లిక్కర్ స్కామ్ నిందితులకు ముగిసిన ఈడీ కస్టడీ
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:14 AM
మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్‌ల కస్టడీ గడువు ముగియడంతో ఈడీ అధికారులు శనివారం సాయంత్రం ఆ ముగ్గురినీ ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
అంతిమ లబ్ధిదారు, సహాయకుల విచారణకు సన్నద్ధం?
ఆధారాలు సేకరించిన అధికారులు?
హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్‌ల కస్టడీ గడువు ముగియడంతో ఈడీ అధికారులు శనివారం సాయంత్రం ఆ ముగ్గురినీ ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏపీలో మద్యం రవాణా కుంభకోణం నాటి సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, వీరికి అనుకూలంగా నాటి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహరించారని, మద్యం రవాణాలో కమీషన్లు నాటి మంత్రి కుమారుడు కారుమూరు సునీల్‌కు అందాయన్న విషయాలకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. నిందితులు చెప్పిన విషయాల ఆధారంగా.. ఈ వ్యవహరంలో వచ్చిన కోట్లాది రూపాయల మొత్తం పలు చేతులు, దారులు మారి ఒక్కరి వద్దకే చేరిందని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అంతిమ లబ్ధిదారుడు, ఆయనకు సహకరించిన మరికొందరిని విచారించడానికి ఈడీ అధికారులు సన్నద్దులయినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా ధరలు పెంచి ప్రభుత్వానికి రూ.195.33 కోట్లు నష్టం వాటిల్లేలా రాజ్ కసిరెడ్డి బృందం వ్యవహారాలు నడిపిందని, ఆ మొత్తం సొమ్ము హవాలా మార్గం, షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్, బెంగళూరులోని కీలక వ్యక్తికి అందిందని ఈడీ అధికారులు ఈ ముగ్గురి కస్టడీ విచారణ సమయంలో ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.