Share News

‘వెల్ఫేర్‌’ ముసుగులో మళ్ల మహా దందా

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:57 AM

రూ.వేల కోట్ల చిట్‌ఫండ్‌ మోసాలకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝళిపించింది.

‘వెల్ఫేర్‌’ ముసుగులో మళ్ల మహా దందా

  • రూ.1,200 కోట్ల చిట్‌ఫండ్‌ మోసాలు

  • విశాఖలోని వైసీపీ నేత నివాసం, కార్యాలయాల్లో ఈడీ విస్తృత తనిఖీలు

  • అక్రమ సొత్తు షెల్‌ కంపెనీలకు.. మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు

  • వెల్ఫేర్‌ గ్రూపు పేరిట ఆరు రాష్ట్రాల్లో వేలాది మందిని ముంచిన మళ్ల

  • నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లు వసూలు.. 6 రాష్ట్రాల్లో ఫిర్యాదులు

  • గతంలో అరెస్ట్‌.. జార్ఖండ్‌ జైలుకు తరలింపు.. హైదరాబాద్‌లోని ఇళ్లలోనూ..

విశాఖపట్నం, హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రూ.వేల కోట్ల చిట్‌ఫండ్‌ మోసాలకు సంబంధించిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝళిపించింది. మళ్ల నిర్వహిస్తున్న వెల్ఫేర్‌ గ్రూపు ఏపీ, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని డిపాజిట్‌దారుల నుంచి చిట్టీల రూపంలో దాదాపు రూ.1,200కోట్లు సేకరించి, తర్వాత చెల్లింపులు చేయకుండా చేతులెత్తేసింది. వేలాది మందిని నట్టేట ముంచిన ఈ వ్యవహారంలోని మనీ లాండరింగ్‌ కోణాన్ని తేల్చే పనిలో ఈడీ ఉంది. ఈ క్రమంలోనే బుధవారం వెల్ఫేర్‌ గ్రూపు సంస్థల యజమానులకు హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్న నివాసాలు, ఆఫీసులపై ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. భువనేశ్వర్‌ నుంచి వచ్చిన ఈడీ బృందం సాయుధులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల సమక్షంలో విశాఖపట్నంలోని మళ్లా విజయప్రసాద్‌, ఆయన కుటుంబసభ్యులు, వెల్ఫేర్‌ గ్రూపునకు చెందిన ఇతర డైరెక్టర్లు, ముఖ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. మళ్ల నివాసంలోని కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. సోదాల గురించి ఎలక్ర్టానిక్‌ మీడియాలో రావడంతో పోలీసులుఎ అక్కడకు చేరుకుని.. ఈడీ అధికారులను సోదాలపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. తాము ఈడీ అధికారులమని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, తమకు సహకారం అవసరమైతే ఉన్నతాధికారులకు చెబుతామని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుతిరిగారు.


కోట్లు దోచి.. కటకటాలు లెక్కించి..

మళ్లకు చెందిన వెల్ఫేర్‌ గ్రూపు ఆఫ్‌ కంపెనీ విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ర్టాల్లో బ్రాంచీలు ప్రారంభించింది. 2009 నుంచి 2014 వరకు ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించింది. నెలవారీ డిపాజిట్లు, రియల్‌ ఎస్టేట్‌, ప్లాట్లు, అధిక వడ్డీ, డబుల్‌మనీ పథకాల పేరుతో వేలాదిమంది నుంచి డబ్బు సేకరించింది. మళ్ల నివాసంలో భారీ ఎత్తున డిజిటల్‌ ఆధారాలు, ఎలకా్ట్రనిక్‌ ఎవిడెన్స్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఫిర్యాదులు రావడంతో పలు రాష్ట్రాల్లో విజయ ప్రసాద్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. 2016 ప్రాంతంలో సీబీఐ సైతం వెల్ఫేర్‌ గ్రూపుపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. మరోవైపు, వెల్ఫేర్‌ సంస్థ మోసాలపై కొన్ని రాష్ట్రాల సీఐడీ విభాగాలు కూడా దర్యాప్తు జరిపాయి. కొన్నేళ్ల కిందట మళ్ల విజయ్‌ప్రసాద్‌ను జార్ఖండ్‌ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కొన్నాళ్లు జైలులో ఉండి ఆ తరువాత ఆయన బయటకు వచ్చారు. అప్పట్లో ఒడిశా పోలీసులు దాదాపు 150 మంది డిపాజిటర్ల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చిట్‌ఫండ్‌ స్కామ్‌ ద్వారా సంపాదించిన డబ్బును విజయప్రసాద్‌ ఎటువైపు మళ్లించారనే అంశాలపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. షెల్‌ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని, భారీగా స్థిరాస్తులను కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. విజయప్రసాద్‌, ఆయన భార్య అరుణకుమారి, కుమార్తెలు అనూష, అలేఖ్యలు వెల్ఫేర్‌ గ్రూపులో డైరెక్టర్లుగా ఉండటంతో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, 2009 నుంచి జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున మళ్ల 2009లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన వైసీపీలో చేరారు.


2019లో వైసీపీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదుకావడంతో 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. కొంతకాలంపాటు రాజకీయంగా స్తబ్దుగా ఉన్న మళ్ల విజయ్‌ప్రసాద్‌ కొద్దిరోజులుగా తిరిగి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 04:59 AM