YSRCP MP Vijay Sai Reddy: సాయిరెడ్డికి ఈడీ సమన్లు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:59 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో ఆ పార్టీ మాజీ కీలక నేత విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది.
వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో వైసీపీ మాజీ ఎంపీకి పిలుపు
22న విచారణకు రావాలంటూ నోటీసు జారీ
ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు
స్కామ్ సంగతులు తెలిపిన సాయిరెడ్డి
రాజ్ కసిరెడ్డే కీలకమని నాడు వెల్లడి
ముడుపులను దేశం దాటించారన్న సాయిరెడ్డి
విజిల్ బ్లోయర్ అవుతానంటూ అభ్యర్థన
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో ఆ పార్టీ మాజీ కీలక నేత విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపింది. మద్యం వ్యాపారుల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు, ఆ సొమ్ము అక్రమ మార్గంలో విదేశాలకు మళ్లింపు వెనకున్న వాస్తవాన్ని వెలికి తీసేందుకు ఈడీ నడుం బిగించింది. అందులో భాగంగా విజయవాడ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని గతంలో ప్రశ్నించిన ఈడీ.. డిస్టిలరీస్ యజమానులు, మధ్యవర్తులను సైతం విచారించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎ్‌సబీసీఎల్) మద్యం సరఫరాదారులకు చేసిన చెల్లింపుల నుంచి వైసీపీ లిక్కర్ మాఫియా పలు మార్గాల్లో కమీషన్ వసూలు చేసింది. ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు, ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వైసీపీ అభ్యర్థులకు ఎలక్షన్ ఫండ్, విదేశాలకు మనీ లాండరింగ్, దుస్తులు-బంగారం కొనుగోలు పేరుతో నకిలీ బిల్లులు సృష్టించడం లాంటి బాగోతాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెలికి తీసింది. ఈ వివరాలు తీసుకున్న ఈడీ అందులో వాస్తవాలను నిర్ధారించుకుని, మనీలాండరింగ్ బాగోతాన్ని వెలికి తీస్తోంది. దశలవారీ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో లిక్కర్ పాలసీ మొదలుకొని సరఫరా ఆర్డర్లలో అవకతవకలు, నకిలీ డిస్టిలరీల ఏర్పాటు, తప్పుడు లావాదేవీలతో బిల్లులు పొందడం, సరఫరాదారులను ముడుపుల కోసం బెదిరించడం...ఇలా రూ.మూడున్నర వేల కోట్ల దోపిడీలో ప్రతి విషయం తెలిసిన విజయసాయి రెడ్డి, విజిల్ బ్లోయర్‌గా ఉంటానని గత ఏడాది ప్రకటించారు. 2019-24లో మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన కమీషన్ అక్రమ మార్గంలో విదేశాలకు మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. మద్యం దుకాణాల్లో కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం, డిజిటల్ పే మెంట్లు అనుమతించక పోవడం వెనకున్న గుట్టును వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది.
లిక్కర్ సరఫరాతోపాటు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై సిట్ సేకరించిన ఆధారాల మేరకు ఈడీ పలువురిని ప్రశ్నించింది. అందులో ప్రధానంగా 16 కంపెనీలు, వ్యాపారుల పాత్రపై కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించింది. జగన్ హయాంలో ఏపీఎ్‌సబీసీఎల్ కొనుగోలు చేసిన 23 వేల కోట్ల రూపాయల మద్యంలో కమీషన్లు చెల్లించిన ఆ పదహారు సంస్థలకే భారీగా ఆర్డర్లు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. కుంభకోణంలో జగన్ మాజీ సలహాదారు (ఐటీ) రాజ్ కసిరెడ్డి (ఏ1) పాత్రే అత్యంత కీలకమంటూ గత ఏడాది ఏప్రిల్ 18న విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విజయ సాయి రెడ్డి అధికారులకు వివరించారు. మద్యం ముడుపుల సొమ్ము సేకరించిన రాజ్ కసిరెడ్డి, బంధువు ముప్పిడి అవినాశ్ రెడ్డి, మరికొందరితో కలిసి హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు నాడు సాయిరెడ్డి తెలిపారు.
16 మంది అరెస్ట్.. 50 మంది నిందితులు..
దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్‌లో 16 మందిని సిట్ అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎ్‌సడీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ముంబైకి చెందిన హవాలా వ్యాపారి అనిల్ చోక్రా తదితరులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో కొందరు బెయిల్‌పై విడుదలవ్వగా, మరికొందరు జైల్లోనే ఉన్నారు. అయితే ఈ కేసులో వ్యాపారులు, సంస్థలు కలిపి మొత్తం 50మందికి పైగా నిందితుల్ని చేరుస్తూ సిట్ అధికారులు కోర్టుకు వివరాలు సమర్పించారు.
మూడు చార్జిషీట్లు దాఖలు..
గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన సిట్ అధునాతన టెక్నాలజీ వినియోగించి అత్యంత వేగంగా కేసు దర్యాప్తు చేపట్టింది. ఎప్పటికప్పుడు ఊహించని వ్యక్తుల పాత్రపై ఆధారాలు సేకరించి వివిధ రాష్ట్రాల్లో దాక్కున్న వారిని లాక్కొచ్చి జైల్లోకి తోసింది. గత ఏడాది జూలై 19న మొదటి చార్జిషీట్ 305 పేజీలతో దాఖలు చేసింది. అందులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించింది. ఆగస్టు 12న సుమారు 200 పేజీలతో మరో అనుబంధ చార్జీషీట్‌ను, సెప్టెంబరులో మూడో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.