PVN Madhav: బెజవాడలో 23, 24న ఏకాత్మ మానవ దర్శన్
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:43 AM
సమాజంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలంటే వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ సమగ్రంగా ఆలోచించి త్రికరణ శుద్ధితో పనిచేయడమే ’ఏకాత్మ మానవ దర్శన్...
1965 నాటి చారిత్రక తీర్మానంపై సమీక్ష: మాధవ్
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సమాజంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలంటే వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ సమగ్రంగా ఆలోచించి త్రికరణ శుద్ధితో పనిచేయడమే ’ఏకాత్మ మానవ దర్శన్’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. భవిష్యత్తు భారతావనికి ఏమి అవసరమో 1965 జనవరి 23న విజయవాడలో జరిగిన భారతీయ జన్‌సంఘ్ తీర్మానంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దిశా నిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆదివారం విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్‌సంఘ్ తీసుకున్న నిర్ణయాలు దేశంపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై ఈ నెల 23, 24న పునఃసమీక్ష చేస్తున్నామని చెప్పారు. 60 ఏళ్ల క్రితం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సమగ్ర ఆలోచనా విధానం నేటికీ సమాజానికి దిశా నిర్దేశం చేస్తోందని మాధవ్ తెలిపారు. అప్పటి తీర్మానాలను మననం చేసుకోవడంతో పాటు ప్రధానులుగా అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ దేశానికి ఏం చేశారో ఎగ్జిబిషన్ ద్వారా వివరించబోతున్నట్లు చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు, ఆర్‌ఎ్‌సఎస్ ముఖ్యులు హాజరవుతారని మాధవ్ వెల్లడించారు.