Share News

ఎల్‌నినోను ఎదుర్కొనేలా సాగు

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:58 AM

‘సేద్యం పనులు ముమ్మరంగా సాగే వేళలో పైర్లకు నష్టం కలిగించే తుఫాన్లపై అన్నదాతలు ఆందోళనం చెందడం మనం చూశాం. కానీ ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాటినే ఆహ్వానించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎల్‌నినోను ఎదుర్కొనేలా సాగు

  • తుఫాన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది

  • గత 20ఏళ్లలో మూడుసార్లు తీవ్ర వర్షాభావం

  • ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు కొనసాగాలి

  • నీటి నిర్వహణ చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు

  • భూగర్భ జలమట్టాలను పెంచే చర్యలపై దృష్టి

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

బాపట్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘సేద్యం పనులు ముమ్మరంగా సాగే వేళలో పైర్లకు నష్టం కలిగించే తుఫాన్లపై అన్నదాతలు ఆందోళనం చెందడం మనం చూశాం. కానీ ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాటినే ఆహ్వానించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితులు మనకేం కొత్త కాదు. కాకపోతే ఈసారి అది తీవ్రంగా కనిపిస్తోంది. దీనికి విరుగుడుగా రైతులు స్వల్పకాలిక పంటలు వేయాలి. ప్రభుత్వాల వైపునుంచి నీటి నిర్వహణ చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ) డైరెక్టర్‌ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఆయన అదే కళాశాల వేదికగా శనివారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ 58వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సాగు విధానాలనే సవాల్‌ చేస్తున్న సూపర్‌ ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఎల్‌నినో పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

బెట్ట పరిస్థితులు ఎదుర్కొనేలా నేలలు

మా చిన్నప్పుడు పిల్లిపెసర వంటి వాటిని భూమికి సహజంగా అందేలా చూడటంతో నేలలు సారవంతంగా ఉండేవి. వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు ఎదురైనా పైర్లు కొన్ని రోజుల పాటు తట్టుకునేవి. వర్షాభావ ప్రభావం స్వల్పంగానే కనిపించేది. భూమిని సారవంతంగా మార్చడంపై దృష్టిపెట్టాల్సి ఉంది.


గతంతోనూ గడ్డు పరిస్థితులు

ఎల్‌నినో వంటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడే ప్రత్యామ్నాయ సాగుపై చర్చ జరుగుతోంది. గతంలో 2002, 2009, 2014ల్లో కూడా వర్షాభావ పరిస్థితులతో రైతాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. వర్షాభావ పరిస్థితులు లేనప్పుడు రైతాంగం ఎప్పటిలాగానే వరి వంటి సంప్రదాయ పంటల వైపే మొగ్గు చూపుతోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగాన్ని మళ్లించే ప్రణాళికలు నిత్యం కొనసాగితే ఎల్‌నినో లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం తేలికవుతుంది. గత రెండు రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించి రైతులతో మాట్లాడాను. ప్రభుత్వ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పంటల ప్రణాళికలు, జలాశయాల నిర్వహణతో పాటు చెరువుకుంటలు, కరువు పరిస్థితుల పర్యవేక్షణ, భూగర్భ జలమట్టాలను పెంచే చర్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వాలు అడుగులేయడం వంటివన్నీ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా తీసుకుంటున్న చర్యలే.

స్వల్పకాలిక, అంతర పంటలు

మినుము, పెసర, కంది వంటి పప్పు దినుసుల రకాల సాగుపై రైతాంగం దృష్టి పెట్టాలి. వీటితో పాటు రబీ సీజన్‌లో శనగ వంటి రకం, మొక్కజొన్న సాగులో అంతర పంటలుగా స్వల్పకాలిక పైర్లు వేయాలి. ఇవి బెట్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు రెండు మూడు నెలల్లోనే పంట చేతికొస్తుంది. పైగా ఇవన్నీ కూడా ఆరుతడి రకాలే. అంటే తక్కువ నీటితోనే సాగుకు అవకాశం ఉన్న రకాలు. ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కాకుండా లాభసాటి సేద్యంలో భాగంగా రైతులు వీటిని రొటేషన్‌ విధానంలో సాగు చేయాలి. ఈ దిశగా వ్యవసాయ విభాగాలు రైతులకు నిత్యం అవగాహన కల్పించాల్సి ఉంది.


ఎల్‌నినో అంటే వర్షాభావమే

ఎల్‌నినో అంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఏర్పడటమే. వర్షం ఎక్కువగా నమోదవడాన్ని లానినోగా పిలుస్తారు. గతంలో మనం రెండు మూడు సందర్భాల్లో లానినా (ఎక్కువ వర్షం కురవడం) పరిస్థితులను కూడా చూశాం. భూగోళం గతంలో కన్నా అధికంగా వేడెక్కుతున్న సమయంలోనే ఎల్‌నినోలు ఏర్పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దాదాపు 0.85 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల మేర ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళనకరం.

సాగుతో రైతులకు భావోద్వేగ బంధం

ఇప్పటికే పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బెట్ట పరిస్థితులతో ఉండటాన్ని చూసి రైతులు తట్టుకోలేక పోతున్నారు. రైతుకు జీవనోపాధితో పాటు సాగుతో భావోద్వేగంతో కూడిన ఒక బంధం ఉంటుంది. తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడం రైతులకు కష్టంగానే ఉంది. ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికల అమలులో వారిని సిద్ధపరచడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. గతంలో వర్షాభావ పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎదుర్కొంటున్నది కచ్చితంగా గడ్డు పరిస్థితే. కాకపోతే ఇది దీర్ఘకాలం కొనసాగదు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైనా తట్టుకునేలా రైతాంగాన్ని సన్నద్ధం చేయాలి.

Updated Date - Jul 26 , 2026 | 05:00 AM