Share News

వైసీపీ మైనింగ్‌ స్కామ్‌పై ఈఢీ!

ABN , Publish Date - May 28 , 2026 | 05:03 AM

ఆంధ్రప్రదేశ్‌ నదుల్లోని ఇసుక రాజస్థాన్‌ వరకూ చేరింది.. ఇక్కడి మైనింగ్‌ నాలుగు రాష్ట్రాలకు వెళ్లింది.. జగన్‌ హయాంలో జరిగిన కుంభకోణం ఏపీతోపాటు తమిళనాడు..

వైసీపీ మైనింగ్‌ స్కామ్‌పై ఈఢీ!

  • హైదరాబాద్‌, విజయవాడ, కోయంబత్తూరు,

  • జైపూర్‌లలో ఏకకాలంలో అధికారుల సోదాలు

  • జేపీవీఎల్‌, జీసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థల్లో హార్డ్‌డిస్క్‌లు, డిజిటల్‌ పత్రాలు స్వాధీనం

  • లావాదేవీల్లో కేసీఆర్‌ బంధువు సంతోష్‌ పేరు!

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నదుల్లోని ఇసుక రాజస్థాన్‌ వరకూ చేరింది.. ఇక్కడి మైనింగ్‌ నాలుగు రాష్ట్రాలకు వెళ్లింది.. జగన్‌ హయాంలో జరిగిన కుంభకోణం ఏపీతోపాటు తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌ వరకు వ్యాపించింది. ఏసీబీ, ఈడీ వంటి సంస్థలు తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.2500 కోట్ల కుంభకోణంలో అవినీతిని రాష్ట్ర ఏసీబీ అధికారులు తవ్వితీస్తే.. ఖండాంతరాలు దాటిని ఆ సొమ్ము గుట్టుమట్లను ఈడీ రాబట్టే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లోని 4 ప్రధాన నగరాల్లో సోదాలు చేపట్టింది. విజయవాడ, హైదరాబాద్‌, కోయంబతూరు, జైపూర్‌లలో.. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక, మైనింగ్‌ చేసిన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. జేపీవీఎల్‌, జీసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా వంటి సంస్థల కార్యాలయాల్లో డిజిటల్‌ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మైనింగ్‌ ద్వారా వెనకేసుకున్న సొమ్ము బదిలీ మార్గాలు, అనుబంధ వ్యాపారాలు, పెట్టుబడులను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.

ఏం జరిగింది?

2021లో జగన్‌ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు ఇచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ప్రాంతాల వారీగా విభజించి జేపీవీఎస్‌, జీసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా వంటి సంస్థలకు అప్పగించింది. అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించి ప్రభుత్వానికి రూ.2,566 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టినట్లు విజిలెన్స్‌ నిగ్గుతేల్చింది. ఒక్క జీపీవీఎల్‌కే రూ.800 కోట్లు లబ్ధి చేకూర్చారని, బ్యాంకు గ్యారెంటీ రూ.120 కోట్లకు సంబంధించి తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ 2024, సెప్టెంబరు 11న కేసు నమోదు చేసింది. అనంతరం.. వెంకటరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపింది. మైనింగ్‌ లీజులు, రాయల్టీ లెక్కింపు, పెనాల్టీల మినహాయింపు, అక్రమ తవ్వకాల అనుమతుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ విచారణలో బయటపడ్డ సమాచారం ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు చేపట్టింది.


సొమ్ము మళ్లింపుపై ఆరా..

ఏపీలో అక్రమ మైనింగ్‌ ద్వారా దోచుకున్న సొమ్మును ఏ దారుల్లో ఎక్కడికి మళ్లించారో సమాచారం సేకరించిన ఈడీ అధికారులు.. దీనికనుగుణంగా బుధవారం సోదాలు చేపట్టారు. జేపీవీఎల్‌, జీసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎటు వెళ్లింది..?. షెల్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా..?. నిర్మాణ సంస్థల్లోకి మళ్లించారా..?. లేక, దేశం దాటించారా..?. అనే కోణంలో ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, డైరెక్టర్ల వివరాలు, ఆస్తుల కొనుగోళ్లు, అనుబంధ సంస్థల మధ్య నిధుల బదిలీ, తదితర వివరాలను ఈడీ బృందాలు సేకరించాయి. విజయవాడలో ఒకచోట, హైదరాబాద్‌లో మూడు చోట్ల, కొయంబత్తూరు, జైపూర్‌లో రెండు చోట్ల బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఒప్పంద పత్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

కేసీఆర్‌ బంధువు సంతోష్‌ పేరు?

ఈడీ సోదాల్లో లభించిన పత్రాల విశ్లేషణలో ప్రతిమా ఇన్‌ఫ్రాకు సంబంధించిన లావాదేవీల్లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ సమీప బంధువు బోయినపల్లి సంతోష్‌ పేరు వినిపించింది. తెలంగాణకు చెందిన ఈ కంపెనీ ఎదుగుదలకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేయూత అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కోణంలో ప్రతిమా ఇన్‌ఫ్రా లావాదేవీలపై ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఈడీ అధికారులు మరింత ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాల్లోని మరికొందరు నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - May 28 , 2026 | 05:03 AM