరకొరగా ప్రవాహం

  • గోదావరి నదికీ ఇంతవరకు వరద లేదు.. సర్వత్రా ఆందోళన

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆకాశంలో చినుకు జాడ లేదు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. వర్షాలు మాత్రం ముఖం చాటేశాయి. ఆకాశంలో మేఘాలు కరిగి వర్షించాల్సిన సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో పంజా విసరడంతో భూగర్భ జలాలు పడిపోవడమే కాక.. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు సైతం ప్రమాదకర స్థాయికి చేరాయి. ఎగువన కర్ణాటకలో సైతం వర్షాలు లేవు. ఆ పైన ఉన్న మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నా.. వరదలు వచ్చేంతగా పడడం లేదు. ఇటు శ్రీశైలం జలాశయం దాదాపు అడుగంటిపోయింది. తుంగభద్ర జలాశయానికి సోమవారమే కాస్త ప్రవాహం మొదలైంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి తుంగభద్ర దిగువ కాలువే (ఎల్‌ఎల్‌సీ) ఆధారం. దీని పరిధిలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నీటి నిల్వలు అడుగంటి.. ఒట్టిపోతుంటే జనం భయాందోళనలకు గురవుతున్నారు.


(కర్నూలు/అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాయలసీమ జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.213 టీఎంసీలే ఉన్నాయి. నిరుడు వరదలు పోటెత్తడంతో ఇదే సమయానికి దాదాపు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండేది. 83.147 టీఎంసీలు చేరాయి. జూలై 10వ తేదీకి గరిష్ఠ నీటిమట్టం దాటడంతో శ్రీశైలం గేట్లెత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడపలో 3.95 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం ప్రమాద సంకేతాలు పంపుతోంది. ప్రస్తుతం 9.379 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.790 టీఎంసీలు. గతేడాది ఇదే సమయానికి డ్యాంకు వరద మొదలై 41.856 టీఎంసీల వరద చేరింది. జూలై నెలాఖరునాటికి 68 టీఎంసీలు చేరడమే కాకుండా 65,187 క్యూసెక్కుల వరద కొనసాగింది. ఈ ఏడాది ఇంతవరకు ఆ పరిస్థితి లేదు. సోమవారం మాత్రం కాస్త వరద మొదలైంది. డ్యాం పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా సోమవారం ఉదయం 1550 క్యూసెక్కుల ప్రవాహం మొదలై.. సాయంత్రానికి 2159 క్యూసెక్కులకు పెరిగింది. డ్యాం ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తుంగ జలాశయం నిండడంతో పది క్రస్ట్‌ గేట్లను ఎత్తి 22,174 క్యూసెక్కుల నీటిని సోమవారం దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి ఎలాంటి ప్రవాహం లేదు. సాగర్‌ నీటిమట్టం సోమవారం నాటికి 513.90 అడుగులు ఉంది. ఇది 138.387 టీఎంసీలకు సమానం. పులిచింతల ప్రాజెక్టులో సోమవారం 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

పశ్చిమ కర్నూలు విలవిల..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎస్‌.నాగులాపురం, గుడేకల్లు, మాచుమాన్‌దొడ్డి, కందనాతి, కడివెళ్ల, మసీదుపురం, వెంకటగిరి.. ఏడు గ్రామాల్లో 35 వేల జనాభాకు తాగునీరు అందించడానికి తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ ఆధారంగా ఎస్‌.నాగులాపురం వద్ద 2.25 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటినిల్వ సామర్థ్యంతో సమ్మర్‌ స్టోరేజ్‌ (ఎస్‌ఎస్‌) ట్యాంకు నిర్మించారు. ఈ ఏడాది మార్చి ఆఖరులో పూర్తి స్థాయిలో నింపారు. ఎన్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక.. ఉన్న నీటి నిల్వలు ఖాళీ కావడంతో ఇప్పుడా ట్యాంకు ఎండిపోతోంది. వారం పది రోజులకు సరిపోయే నీరు కూడా లేదు. వారం పది రోజులుగా కుళాయిలకు తాగునీరు సరఫరా లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏ పల్లెకు వెళ్లినా కన్నీటి సుడులే. తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ పరిధిలో 252 గ్రామాల్లో దాదాపు 12-13 లక్షల జనాభాకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలనే లక్ష్యంగా 26 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) నిర్మించారు. మార్చి తర్వాత మూడు నాలుగు నెలలకు (90-120 రోజులు) సరిపడా నీటి నిల్వలు ఉండేలా ఎస్‌ఎస్‌ ట్యాంకులు డిజైన్‌ చేశారు. అయితే.. ఈ ఏడాది తుంగభద్ర నదికి వరద చేరక ఎల్‌ఎల్‌సీకి నీరు విడుదల చేయలేదు. ఫలితంగా ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో నీటి నిల్వలు ఖాళీ అవుతున్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు పలు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా, అవసరానికి సరిపడా అందడం లేదని ప్రజలు ఏకరువు పెడుతున్నారు. 8 ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో 10-15 రోజులు, మరో 8 ట్యాంకుల్లో 25-30 రోజులు, ఏడింట్లో 30-50 రోజులు, ఇంకో మూడు ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో 60 రోజులకుపైబడి తాగునీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తితే తప్ప తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. ఉన్న నీటి నిల్వలు ఖాళీ అయితే.. బిందెలతో జనం రోడ్లెక్కక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.


తాగునీటిపై ఆందోళన..

రాష్ట్రంలో ఈ ఏడాది సాగుకే కాకుండా తాగునీటికీ కటకట తప్పదన్న ఆందోళన నెలకొంది. 113 జలాశయాల్లో ప్రస్తుతం 413.12 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. భూగర్భ జలాలు 9.58 మీటర్ల లోతులో ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ ట్యాంకుల్లో 88.23 టీఎంసీలున్నాయి. మీడియం ఇరిగేషన్‌లో 92 టీఎంసీలకు గాను 36.366 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల్లో నీరు అంతంత మాత్రంగానే ఉండడంతో.. ఈ ఖరీఫ్‌లో తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయాలని ప్రభుత్వం రైతాంగానికి సూచిస్తోంది. గోదావరి నదికి కూడా ఈ ఏడాది ఇంకా భారీ వరద మొదలుకాలేదు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినా ఉత్తరాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు కురిసినా.. మిగతా రాష్ట్రంలో చుక్క నేలరాలలేదు.

Updated Date - Jul 07 , 2026 | 05:52 AM