Enforcement Directorate: రాజ్ కసిరెడ్డిపై ఈడీ నజర్
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:16 AM
కోల్‌కతాలో ఐప్యాక్ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సహకరించిన రాజ్ కసిరెడ్డిపై దృష్టి సారించింది.
కోల్‌కతా ఐప్యాక్ ఆఫీసులో లభించిన కీలక ఆధారాలు
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కోల్‌కతాలో ఐప్యాక్ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సహకరించిన రాజ్ కసిరెడ్డిపై దృష్టి సారించింది. ఐప్యాక్ సంస్థ గతంలో రాష్ట్రంలో జగన్‌కు సహకారం అందించింది. ఈ సంస్థ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రె స్‌కు ఎన్నికల వ్యూహాలపై సహకారాన్ని అందిస్తోంది. కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై గురువారం ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లోనే.. గతంలో రాష్ట్రంలో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడిందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు కూడా కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీకి లభించినట్టు పేర్కొంటున్నారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీల అంశంపై ఈడీ సమగ్రంగా దర్యాప్తునకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.