Share News

ఇక ఇసుక వంతు!

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:23 AM

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ విలువ ఎంత? ఇసుక వ్యాపారంలో వైసీపీ నేతలు లాభపడ్డారా.. లేక తవ్వకం, అమ్మకం కాంట్రాక్టులు దక్కించుకున్న జేపీ వెంచర్స్‌, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలు లబ్ధి పొందాయా?

ఇక ఇసుక వంతు!

  • జగన్‌ జమానాలో అక్రమ దందాపై ఈడీ కన్ను

  • ఎన్‌జీటీ, సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన గుంటూరువాసికి పిలుపు

  • 8 గంటలపాటు విచారణ.. రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందన్న నాగేంద్ర

  • కాంట్రాక్టు ఏజెన్సీలకు త్వరలో నోటీసులు?.. అధికారులకూ పిలుపు!

  • దందాలో ఎవరి పాత్ర ఎంతో ఇప్పటికే ఈడీ వద్ద పక్కా సమాచారం

  • నాగేంద్ర ఇచ్చిన వివరాలతో పోల్చిచూసుకున్న అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ విలువ ఎంత? ఇసుక వ్యాపారంలో వైసీపీ నేతలు లాభపడ్డారా.. లేక తవ్వకం, అమ్మకం కాంట్రాక్టులు దక్కించుకున్న జేపీ వెంచర్స్‌, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలు లబ్ధి పొందాయా? అంతా కలిసి దోచుకున్న సొమ్మెంత.. అక్రమ తవ్వకాల్లో ఎవరి వాటా ఎంత.. అక్రమ ఇసుక దందాతో రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన ఆర్థిక నష్టమెంత? ..ఇప్పుడీ లెక్కలు తేల్చే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. నిమగ్నమై ఉంది. జగన్‌ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు, దోపిడీ జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తేల్చాయి. ఇప్పుడీ అంశంలో ఆర్థిక నేరం కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇసుక దందాలో జరిగిన నిజమైన దోపిడీ ఎంత.. ఆ సొమ్ము ఎక్కడికెళ్లింది.. ఎవరు లబ్ధి పొందారో తేల్చేందుకు.. ఇసుక అక్రమాలపై తొలి నుంచీ పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన దండా నాగేంద్రకుమార్‌ను పిలిపించింది. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6గంటల దాకా విచారించింది. 2021-24 మధ్య ఇసుక దోపిడీ, వైసీపీ నేతల దందాలు, ట్రైబ్యునల్‌, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసుల విచారణ, వాటి ఉత్తర్వులు, దోపిడీలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర, కాంట్రాక్టు సంస్థల ఆగడాలు, జరిగిన పర్యావరణ విధ్వంసం మొదలైన సమాచారాన్ని సేకరించింది. 2021 నుంచి 2024 మే వరకు.. అంటే జగన్‌ దిగిపోయేవరకు రాష్ట్రంలో కనీసం రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని నాగేంద్ర తెలిపారు. ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా నాడు ఇసుక కాంట్రాక్టులు చేసిన జేపీ వెంచర్స్‌, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఏపీఎండీసీ, గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా పిలువనున్నట్లు సమాచారం.


తొలి నుంచీ అక్రమాలు..

2021 మేలో జేపీ వెంచర్స్‌కు ఇసుక టెండర్‌ అప్పగించగా.. ఆగస్టులో అక్రమ తవ్వకాలు, పర్యావరణ విధ్వంసం చేస్తున్నారంటూ జేపీ వెంచర్స్‌పై నాగేంద్రకుమార్‌ ఎన్‌జీటీలో కేసు వేశారు. దాని ఆధారంగా రాష్ట్ర పర్యావరణ ప్రభావం అంచనా సంస్థ (సియా).. కాలుష్య నియంత్రణ మండలి, ఇంకా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని జాయింట్‌ కమిటీలతో ట్రైబ్యునల్‌ విచారణలు చేయించాయి. సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని, పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించారని తేలడంతో 2023 మార్చి 23న ఎన్‌జీటీ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని అన్ని రీచ్‌లకు ఇచ్చిన పర్యావరణ అనుమతు(ఈసీ)లను రద్దుచేసింది. దీంతో బీ2 కేటగిరీ 110 రీచ్‌ల్లో, ఇంకా ఇతర అనుమతి తీసుకోని ఇతర రీచ్‌ల్లో తక్షణమే తవ్వకాలు ఆపేయాలని జేపీ వెంచర్స్‌కు, గనుల శాఖ డైరెక్టర్‌కు సియా నోటీసులు జారీ చేసింది. జేపీ వెంచర్స్‌ తీవ్ర స్థాయిలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక్కో రీచ్‌కు రూ.18 కోట్ల చొప్పున పెనాల్టీ విధించింది. ఆ సొమ్ము చెల్లించాకే మైనింగ్‌కు కొత్తగా ఈసీలు తీసుకోవాలని ఎన్‌జీటీ కూడా ఆదేశించింది. కాంట్రాక్టు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. కానీ ఈసీలు లేకుండా, కొత్తగా ఇసుక రీచ్‌లకు అనుమతి లేకున్నా 2023 నవంబరు నెలాఖరు వరకు జేపీ వెంచర్స్‌ ఇసుక తవ్వకాలు జరిపిందని, ఇందులో పర్యావరణ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని కేంద్ర అటవీ పర్యావరణ పరిరక్షణ విభాగం సుప్రీంకోర్టుకు నివేదించింది.


కొత్త కంపెనీలదీ ఆ బాటే..

2023 డిసెంబరు నుంచి 2024 జూన్‌దాకా 18 జిల్లాల్లో ప్రతిమ, 8 జిల్లాల్లో జీసీకేసీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరిగాయి. కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే తవ్వకాలు చేపట్టాలని హైకోర్టు గనుల శాఖను, ఈ రెండు సంస్థలను ఆదేశించింది. అయినా ఈసీలు లేకుండా, చట్ట విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నాయని కేంద్ర ఏజెన్సీలు బయటపెట్టాయి. ఈ ఉల్లంఘనల వెనక వైసీపీ నేతల హస్తం ఉందన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జాయింట్‌ కమిటీతో విచారణ చేయించింది. అందులోనూ విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ‘2023 నవంబరు నాటికి జేపీ వెంచర్స్‌కు బీ2 కేటగిరీలో ఈసీలు లేకున్నా జేసీబీలు, ఇతర యంత్రాలతో మైనింగ్‌ చేసింది. దీనిని నోడల్‌ ఏజెన్సీ అయిన ఏపీఎండీసీ అడ్డుకోలేకపోయింది. 2023 డిసెంబరు నుంచి జీసీకేసీ ప్రాజెక్స్‌, ప్రతిమ సంస్థలు కూడా ఈసీలు, రీచ్‌ అనుమతులు లేకుండానే మైనింగ్‌ చేస్తున్నాయి. ఇది అక్రమం. దీనిపై నోడల్‌ ఏజెన్సీగా ఉన్న గనుల శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో అర్థం కావడం లేదు. అక్రమ మైనింగ్‌తో పర్యావరణం దెబ్బతింది. కనీసం పర్యావరణ పరిరక్షణ ప్లాన్లు లేకుండానే రోజుకు ఒక్కో రీచ్‌లో 2వేల టన్నుల ఇసుకను తవ్వి తరలించారు. రీచ్‌ల్లో 24 గంటలూ తవ్వకాలు చేస్తున్నారు’ అని వివరించింది.


ఈడీ ఏం తేల్చనుంది..?

2019 నుంచి 2021 మే 12 వరకు ఏపీఎండీసీ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక అమ్మకాలు, వచ్చిన ఆదాయం, ఖర్చులు.. ఇంకా 2021 మే 13 నుంచి 2024 మే వరకు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సాగిన కాంట్రాక్టు, ఆదాయం, బిల్లుల చెల్లింపు, ప్రైవేటు అక్రమ తవ్వకాలు వంటి కీలకాంశాలపై ఈడీ కూపీ లాగనుంది. అక్రమ తవ్వకాలు, విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ము ఎక్కడకు వెళ్లింది? ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరిందో పూర్తి వివరాలు బయటపెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయు.

ఇదీ నేపథ్యం..

2014-19 నడుమ అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చింది. 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక దానిని ఎత్తివేసింది. 2021 నుంచి ప్రైవేటు సంస్థ జేపీ వెంచర్స్‌కు తవ్వకాలు, అమ్మకం కాంట్రాక్టు ఇచ్చింది. 2021 మే 13 నుంచి 2023 మే 13 వరకు రెండేళ్ల టెండర్‌ విలువ రూ.1510 కోట్లు. జేపీ వెంచర్స్‌ రూ.1535 కోట్లకు బిడ్‌ వేసి టెండర్‌ దక్కించుకుంది. కానీ కాంట్రాక్టు 2023 నవంబరు దాకా కొనసాగింది. అనంతరం 2023-25 కాలానికి టెండర్లు పిలువగా జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా దక్కించుకున్నాయి. టెండర్‌ విలువ రూ.1529 కోట్లే అయినా.. అది కాగితంపై కనిపించే లెక్కే. ఆచరణలో కంటికి కనిపించని దోపిడీ జరిగినట్లు ఎన్‌జీటీ విచారణలో వెల్లడైంది.

Updated Date - Jul 16 , 2026 | 04:24 AM