Share News

లిక్కర్‌ స్కామ్‌లో 441 కోట్ల ఆస్తుల జప్తు

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:23 AM

గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది.

లిక్కర్‌ స్కామ్‌లో 441 కోట్ల ఆస్తుల జప్తు

  • మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈడీ చర్యలు

  • వాటిలో కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డి

  • బ్యాంక్‌ బ్యాలెన్సులు, డిపాజిట్లు, భూములు

  • లిక్కర్‌ స్కామ్‌లో రూ.3,500 కోట్ల అక్రమార్జన

  • అనుకూల బ్రాండ్లకు సప్లయ్‌ ఆర్డర్లు.. ధరలు పెంపు

  • ఫలితంగా ప్రతి కేసుపై 15 నుంచి 20శాతం ముడుపులు

  • ఈ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌.. ఆస్తుల కొనుగోలు

  • ఇప్పటివరకు 1048 కోట్ల మనీ ట్రైల్‌ గుర్తింపు

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. ఈ ఆస్తులు లిక్కర్‌ స్కామ్‌లో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఇతరులకు సంబంధించినవిగా గుర్తించింది. అటాచ్‌ చేసిన ఆస్తుల్లో బ్యాంక్‌ బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులున్నాయి. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) 2002 కింద ఈడీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. 120-బీ, 409, 420 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. జగన్‌ ప్రభుత్వంలో లిక్కర్‌ పాలసీ మార్పుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలున్నాయి. ఈడీ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. 2019కు ముందు ఏపీలో మద్యం వ్యాపారం పూర్తిగా డిజిటల్‌, పారదర్శక సాఫ్ట్‌వేర్‌ విధానం ద్వారా నిర్వహించేవారు. 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారాక రిటైల్‌ ఔట్‌లెట్‌ ద్వారా మద్యం విక్రయాలను ఏపీఎస్‌బీసీఎల్‌ ఆధీనంలోకి తీసుకుంది. ఆటోమేటెడ్‌ సిస్టంను నిలిపేసి మాన్యువల్‌ విధానాన్ని అమలు చేశారు. దీంతో సప్లయ్‌ ఆర్డర్‌ జారీపై అధికారులకు ఎక్కువ స్వేచ్ఛ లభించింది.


అనుకూల బ్రాండ్లకు ప్రాధాన్యం

మాన్యువల్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసి కొన్ని స్థిరమైన బ్రాండ్లను మార్కెట్‌ నుంచి తొలగించడం, ప్రత్యేక బ్రాండ్లకు అనుకూలంగా సప్లయ్‌ ఆర్డర్లను ఇవ్వడం, ఫలితంగా కిక్‌బ్యాక్‌లు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇదే విధంగా మార్కెట్లో ఉన్న బ్రాండ్లతో సమానంగా వినిపించే పేర్లతో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి వాటి ధరలను పెంచారు. రేట్ల మ్యానిపులేషన్‌ వల్ల డిస్టలరీలు అధిక లాభాలు పొందాయి. ఫలితంగా ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్‌ ఇవ్వాలని లిక్కర్‌ గ్యాంగ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. ముడుపులు చెల్లించని సంస్థలకు సప్లయ్‌ ఆర్డర్లు ఆపేశారు. కిక్‌బ్యాక్‌ల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని వీఓఐపీ కాల్స్‌, సిగ్నల్‌ యాప్‌ ద్వారా రహస్యంగా నిర్వహించారు. ఈ వ్యవహారంలో బూనేటి చాణక్య(ప్రకాశ్‌), ముప్పిడి అవినాశ్‌(సుమీత్‌), మహమ్మద్‌ సైఫ్‌ ముఖ్య పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది.


3,500 కోట్ల అక్రమార్జన

లిక్కర్‌ స్కామ్‌ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల కిక్‌బ్యాక్‌లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు, వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయడం, షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు రూ.1048.45 కోట్ల మనీ ట్రైల్‌ను ఈడీ గుర్తించింది. ఇందులో నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు, ఇతర మార్గాల్లో చెల్లింపులు జరిగాయి. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్‌రెడ్డి, తూకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, పైలా దిలీప్‌, సైఫ్‌లతో పాటు మరికొందరు ఈ కిక్‌బ్యాక్‌లో భాగస్వాములైనట్లు ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆదాన్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యూవీ డిస్టిలరీస్‌ వంటి సంస్థలను సిండికేట్‌ నియంత్రణలో ఉంచి అధిక వ్యాపారాన్ని కేటాయించారు. అలాగే ఏపీఎస్‌బీసీఎల్‌ లిక్కర్‌ రవాణా టెండర్లను కూడా సిండికేట్‌ ప్రభావితం చేసింది. సిగ్మా సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అధిక రేట్లతో టెండర్‌ ఇచ్చి, ఆ డబ్బును టీఈకేకేఆర్‌, ఏఆర్‌ఆర్‌వైఓ, ఈజీలోడ్‌ వంటి సంస్థల ద్వారా మనీలాండరింగ్‌ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఓల్విక్‌, క్రిపాటి, నైస్నా మల్టీవెంచర్స్‌, ఆరోవో, ఈజీలోడ్‌, డి-కార్ట్‌ వంటి షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు మళ్లించినట్టు దర్యాప్తులో తేలింది. ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించారని, ఈ డబ్బు ప్రధానంగా వివిధ ప్రదేశాల్లో నిల్వ చేసి తర్వాత సిండికేట్‌ సభ్యులకు పంపిణీ చేశారని వెల్లడైంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు ఈడీ తెలిపింది.

Updated Date - Mar 07 , 2026 | 05:24 AM