Share News

ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసు

ABN , Publish Date - May 26 , 2026 | 04:43 AM

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకీలక్ష్మికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసు

  • ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలోకి మద్యం కుంభకోణం డబ్బులు?

  • ఆ నోటీసు వ్యక్తిగతం కాదు.. సంస్థకే: ఎంపీ

  • 2022లోనే బయటకు వచ్చేశామని వెల్లడి

విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకీలక్ష్మికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనే ఈడీ ఆమెకు నోటీసులు ఇవ్వగా.. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నోటీసులతో తన సతీమణికి సంబంధం లేదని, నాడు స్థాపించిన సంస్థల్లో జానకీలక్ష్మి ఒక డైరెక్టర్‌గా ఉన్నారని, ప్రస్తుత నోటీసులు సంస్థలకు ఇచ్చినవేగాని.. వ్యక్తిగతం ఆమెకు వచ్చినవి కాదని ఎంపీ చెప్పారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ప్రైడ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలో జానకీలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఈడీ ఆరా తీస్తోంది. దీనిపై చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. ప్రైడ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ద్వారా రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని, రాజ్‌ కసిరెడ్డి సంగతి తెలిశాక 2022లో కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని తెలిపారు. ఆ లావాదేవీకి సమాధానం కోరుతూ ఈడీ నోటీసు పంపిందని, కంపెనీకి వచ్చిన నోటీసుపై కచ్చితంగా వివరణ ఇస్తామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఈడీ నుంచి నోటీసు వస్తే లిక్కర్‌ స్కాంతో ముడి పెట్టి వివాదం చేయడం సమంజసం కాదని చిన్ని అన్నారు.

Updated Date - May 26 , 2026 | 04:45 AM