Share News

Liquor Scam Investigation: మిథున్‌రెడ్డికి ఈడీ పిలుపు

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:05 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వేగంగా అడుగులు వేస్తోంది.

Liquor Scam Investigation: మిథున్‌రెడ్డికి ఈడీ పిలుపు

  • లిక్కర్‌ స్కామ్‌లో 23న విచారణకు రావాలని సమన్లు

  • 22న విజయసాయిరెడ్డి వాంగ్మూలం

  • తర్వాతి రోజే వైసీపీ ఎంపీ విచారణ

  • అంతిమ లబ్ధిదారు లెక్క తేలుతుందా?

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో ఈనెల 23న విచారణకు రావాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది. అంతకుముందు రోజు.. అంటే 22న హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి విచారణకు రావాలంటూ విజయసాయిరెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజునే మిథున్‌రెడ్డిని విచారించడానికి తాజాగా ఈడీ నోటీసులు పంపడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలోని లిక్కర్‌ స్కామ్‌ల్లో పెద్దదైన ఈ మద్యం కుంభకోణంలో రూ. 3,500 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఏపీ సీఐడీ సిట్‌ పలు ఆధారాలు సేకరించి 50 మందికిపైగా నిందితులతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అందులో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసింది. జగన్‌ మాజీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి(ఏ1) కింగ్‌ పిన్‌గా భావిస్తున్న ఈ భారీ కుంభకోణంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆపార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా నిందితులే. వైసీపీ హయాంలో 2019లో మద్యం పాలసీ రూపకల్పన మొదలుకొని వ్యాపారుల నుంచి కమీషన్‌ లెక్క వరకూ వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారు. అలాగే విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీల వరకూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పేరున్న మద్యం బ్రాండ్లను తొక్కిపెట్టి నాసిరకం లిక్కర్‌ కోసం కమీషన్లు తీసుకుని 16 సంస్థలకు రూ. 23 వేల కోట్లు మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు సిట్‌ తేల్చింది.


ఈ కేసులో గతంలో విజయసాయి ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కేసులో సంచలన విషయా లు వెలికితీసిన సిట్‌.. గత ఏడాది జూలైలో మిథున్‌రెడ్డిని అరెస్టు చేసింది. రాజమహేంద్రవరం జైలులో 71 రోజుల రిమాండ్‌ తర్వాత సెప్టెంబరులో బెయిల్‌పై మిథున్‌రెడ్డి బయటకు వచ్చారు. మద్యం కుంభకోణంలో దాదాపు అన్ని విషయాలు తెలిసిన విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిని ప్రశ్నించబోతున్న ఈడీ అధికారులు అంతిమ లబ్ధిదారుకు ఎంత చేరింది.. ఆ సొమ్ము ఎక్కడెక్కడికి వెళ్లింది.. ఎన్నికల్లో ఖర్చు చేసిందెంత.. పెట్టుబడులు, హవాలా, బంగారం కొనుగోలు లాంటి వివరాలన్నీ రాబట్టబోతోందని తెలిసింది. ఈ నేపథ్యంలో.. అమెరికా బలగాలు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘చుట్టూ ఉన్న కోటరీ అమ్ముడుపోతే ఎలాంటి ప్యాలెస్‌లో ఉన్న వారికైనా ఇదే గతి’ అంటూ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు తాడేపల్లి ప్యాలె్‌సలో ప్రకంపనలు పుట్టిస్తోంది. సాయిరెడ్డి పోస్టుపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.

మద్యం నిందితుల బెయిల్‌ విచారణ రేపటికి వాయిదా

నకిలీ మద్యం కేసులో నిందితులబెయిల్‌ పిటిషన్లపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు, బాలాజీ, సయ్యద్‌ హాజీ, కట్టా రాజు, సుదర్శన్‌, అంతాదాస్‌, ప్రదీప్‌ దాస్‌, తలారి రంగయ్య, అల్లాభక్షి పిటిషన్లు వేశారు. వాదనలను జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 21కి వాయిదా వేసింది.

Updated Date - Jan 20 , 2026 | 04:06 AM