Share News

గుడ్డు.. గుభేల్‌ !

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో కోడి గుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. రెండు వారాల క్రితం వరకూ రూ.6 నుంచి రూ.6.50 దాకా పలికిన ఒక్కో గుడ్డు ధర.. ఇప్పుడు ఏకంగా రూ.7.50 నుంచి రూ.8 మధ్య పలుకుతోంది.

గుడ్డు.. గుభేల్‌ !

  • 2 వారాల్లోనే అమాంతం పెరిగిన ధర.. రిటైల్‌గా రూ. 8 వరకు అమ్మకం

  • ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు పెరిగిన డిమాండ్‌.. ఇరాన్‌ యుద్ధంతో దెబ్బ

  • భారీగా పెరిగిన దాణా ధర.. మౌల్టింగ్‌ ప్రాసె్‌సతో కొంత మేర తగ్గిన ఉత్పత్తి

  • ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోడి గుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. రెండు వారాల క్రితం వరకూ రూ.6 నుంచి రూ.6.50 దాకా పలికిన ఒక్కో గుడ్డు ధర.. ఇప్పుడు ఏకంగా రూ.7.50 నుంచి రూ.8 మధ్య పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్‌తో విదేశాలకు ఎగుమతులు పెరగడం, ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో దాణా ధర భారీగా పెరగడం, మౌల్టింగ్‌ ప్రాసెస్‌ వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గడం.. ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఫలితంగా ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా రైతులు మౌల్టింగ్‌ ప్రాసెస్‌ను చేపడుతుంటారు. ఒక్క కోడికి రోజుకు 120 గ్రాముల దాణా అందించాల్సి ఉంటుంది. కానీ, కోళ్ల బరువును తగ్గించేందుకు ఐదు రోజుల పాటు కేవలం నీటిని మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత మరో ఐదు రోజులు 5 గ్రాముల దాణానే అందిస్తారు. తర్వాత 10, 20 గ్రాముల చొప్పున దాణాను పెంచుతూ పోతారు. ఈ 15 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు.. తిరిగి పూర్తిస్థాయిలో ఫీడింగ్‌ అందించిన 10 రోజుల తర్వాతే గుడ్లు పెట్టడం ప్రారంభమవుతుంది. అంటే.. సుమారుగా 20 రోజుల పాటు గుడ్ల ఉత్పత్తి ఉండదు. ఒకపక్క ఉత్పత్తి తగ్గడం, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరగడం వల్ల గుడ్డు ధర ఆకాశన్నంటుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో దాణా ధరలతోపాటు కార్మికుల వేతనాలు భారీగా పెరగడం వంటి కారణాలు గుడ్డు ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 04:23 AM