ఈడీ రెడీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:36 AM
తిరుమల లడ్డూ ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన, పుచ్చుకున్న వారి పనిపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగప్రవేశం చేసింది.
కల్తీ నెయ్యి ముడుపులపై కేసు నమోదు
హవాలా గుట్టు తేల్చేందుకు.. మనీలాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్
లబ్ధిదారులు, ఏజెంట్లకు త్వరలో నోటీసులు
అమరావతి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదానికి జగన్ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసే క్రమంలో ముడుపులు ఇచ్చిన, పుచ్చుకున్న వారి పనిపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగప్రవేశం చేసింది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం.. నాలుగేళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలుచేసిన సంగతి తెలిసిందే. నెయ్యి సరఫరాలో రూ.235 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఇందులో రూ.20 కోట్లకు పైగా హవాలా జరిగిందని.. ఆ సొమ్ము తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి చేరినట్లు కనిపెట్టింది. అందులో రూ.75 లక్షలు టీటీడీ డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి, ఇంకో రూ.31 లక్షలు కమిషన్ ఏజెంటు శ్రీనివాసన్‌కు పోగా.. నికరంగా రూ.19.86 కోట్లు వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ చావ్డాకు చేరినట్లు నిర్ధారణ అయింది. అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది మిస్టరీనే. భోలేబాబా నిర్వాహకులు పొమిల్ జైన్, విపిన్ జైన్, ఢిల్లీ చాందినీ చౌక్ వ్యాపారి ఆశిశ్ అగర్వాల్(ఏ15) ఈ రాకెట్‌లో కీలకం. చాందినీచౌక్‌లో అగర్వాల్‌కు ఓ హవాలా దుకాణం (షాపు నం.304) ఉంది. నెయ్యిని ఇతడి నుంచి కొన్నట్లు భోలేబాబా నిర్వాహకులు తప్పుడు పత్రాలు సృష్టించారు.
ఇందుకు భోలేబాబా ఖాతాల నుంచి అగర్వాల్‌కు నగదు చెల్లింపులు జరిగాయి. ఆ డబ్బును అతడు విత్‌డ్రా చేసి హవాలా మార్గంలో నడిపించాడు. తొలుత రాధేశ్యామ్ ఓజా నడిపిస్తున్న హవాలా షాపు (నం.287)నకు.. తర్వాత అదే ప్రాంతంలో ఉన్న రిషబ్ జైన్ అనే మరో హవాలా వ్యాపారి(షాపు నం.18బీ)కి.. అటు నుంచి గ్వాలియర్‌కు చెందిన దీపక్ జైన్‌కు బదలాయిస్తూ వచ్చారు. దీపక్‌కు హవాలా మార్గంలో చేరిన డబ్బును తిరిగి వైట్‌గా మార్చి.. భోలేబాబా కంపెనీకే పంపించారు. ఆ డబ్బును పటేల్ లాలాభాయి తన హవాలా ఏజెంట్లయిన బెజవాడలోని భార త్ భాయి, మదరమ్ దేవాసి(చెన్నై), హైదరాబాద్‌కు చెందిన అర్జున్ గోస్వామిలకు పంపినట్లు తేలింది. ఈ సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదుచేసిన ఈడీ.. త్వరలో ముడుపుల లబ్ధిదారులు, ఏజెంట్లకు నోటీసులు జారీచేసి విచారణ జరుపనుంది.