జూన్ తర్వాత ఎల్‌నినో?
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:15 AM
భారత ఉపఖండంలో జూన్ తర్వాత ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం!
విశాఖపట్నం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): భారత ఉపఖండంలో జూన్ తర్వాత ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్‌నినో ఏర్పడేందుకు 50 శాతం అవశాశాలు ఉన్నాయని తాజా బులెటిన్‌లో వెల్లడించింది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నాటికి ఎల్‌నినో ఏర్పడే అవకాశం 70 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఈ నెలలో మాత్రం లానినా కొనసాగుతుందని వివరించింది. గత దశాబ్దకాలంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో భారతదేశంలో కీలకమైన నైరుతి రుతుపవనాలకు ఎల్‌నినోలు అంతరాయం కలిగించాయని స్కైమెట్ పేర్కొంది. కాగా, స్కైమెట్ అంచనాకు అనుగుణంగానే పలు వాతావరణ మోడళ్లు కూడా నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని విశ్లేషిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లానినా పరిస్థితులు బలహీనపడి తటస్థం వైపు వెళ్లేందుకు అనువైన వాతావరణం వేగంగా పెరుగుతోంది. పసిఫిక్ సముద్రం ప్రస్తుతం చల్లగా ఉన్నప్పటికీ వేగంగా మార్పులు సంభవిస్తున్నందున మార్చి, ఏప్రిల్ కల్లా తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఆ తర్వాత ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడనున్నాయని పలువురు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ప్రారంభంలో మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
దక్షిణ కోస్తాకు పొగమంచు హెచ్చరిక
ఉత్తరకోస్తాతోపాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో సోమవారం పొగమంచు కురిసింది. ఇంకా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగింది. పగటిపూట ఎండ ప్రభావం నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా, పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ, ఉత్తర కోస్తాలో మంచు ప్రభావం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట చలి ప్రభావం ఉంటుందని, పగలు ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.