అఫిడవిట్లో ఆస్తులెందుకు దాచారు?
ABN , Publish Date - May 27 , 2026 | 04:18 AM
గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితులైన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది.
మీ ఆదాయానికి, ఎన్నికల్లో చూపిన దానికి పొంతనే లేదు
కోట్లాది రూపాయల లావాదేవీల ప్రస్తావన ఎక్కడా లేదేం?
మద్యం స్కాం నిందితులు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,
మోహిత్‌కు ఈడీ ప్రశ్నలు.. రూ.63 కోట్ల బ్లాక్ మనీపైనా..
సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన తండ్రి, కుమారుడు
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితులైన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. చెవిరెడ్డి కుటుంబ ఆస్తులపై ఆరా తీసిన ఈడీ.. అక్రమ లావాదేవీల వివరాలు సేకరించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చెవిరెడ్డి ఆయన కుమారుడిని పిలిపించిన అధికారులు.. వారిద్దరికి చెమటలు పట్టించేలా విచారించినట్లు సమాచారం. మద్యం స్కాంలో సిట్ నుంచి వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు తమ పరిధిలో దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021-23 మధ్య కుటుంబసభ్యుల పేరుతో రూ.63.72 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుపై ఈడీ ప్రశ్నించింది. అధికారికంగా రికార్డుల్లో రూ.8.85కోట్లు మాత్రమే చూపించిన చెవిరెడ్డి, మిగతా రూ.54.87 కోట్లు బ్లాక్‌లో లావాదేవీలు జరిపినట్లు సంబంధిత ఆధారాలను వారిముందు పెట్టింది. కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా జరిగిన నిధుల రూటింగ్ గురించి చెవిరెడ్డి, మోహిత్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఒకే ఒక్క డీల్‌లో రూ.13.30 కోట్ల నల్లధనం స్థిరాస్తి రూపంలోకి మారిన తీరును వివరించి ప్రశ్నించడంతో తండ్రి, కుమారుడికి చెమటలు పట్టినట్లు తెలిసింది. 2024 ఎన్నికల అఫిడవిట్లో చూపినదానికి, వాస్తవంగా 2021-23 మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు ఉన్న భారీ తేడాపై ప్రశ్నించడంతో.. తమకు సమయం కావాలని చెవిరెడ్డి కోరినట్లు తెలిసింది. ఇదే కేసులో చెవిరెడ్డి భార్య లక్ష్మీ కాంతమ్మ, మరో కుమారుడు హర్షిత్ రెడ్డిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తర్వాత మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అడిగిన వివరాలన్నీ అందజేశామని, ముడుపుల సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారనేది అరోపణ మాత్రమేనన్నారు.
పని మనుషుల పేర్లపైనా ఆస్తులు!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి ప్రాంతంలో ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని చక్రంతిప్పిన చెవిరెడ్డి.. తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారాటీ పరిధిలో భారీగా స్థిరాస్తులను వెనకేసుకొని, వాటిని కుటుంబసభ్యుల పేర్లతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువాళ్లు, తన దగ్గర పనిచేసే వ్యక్తుల పేర్లతో పెట్టారు. ఆలయ పూజారిని సైతం బెదిరించి, ఖరీదైన ఆస్తులు తక్కువ ధరకు లాక్కున్న చెవిరెడ్డి.. ఆ మొత్తాన్ని మద్యం ముడుపుల నుంచి చెల్లించినట్లు సిట్ తేల్చింది. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచేందుకు పార్టీ తరఫున లిక్కర్ స్కామ్ ముడుపులను చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లు పేర్కొంది. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా సిట్ చెవిరెడ్డిని అరెస్టు చేసి సోదాలు నిర్వహించినప్పుడు భారీగా ఆస్తుల గుట్టు బయటపడింది. దేశ, విదేశాల్లో ఆస్తుల కొనుగోలు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కోసం ఖర్చు చేసిన సొమ్ము, దుబాయ్‌లో వ్యవహారాలన్నింటినీ బయటికి లాగింది. ఈ వివరాలన్నింటినీ ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు.