Share News

జూలై తర్వాత ఎల్‌నినో

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:36 AM

ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. గత నెల మూడో వారం నుంచి ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలో ....

జూలై తర్వాత ఎల్‌నినో

  • పసిఫిక్‌ మహాసముద్రంలో బలహీనమవుతున్న లానినా

  • మే వరకు తటస్థ పరిస్థితులు.. వేడెక్కనున్న ప్రపంచ వాతావరణం

  • ‘నైరుతి’పైనా ప్రతికూల ప్రభావం: నిపుణులు

విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. గత నెల మూడో వారం నుంచి ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లానినా క్రమేపీ క్షీణిస్తూ తటస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల నుంచి మే వరకు తటస్థ పరిస్థితులు కొనసాగి ఆ తర్వాత ఎల్‌నినోకు అనుకూలంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై తర్వాత ఎల్‌నినో ఏర్పడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనా ప్రకారం భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం ఉన్న లానినా బలహీన దశకు చేరుకుంది. ఈ క్రమంలో మార్చి నుంచి మే మధ్య తటస్థ పరిస్థితులు ఏర్పడేందుకు 60 శాతం మేరకు, లానినా కొనసాగేందుకు 30 శాతం, ఎల్‌నినో ఏర్పడేందుకు 10 శాతం మేరకు అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌-జూన్‌ మధ్య తటస్థ పరిస్థితుల ప్రభావం 70 శాతంగా ఉంటుంది. ఆ తర్వాత తటస్థ పరిస్థితులు 60 శాతానికి తగ్గుతాయి. అదే సమయంలో ఎల్‌నినో ఏప్రిల్‌-జూన్‌ మధ్య 30 శాతం, మే-జూలై నాటికి 40 శాతానికి పెరగనుంది. దీంతో జూలై తర్వాత క్రమేపీ ఎల్‌నినో మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజా బులెటిన్‌లో పేర్కొంది.

Updated Date - Mar 05 , 2026 | 01:36 AM