Share News

మద్యం స్కాంలో ఈడీ దూకుడు

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:23 AM

జగన్‌ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. జగన్‌ కోటరీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.

మద్యం స్కాంలో ఈడీ దూకుడు

  • ఏపీ, తెలంగాణలో 12 చోట్ల సోదాలు

  • సాయిరెడ్డి, చెవిరెడ్డి, కసిరెడ్డి ఇళ్లలో తనిఖీలు

  • శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి ఇళ్లలోనూ..

  • ఏడున్నర గంటలు మోహిత్‌రెడ్డి విచారణ

  • ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ రికార్డులు స్వాధీనం

  • నెలకు రూ.100 కోట్ల అక్రమార్జన

  • మొత్తం 1,048 కోట్ల మనీ ట్రయల్‌

  • నగదు, బంగారం రూపంలో హైదరాబాద్‌లో వివిధ చోట్ల నిల్వ

అమరావతి/హైదరాబాద్‌/తిరుపతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. జగన్‌ కోటరీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. స్కాంలో వివిధ స్థాయుల్లో పాత్రధారులు, వారి బినామీలపై దృష్టి సారించింది. శుక్రవారం ఏపీ, తెలంగాణల్లోని 12చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, తిరుపతి ల్లో ప్రధాన పాత్రధారులు, నిందితులైన విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి(తిరుపతి), కె.ధనుంజయరెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, అవినాశ్‌గౌడ్‌, ముప్పిడి అవినాశ్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో 11చోట్ల, తిరుపతిలో ఒకచోట సోదాలు జరిగాయి. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం ముడుపులకు సంబంధించిన పలు కీలక ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ స్కాంలో దాదాపు రూ.3,200 కోట్ల మనీలాండరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు.. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లింది.. ఏ కంపెనీల ద్వారా మళ్లించారు.. షెల్‌ కంపెనీల నిర్వహణ, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన కీలక ఆధారాలను వారు సేకరించినట్లు సమాచారం.


రాజ్‌ కసిరెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప మనీలాండరింగ్‌లో ముఖ్య పాత్ర పోషించిన నేపఽథ్యంలో.. ముడుపుల ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్లిందనే కోణంలో ఆయన్ను లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణకు హజరయ్యారు. తన సమక్షంలోనే లిక్కర్‌ స్కాంకు సంబంధించిన మూడు సమావేశాలు జరిగాయని గతంలో ఆయన ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలపై ఆయన్ను వారు తాజాగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆయన ఇంట్లోనే కాకుండా ఆయన వాచ్‌మన్‌ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. అత్తాపూర్‌లో చెవిరెడ్డి ఇంట్లో, నార్సింగ్‌లోని రాజ్‌ కసిరెడ్డి నివాసంలో కూడా సోదాలు చేశారు.


మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా..: చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి (ఏ39)ని విచారించడానికి చెన్నైకి చెందిన నలుగురు ఈడీ అధికారులు బి.నారాయణరావు, అంకుర, పృధ్వీరాజ్‌, ధీరజ్‌, ఇద్దరు బ్యాంకు అధికారులు, నలుగురు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తిరుపతి శివార్లలో వున్న తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఆయన తల్లి మునిరత్నమ్మ, సోదరుడు రఘునాథరెడ్డితో మాట్లాడారు. బెంగళూరులో ఉన్న మోహిత్‌రెడ్డికి సమాచారం అందడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఇంటికి వచ్చారు. అప్పటిదాకా అధికారులు బయట వేచిచూశారు. వారు రాత్రి 8.30 గంటల వరకూ ఆయన్ను విచారించారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చెవిరెడ్డికి సంబంధించిన కేవీఎస్‌ ఇన్‌ఫ్రా, సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా పేరిట ఉన్న ఆస్తులతోపాటు మరో 4 కంపెనీల రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది. మోహిత్‌రెడ్డిని ప్రశ్నించి సమాధానాలను లిఖితపూర్వకంగా రికార్డు చేశారు.


హైదరాబాద్‌లోనే డబ్బు నిల్వ..!: కసిరెడ్డి, బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్‌రెడ్డి, ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, పైలా దిలీప్‌, సైఫ్‌ అహ్మద్‌ కలిసి రూ.3500 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ నిర్ధారించిన సంగతి తెలిసిందే. అనేక డిస్టిలరీలను స్థాపించి.. మద్యం తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ వస్తువుల సరఫరాకు నకిలీ విక్రేతలను సృష్టించారు. సరఫరా చేయని వస్తువుల పేరిట నకిలీ ఇన్‌వాయి్‌సలు తయారుచేసి డబ్బు జేబులో వేసుకున్నారు. ఆ సొమ్మును రియల్‌ ఎస్టేట్‌లో పెట్టారు. భూములు కొనుగోలు చేశారు. ‘ఓల్విక్‌’, ‘అరోయో’, ‘ఈజీలోడ్‌’, క్రిపతి, నైస్నా మల్టీవెంచర్స్‌, డీ-కార్ట్‌ వంటి షెల్‌ కంపెనీల ద్వారా ఫండ్స్‌ లేయరింగ్‌ చేశారు. ఇలా నెలకు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. మొత్తం రూ.1,048.45 కోట్ల మనీ ట్రయల్‌ను గుర్తించింది. ముడుపుల సొమ్మును నగదు, బంగారం రూపంలో హైదరాబాద్‌లోని వివిధ చోట్ల నిల్వ ఉంచినట్లు తేల్చింది. హ్యాండ్లర్ల ద్వారా నగదు రవాణా చేసినట్లు ఆధారాలు సేకరించింది. కసిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు, పలు సంస్థలకు చెందిన రూ.441.63 కోట్ల స్థిర, చరాస్తులను ఇదివరకే తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో ఒక్క కసిరెడ్డివే రూ.270 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో షాబాద్‌, జనగామ ప్రాంతాల్లోని రూ.184 కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి. వాస్తవానికి మద్యం స్కాం కేసులో సిట్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా గతేడాది ఏప్రిల్‌,మేలో ఈడీ కేసు నమోదు చేసి..జూలైలో చార్జిషీటు కూడా దాఖలుచేసింది. అనంతరం దర్యాప్తును వేగవంతం చేసింది.

Updated Date - Apr 25 , 2026 | 04:25 AM