Share News

సొమ్ము చేరిందెవరికి?

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:01 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన మాజీ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.

సొమ్ము చేరిందెవరికి?

  • జగన్‌ ‘నీడ’లపై ఈడీ ప్రశ్నల వర్షం

  • ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి విచారణ

  • ఎవరి ఆదేశాలతో రాజ్‌ కసిరెడ్డిని కలిసేవారు?

  • ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది?

  • సర్వీసులో వచ్చిన జీతమెంత?

  • కుటుంబ సభ్యుల పేరిటా పలు ఆస్తులు

  • వాటి కొనుగోలుకు డబ్బెక్కడిది?

  • కీలక పత్రాలు ముందుంచి ప్రశ్నలు

  • సమాధానాలు చెప్పలేని ఆ ఇద్దరు

  • చాణక్య, వెంకటేశ్‌నాయుడినీ ప్రశ్నించిన ఈడీ అధికారులు

అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన మాజీ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం హైదరాబాద్‌లో వీరిద్దరితోపాటు మద్యం కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్‌నాయుడు, బూనేటి చాణక్యనూ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. నిందితుల బ్యాంకు లావాదేవీలు, నగదు మార్పిడి వ్యవహారాలు, బినామీ ఆస్తుల పత్రాలు సహా పలు ఆధారాలనూ ముందుంచి ప్రశ్నించారు. లిక్కర్‌ స్కామ్‌లో వసూలు చేసిన సొమ్ములు ఎవరికి చేరాయని అడిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రూ.3,500 కోట్ల లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్‌ కసిరెడ్డి (ఏ-1)కి చెందిన జూబ్లీహిల్స్‌ కార్యాలయం నుంచి తరచూ కారు డిక్కీలో అట్ట పెట్టెల్లో తీసుకెళ్లిన ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందని ధనుంజయ్‌ రెడ్డిని అడిగారు. తెలంగాణలోని బాన్సువాడ, మహేశ్వరంలో కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు డబ్బులు ఎక్కడివని కృష్ణమోహన్‌ రెడ్డిని.. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ముత్తుకూరు మండలాల్లో మరదలి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులకు నగదు రూపంలో ఇచ్చిన డబ్బులు ఎలా వచ్చాయని ధనుంజయ్‌రెడ్డిని ఆరా తీసినట్లు సమాచారం. వారిద్దరూ అత్యంత కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది.


ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా..

బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలతో పాటు మరికొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావాలని ఈడీ ఇచ్చిన నోటీసు మేరకు ధనుంజయ్‌రెడ్డి వాటితో హాజరు కాగా.. కృష్ణమోహన్‌రెడ్డి బినామీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్లలేదని తెలిసింది. దీంతో ఈడీ అధికారులు ఆయన్ను రెండు గంటలు మాత్రమే ప్రశ్నించారు. అడిగిన కీలక డాక్యుమెంట్లతో మళ్లీ రావాలని ఆదేశించారు. ఆ తర్వాత ధనుంజయ్‌రెడ్డిని మాత్రం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.15 గంటలు దాటేవరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కడప జిల్లా నుంచి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లినప్పటి నుంచి.. వైఎస్‌ హయాంలో రాష్ట్రానికి ఐఏఎస్‌ హోదాలో తిరిగిరావడం.. జగన్‌ ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేయడం గురించి అడుగుతూనే.. లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఆరా తీసినట్లు తెలిసింది. ఎవరి ఆదేశాలతో ప్రతి వారాంతం రాజ్‌ కసిరెడ్డి కార్యాలయానికి వెళ్లారు. ఎన్ని సార్లు వెళ్లి ఎంతెంత మొత్తం తీసుకున్నారు.. ఆ డబ్బంతా మీకేనా.. లేక ఇతరులకు ఇవ్వాల్సి వచ్చిందా.. వంటి ప్రశ్నలు అడగడంతో ధనుంజయ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలిసింది. తనకు బినామీలెవరూ లేరని చెప్పినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు, కోవూరు మండలాల్లో ఆయన కుమారుడు రోహిత్‌రెడ్డి, బంధువు (మరదలు) లక్ష్మి పేరుతో భారీగా నగదు చెల్లించి ఆస్తులు కొన్నట్లు ఆధారాలు ముందుంచడంతో ధనుంజయ్‌రెడ్డి దిక్కులు చూసినట్లు తెలిసింది. నగదు చెల్లించి ఆస్తులు కొన్నారని విక్రయదారుల నుంచి సమాచారం సేకరించిన ఈడీ అధికారులు.. ఆ సొమ్ము ఎలా వచ్చింది.. నగదు చెల్లించకూడదని తెలిసిన అధికారిగా ఇలాంటి పని ఎందుకు చేశారని ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన బినామీలను, మరికొందరిని కూడా పిలిపించి వేర్వేరుగా ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది.


ఆస్తుల చిట్టా తీసుకురండి..

అంతకుముందు కృష్ణమోహన్‌రెడ్డిని విచారించినప్పుడు.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైరయ్యేదాకా ఎక్కడెక్కడ పనిచేశారో ఈడీ అధికారులు ఆరా తీశారు. మొత్తం సర్వీసులో జీతం రూపంలో వచ్చిన ఆదాయంతో పాటు ఆయన ఆస్తుల చిట్టా అడిగారు. తర్వాత కోడలు పేరుతో తెలంగాణలో కొన్న ఆస్తుల గురించి ప్రశ్నించి.. నగదు రూపంలో చెల్లింపులపై వివరాలు అడిగినట్లు తెలిసింది. అన్నీ తనకు తెలియదని, తమ ఆడిటర్‌ చూస్తారని చెప్పడంతో కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని మళ్లీ రావాలంటూ ఈడీ అధికారులు ఆయన్ను పంపించేశారు.

కొలతలేసిన డబ్బులు ఏమయ్యాయ్‌?

జగన్‌కు అత్యంత సన్నిహితులైన పై ఇద్దరితో పాటు.. వైసీపీ అభ్యర్థులకు గత ఎన్నికల్లో డబ్బులు సరఫరా చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నమ్మినబంటు వెంకటేశ్‌నాయుడిని కూడా ఈడీ ప్రశ్నించింది. మీ ఆదాయమేంటి.. వ్యాపారాలేంటి.. మద్యం ముడుపులుగా వసూలు చేసిన కరెన్సీ కట్టలను పేర్చి జానాబెత్తలతో కొలతలు వేసిమరీ.. ఎంతుందో అంచనా వేసిన సొమ్ము ఏమైందని అడిగినట్లు తెలిసింది. సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న వెంకటేశ్‌నాయుడి సెల్‌ఫోన్‌లో బయటపడిన సదరు వీడియో చూపించి.. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి చేర్చారని అడుగగా.. ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ప్రైవేటు విమానాలు అద్దెకు తీసుకుని సినీతారలతో తిరిగేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ప్రశ్నించారు. వెంకటేశ్‌నాయుడి వ్యాపార వివరాలు తీసుకున్నట్లు సమాచారం.

ఎవరి ఆదేశాలతో వసూలు?

రాజ్‌ కసిరెడ్డి ప్రధాన అనుచరుడైన బూనేటి చాణక్యనూ ఈడీ అధికారులు విచారించారు. మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల కమీషన్ల సొమ్ము ఎవరికి చేర్చారో ఆరా తీశారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా సేకరించిన సొమ్ము ఎవరెవరికి చేర్చారు.. అందులో ఆయన ఎంత తీసుకున్నారు.. ఇతరులకు ఎంత చేర్చారో ప్రశ్నించారు. ఇందులో మనీలాండరింగ్‌ కోణాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

Updated Date - Mar 10 , 2026 | 04:03 AM