అనాథ పిల్లలకూ తల్లికి వందనం
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:08 AM
‘తల్లికి వందనం’ పథకం నిధులు అనాథ పిల్లలకు కూడా అందేలా చర్యలు చేపట్టాలని విద్యామంత్రి లోకేశ్ ఆదేశించారు. వారి సంరక్షకుల వివరాలు సేకరించాలని..
వారి సంరక్షకుల వివరాలు సేకరించాలి
లేదంటే కలెక్టర్ల ద్వారా వారికి అందించాలి
పాఠశాలల ఫీజులు ప్రదర్శించాలి
పబ్లిక్ డొమైన్‌లోనూ అందుబాటులో ఉంచాలి
విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్ ఆదేశం
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ పథకం నిధులు అనాథ పిల్లలకు కూడా అందేలా చర్యలు చేపట్టాలని విద్యామంత్రి లోకేశ్ ఆదేశించారు. వారి సంరక్షకుల వివరాలు సేకరించాలని.. ఎవరూలేని పక్షంలో కలెక్టర్‌కు పంపి, అక్కడి నుంచి పిల్లలకు చేరేలా చూడాలని సూచించారు. చదువు పూర్తయ్యాక ఆ డబ్బును వినియోగించుకునేలా ఒక విధానం రూపొందించాలన్నారు. అది వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను ఆయా పాఠశాలల బయట బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పబ్లిక్ డొమైన్‌లోనూ వాటిని అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. గురువారం ఉండవల్లి నివాసంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. ప్రైవేటు పాఠశాలలకు అనుమతుల విషయంలో అనవసరమైన నిబంధనలు తొలగించాలని ఆదేశించారు. తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్యపుస్తకాలను ఇక నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయించాలన్నారు.. చదువులో వెనుకబడిన కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు 95 శాతం తగ్గకుండా చూడాలన్నారు. గణితం, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవుతున్నారని అధికారులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగును విస్మరించకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉందని లోకేశ్ తెలిపారు. రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను ఆయన అభినందించారు.
ఐసీసీ సమావేశం కోసం కోల్‌కతాకు లోకేశ్
రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గురువారం కోల్‌కతా వెళ్లారు. శుక్రవారం అక్కడ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే ప్లీనరీలో పాల్గొని.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు అనే అంశంపై మాట్లాడతారు.
పశ్చిమ బెంగాల్ సీఎంతో లోకేశ్ భేటీ
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో కోల్‌కతాలో గురువారం సాయంత్రం మంత్రి లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, బెంగాల్ నడుమ సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని, బెంగాల్‌లో టీటీడీ దేవస్థానం నిర్మిస్తామని చెప్పారు.
