Share News

గుడ్డు ధర ఢమాల్‌

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:55 AM

ఓవైపు ఉత్పత్తి అధికంగా ఉండడం, మరోవైపు వినియోగంతో పాటు ఎగుమతులు తగ్గడంతో కోడి గుడ్డు ధర పడిపోయింది.

గుడ్డు ధర ఢమాల్‌

  • 100 గుడ్ల హోల్‌సేల్‌ ధర రూ.420

  • ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం, యుద్ధంతో ఎగుమతులు తగ్గడమే కారణం

విశాఖపట్నం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఓవైపు ఉత్పత్తి అధికంగా ఉండడం, మరోవైపు వినియోగంతో పాటు ఎగుమతులు తగ్గడంతో కోడి గుడ్డు ధర పడిపోయింది. విశాఖ జిల్లాలో 100 గుడ్ల హోల్‌సేల్‌ ధర శనివారం రూ.420గా నెక్‌ వర్గాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో రోజుకు ఫారాల నుంచి దాదాపు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం ఉత్పత్తిలో సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తుండగా.. మిగతావి దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు. అయితే అక్కడ కూడా వినియోగం తగ్గడంతో ధరలు తగ్గాయి. యుద్ధం ప్రభావంతో గల్ఫ్‌ దేశాలకు చెన్నై పోర్టు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయని, ఇది కూడా ధరలపై ప్రభావం చూపిందని కోళ్ల రైతులు పేర్కొంటున్నారు. విశాఖ జిల్లాలో రైతు బజార్‌లో ఒక్కో గుడ్డును రూ.4.45కు విక్రయిస్తున్నారు. బయట చికెన్‌ షాపుల్లో రూ.5 నుంచి రూ.5.50కు, కిరాణా దుకాణాల్లో రూ.6కు అమ్ముతున్నారు. గతేడాది డిసెంబరు 20న 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678కు చేరింది. రిటైల్‌లో గుడ్డు రూ.8కు విక్రయించారు. ఆ తర్వాత ధర నెమ్మదిగా తగ్గినా, గత వారం రోజుల నుంచి మరింతగా పడిపోయింది.

Updated Date - Mar 07 , 2026 | 04:55 AM