Share News

టీచర్లు, క్లాస్‌ రూమ్‌లే లేని ‘స్కూల్‌ 21’

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:47 AM

రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి లోకేశ్‌ శనివారం మాస్కోలో సరికొత్త విద్యా విప్లవానికి ప్రతీకగా నిలిచిన ‘స్కూల్‌ 21’ అనే ఒక వినూత్నమైన..

టీచర్లు, క్లాస్‌ రూమ్‌లే లేని ‘స్కూల్‌ 21’

  • మాస్కోలో వినూత్న పాఠశాలను సందర్శించిన మంత్రి లోకేశ్‌

  • బోధనా పద్ధతులను ఆసక్తిగా తెలుసుకున్న మంత్రి

  • అక్కడ విద్యార్థులే ఒకరికొకరు అధ్యాపకులు

ఐటీ ప్రోగ్రామింగ్‌పై ప్రాజెక్టుల ఆధారిత అభ్యసన

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి లోకేశ్‌ శనివారం మాస్కోలో సరికొత్త విద్యా విప్లవానికి ప్రతీకగా నిలిచిన ‘స్కూల్‌ 21’ అనే ఒక వినూత్నమైన ఐటీ ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. ఉపాధ్యాయులు, తరగతి గదులు లేకుండా అక్కడ జరిగే విద్యా బోధన తీరును ఆసక్తిగా పరిశీలించారు. సంప్రదాయ విద్య, బోధనకు భిన్నంగా అక్కడ పాటిస్తున్న శిక్షణా విధానాలు, పద్ధతుల గురించి నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రష్యా బ్యాంకింగ్‌ సంస్థ ‘స్బేర్‌ బ్యాంక్‌’ ఆధ్వర్యంలో ఈ విభిన్నమైన పాఠశాల నడుస్తుంది. ఇక్కడ ఉచితంగా ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ విద్యా కార్యక్రమాన్ని అందిస్తారు. ఈ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఎలాంటి ట్యూషన్‌ ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెంచ్‌ కోడింగ్‌ స్కూల్‌ అయిన ‘ఎకోల్‌ 42’ రూపొందించిన సరికొత్త భవిష్యత్తు పాఠశాల పద్ధతులను అనుసరిస్తూ పనిచేస్తుంది.

స్బేర్‌ సిటీ సందర్శన

మాస్కోలోని స్బేర్‌ సిటీని మంత్రి లోకేశ్‌ సందర్శించారు. స్బేర్‌ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌ అల్బర్ట్‌ ఎఫిమోవ్‌తో సమావేశమయ్యారు. స్బేర్‌ సిటీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఎవెనియా చులానోవ్‌తోనూ భేటీ అయ్యారు. తర్వాత అక్కడి ఆర్‌ అండ్‌ డీ క్వాంటం టెక్నాలజీ సెంటర్‌, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్‌ హెల్త్‌ కేర్‌, ఫైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ గురించి స్బేర్‌ సిటీ ప్రతినిధుల నుంచి వివరాలు లోకేశ్‌ తెలుసుకున్నారు.


ప్రత్యేకతలు ఇవీ..

సాంప్రదాయ బోధనకు భిన్నంగా ఈ ‘స్కూల్‌ 21’ పనిచేస్తుంది. టీచర్లు, క్లాసురూములు, గ్రేడింగ్‌ సిస్టమ్‌లు అనేవే ఉండవు. విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ (పీర్‌ టు పీర్‌ లెర్నింగ్‌), ప్రాజెక్టుల ఆధారంగా అభ్యాసం జరుగుతుంది. క్యాంపస్‌ రోజంతా 24 గంటలూ పనిచేస్తుంది. దీనివల్ల విద్యార్థులు తమ సొంత అధ్యయనాన్ని నిరంతరంగా చేసుకునే వీలుంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే కూడా ఒక ఽభిన్నమైన ఎంపిక విధానం ఉంటుంది. గత విద్యా సంవత్సరంలో వచ్చిన మార్కులు, సర్టిఫికెట్లను ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. సాధారణ ప్రవేశానికి ముందు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుదారుల నైపుణ్యాల ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.

Updated Date - Jun 07 , 2026 | 06:49 AM