ఇసుక అక్ర మతవ్వకాల కేసులో ఈడీ సోదాలు
ABN , Publish Date - May 30 , 2026 | 05:29 AM
ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు..
హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరుల్లో 8 చోట్ల తనిఖీలు
1.53 కోట్ల నగదు, 1800 అమెరికా డాలర్లు, వెండి స్వాధీనం
2,407 కోట్ల అక్రమాల కేసులో ఈడీ చర్యలు
మరింతగా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడి
అమరావతి/హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు నగరాల్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఈనెల 26న జరిగినట్లు ఈడీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జీకేసీ ప్రాజెక్టు అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, టర్న్‌కీ ఎంటర్‌ఫ్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలతో పాటు బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్‌కుమార్, విజి వెంకటరెడ్డి నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు ఈడీ పేర్కొంది. అక్రమ ఇసుక తవ్వకాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతుల కంటే ఎక్కువ లోతులో తవ్వకాలు, అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన జిల్లా స్థాయి ఇసుక కమిటీలు నిర్వహించిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత సంస్థలకు గనులశాఖ షోకాజ్ నోటీసులు, అనంతరం డిమాండ్ నోటీసులు జారీచేసిందని పేర్కొంది. మూడు సంస్థలపై మొత్తం రూ. 2,407.70 కోట్లు మేర డిమాండ్ నోటీసులు జారీచేసినట్లు ఈడీ వెల్లడించింది. సోదాల్లో రూ. 1.53 కోట్ల నగదు, 1800 అమెరికా డాలర్లు, రూ. 1.29 కోట్ల విలువైన వెండి వస్తువులు, డిజిటల్ పరికరాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపింది. షెల్ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా పలు దేశవిదేశీ సంస్థలకు అక్రమంగా సంపాదించిన డబ్బు పంపించారని, ఈడీ అధికారులు ప్రకటనలో వివరించారు.