ఎఫ్‌డీలు పెట్టు.. అక్రమాస్తులు పట్టు!
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:43 AM
ఎప్పు డో దశాబ్దం కింద తక్కువ ధర ఉన్నప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన ఆస్తులను.. జప్తు చేసిన నాటికి ఉన్న విలువకు సమానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడతాం..
ఈడీ జప్తు చేసిన ఆస్తుల కోసం జగన్ కేసుల నిందితుల యత్నాలు
విశాఖ ఫార్మా సిటీలో 16 ఇండస్ట్రియల్ ప్లాట్ల విడుదలకు రాంకీ ఫార్మా పిటిషన్
వాటిని విడుదల చేయాలని గతంలో అడ్జుడికేటింగ్ అథారిటీ తీర్పు
అయితే వాటిలో నిర్మాణాలు చేపట్టరాదని, విక్రయించకూడదని స్పష్టీకరణ
దీనిపై టీ-హైకోర్టును ఆశ్రయించిన రాంకీ
ఆ ప్లాట్లకు ఎఫ్‌డీలు పెడతామని వినతి
విభేదించిన అదనపు సొలిసిటర్ జనరల్
అది నేరపూరిత సొమ్ము.. విడుదల చేయొద్దని అభ్యర్థన.. తీర్పు రిజర్వు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎప్పు డో దశాబ్దం కింద తక్కువ ధర ఉన్నప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన ఆస్తులను.. జప్తు చేసిన నాటికి ఉన్న విలువకు సమానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడతాం.. ఆ ఆస్తులను విడుదల చేయండి.. అంటే ఎలా ఉంటుంది..? ఉదాహరణకు.. రూ.10 కోట్ల విలువైన ఒక ఆస్తిని ఈడీ పదేళ్ల నాడు జప్తు చేసింది. ఇప్పుడు దాని విలువ రూ.వందల కోట్లకు చేరి ఉంటుంది. కానీ రూ.10 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెడతాం.. జప్తు నుంచి తమ ఆస్తులు విడుదల చేయాలని మాజీ సీఎం జగన్ ఆక్రమాస్తుల కేసుల్లోని నిందితులు కోర్టును అడుగుతున్నారు. ఇలా చిల్లర పడేసి.. నేరంతో అనుసంధానమై ఉన్న రూ.వందల కోట్ల విలువైన ఆస్తులను నగదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విశాఖ రాంకీ ఫార్మా సిటీ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు విషయంలో భారీగా లబ్ధి పొందిన రాంకీ ఫార్మా.. జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రోకోలో భాగంగా పెట్టుబడులు పెట్టిందని ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం (నేరపూరిత సొమ్ము)తో నేరుగా సంబంధం ఉన్న విశాఖ ఫార్మా సిటీలో 16 ఫార్మా ఇండస్ర్టియల్ ప్లాట్లను జప్తు చేసింది. ఇది చెల్లదని ఆ కంపెనీ..
ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించగా సదరు ప్లాట్లను విడుదల చేయాలని అథారిటీ తీర్పు ఇచ్చింది. అయితే సదరు ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని, విక్రయించరాదని.. థర్డ్ పార్టీ ఆసక్తులు సృష్టించరాదని స్పష్టంగా పేర్కొంది. దీనిపై రాంకీ ఫార్మా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాంకీ ఫార్మా తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈడీ చేసిన జప్తు అక్రమమని పేర్కొన్న తర్వాత కూడా సదరు ప్లాట్లలో ఎలాంటి పనులూ చేయకుండా అడ్జుడికేటింగ్ అథారిటీ ఆదేశాలివ్వడం సమంజసం కాదని.. తాము సదరు ప్లాట్లకు విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు సమర్పిస్తామని, వాటిని విడుదల చేయాలని కోరారు. గతంలో ఇదే తరహా కేసుల్లో సమానమైన సొమ్ముకు ఎఫ్‌డీలు పెట్టడానికి న్యాయస్థానాలు అంగీకరించాయన్నారు.
అది నేరపూరిత సొమ్ము: అదనపు సొలిసిటర్ జనరల్
ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు ఆస్తుల విడుదలకు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహ శర్మ అభ్యర్థించారు. అవి నేరుగా నేరపూరిత సొమ్ముకు అనుసంధానమై ఉన్న ఆస్తులని తెలిపారు. క్రిమినల్ చర్యల ద్వారా వచ్చిన సొమ్ముకు సంబంధించిన ఆస్తులని.. ట్రయల్ ముగిసే వరకు అవి జప్తులోనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మా సిటీ లోపల 500 మీటర్ల వరకు ఉండాల్సిన గ్రీన్ బెల్ట్ బఫర్ జోన్‌ను కేవలం 50 మీటర్లకు అక్రమంగా తగ్గించారని.. తద్వారా రాంకీ ఫార్మా భారీగా లబ్ధిపొందిందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం రాంకీ ఫార్మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. సదరు నేపూరిత ఆస్తుల బదులుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను అంగీకరించవద్దని కోర్టును కోరారు. నేరపూరిత సొమ్ముకు సమానమైన ఏదైనా ఆస్తిని జప్తు చేస్తే అటువంటి ఆస్తిని విడుదల చేయాలని గతంలో తీర్పులు వచ్చాయని.. అయితే ప్రస్తుత ఆస్తి నేరుగా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంకు సంబంధించిన ఆస్తి అని.. ఇలాంటి ఆస్తులను విడుదల చేయాలంటూ తీర్పులు లేవని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.