Share News

ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - May 21 , 2026 | 04:08 AM

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విధానం అమలు చేసేలా రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ.....

ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండండి

  • ప్రకృతి సేద్యం, ఆరుతడి పంటలను ప్రోత్సహించండి

  • వ్యవసాయ, జలవనరుల శాఖలకు సీఎస్‌ సూచన

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విధానం అమలు చేసేలా రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ, జల వనరులశాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా రైతులను వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. నారుమళ్లను వేయకుండా నిరోధించి.. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టనష్టాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ ఏడాది సాగునీరు సంపూర్ణంగా, సకాలంలోనూ అందడం సాధ్యం కాకపోవచ్చన్న సమాచారాన్ని రైతాంగానికి చేరవేయాలని సూచించారు. ఈసారి వరి పంట వేయడం వల్ల నష్టమేనని రైతులను మానసికంగా సిద్ధం చేయాలని ఈ రెండు శాఖలకూ సీఎస్‌ సూచించారు. నీటి వాడకం ఎక్కువగా అవసరంలేని ప్రకృతి సేద్యం, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ, జల వనరుల శాఖలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 26వ తేదీన వ్యవసాయానుబంధ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నందున ఆలోగా ప్రత్యామ్నాయ పంటల విధానంతో సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Updated Date - May 21 , 2026 | 04:08 AM