Share News

ఈడీ దూకుడు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:25 AM

రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా స్కాంలో మనీలాండరింగ్‌ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.

ఈడీ దూకుడు!

  • లిక్కర్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

  • చంచల్‌గూడ జైలుకు తరలింపు

  • మద్యం రవాణా, కుంభకోణం కేసుల్లో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు

  • మాజీ మంత్రి కారుమూరి నివాసంలో సోదాలు

  • హైదరాబాద్‌ సహా 15 చోట్ల తనిఖీలు

  • భారీగా ఆస్తుల గుర్తింపు

  • కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాల జప్తు

  • ఓ ఐపీఎస్‌ బినామీ కంపెనీల పాత్ర గుర్తింపు

హైదరాబాద్‌, జూన్‌11 (ఆంధ్రజ్యోతి): రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా స్కాంలో మనీలాండరింగ్‌ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో కింగ్‌పిన్‌, గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వాసుదేవ రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించింది. మద్యం రవాణా, కుంభకోణం కేసుల్లో మనీలాండరింగ్‌ కోణంలో రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్టు చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. వీరిద్దరినీ ఈడీ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో, పటిష్ఠమైన భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. మద్యం రవాణా టెండర్లు, అక్రమాలపై ఏపీ సిట్‌ నమోదు చేసిన మరో కేసు ఆధారంగా తాజాగా ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ నమోదు చేశారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌తో పాటు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌, రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నర్సింహారెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ నానక్‌రాం గూడలోని ఆయన ఇంటి నుంచి రాజ్‌ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించి నిశితంగా ప్రశ్నించారు. ఫిలింనగర్‌లోని మాజీ మంత్రి ఇంట్లో దాదాపు ఆరున్నర గంటలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాసుదేవ రెడ్డి, కోకాపేటలోని ఆయన బంధువు విజయ్‌ నర్సింహరెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలు, ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వాసుదేవరెడ్డి తన అధికారిక హోదాను ఉపయోగించి అధిక ధరలకు ముందస్తుగా నిర్ణయించిన సంస్థలకు మద్యం రవాణా టెండర్లు కట్టబెట్టారని ఈడీ అధికారులు గుర్తించారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.349కోట్ల నష్టం జరిగిందని, కిక్‌బాక్స్‌ రూపంలో వాసుదేవరెడ్డి బినామీ ఖాతాలకు కోట్లాది రూపాయల డబ్బు మరలినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైందని తెలుస్తోంది.


‘రవాణా’లో కారుమూరికి భారీ లబ్ధి

ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. మద్యం రవాణాకు సంబంధించి న్యూఢిల్లీకి చెందిన సిగ్మా కంపెనీని తెరముందు పెట్టి వాసుదేవరెడ్డి నేతృత్వంలో కొన్ని బినామీ సంస్ధల ద్వారా వ్యవహరాలు నడిపారు. ఇందులో సుదర్శన్‌ ఫర్మ్‌ యజమాని సందీ్‌పకు రూ.68కోట్ల లాభం కలిగింది. ఇందులో నుంచి కారుమూరి కుటుంబానికి రూ.15కోట్లు నగదు రూపం చెల్లించారు. ఢిల్లీ కంపెనీ పేరును వాడుకున్నందుకు కేవలం ఆ కంపెనీకి మొత్తం బిల్లింగ్‌లో నాలుగుశాతం కమీషన్‌ ఇచ్చారు. 96శాతం మొత్తాలను రవాణా సిండికేట్‌ షెల్‌ కంపెనీలు, హవాలా రూపంలో చేతులు మార్చింది. మద్యం అక్రమ రవాణా విషయంలో అప్పట్లో డిప్యుటేషన్‌పై ఏపీలో పనిచేసిన ఒక ఐపీఎస్‌ అధికారి బినామీ కంపెనీ పాత్ర సైతం ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సదరు ఐపీఎస్‌ అధికారి బినామీ కంపెనీకి సంబంధించిన వ్యక్తులను ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. త్వరలో ఆయా వ్యక్తులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు దాదాపు రూ.400కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ రైల్వేస్‌లో రైల్వే ట్రాఫిక్‌ సర్వీసు అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డిని నాటి వైసీపీ ప్రభుత్వం డిప్యూటేషన్‌పై తీసుకుని వచ్చి కీలక పదవిలో కూర్చోపెట్టింది. మద్యం ఆర్డర్లకు సంబంధించి ప్రతి కే సుకు రూ.200 నుంచి రూ.250 వరకు కమీషన్‌ రూపంలో ఆయన తీసుకున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుతో దాదాపు రూ.300 కోట్ల బంగారం కొన్నారన్న విషయాలపైనా ఈడీ అధికారులు నిశితంగా విచారణ చేస్తున్నారు. కాగా, మద్యం స్కామ్‌కు సంబంధించి సిట్‌ అధికారులు రాజ్‌ కసిరెడ్డి సహా 33మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవల రాజ్‌ కసిరెడ్డి బెయిల్‌ మీద బయటకువచ్చారు.

నెలకు రూ.60 కోట్ల ముడుపులు...

రాజ్‌ కసిరెడ్డి ప్రతినెల రూ.60కోట్ల మద్యం ముడుపులను స్వీకరించారని ఈడీ అధికారులు రిమాండ్‌ నోట్‌లో పేర్కొన్నారు. , 2019 నుంచే ముడుపుల ప్రవాహం ప్రారంభమైందని తెలిపారు. దాదాపు రూ.3,200కోట్ల ముడుపులు చేతులు మారాయని, హైదరాబాద్‌,ముంబాయి,ఢిల్లీలోని హవాలా ఆపరేటర్లు, షెల్‌ కంపెనీల ద్వారా డబ్బు ఎక్కువగా మార్పిడి జరిగిందని, ముడుపుల సొమ్ములో కొంతభాగాన్ని హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రా రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే బంగారం కొనుగోలుకు ఆధారాలు ఉన్నాయని, ఈ బంగారం గుట్టలు ఎక్కడున్నాయో త్వరలో బయటపడే అవకాశాలున్నాయని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.


అంతిమ లబ్ధిదారు దిశగా..

దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులు షెల్‌ కంపెనీలు, హవాలా మార్గాలు, బంగారం, నగదు రూపేణా చెలామణి అయిన క్రమంలో ఈడీ అధికారులు కీలక విషయం వైపు దృష్టి సారిస్తున్నారు. మనీ లాండరింగ్‌ ఏ విధంగా జరిగింది? ఎవరెవరి నుంచి డబ్బు ఎటు వెళ్లింది? అంతిమంగా ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు డబ్బు ఎలా చేరిందన్న అంశాలపై ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాజా అరెస్టుల నేపఽథ్యంలో త్వరలో అంతిమ లబ్ధిదారును ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈడీ సోదాలకు సహకరించాం: కారుమూరి

మద్యం ముడుపుల కేసుకు సంబంధించి ఈడీ విచారణకు తమ కుటుంబ సభ్యులు సహకరించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ హైదరాబాద్‌లోని మా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలకు తన కుమారుడు, కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు. మేం ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదు. తప్పును సమర్థించలేదు.’’ అని తెలిపారు.

వాసుదేవరెడ్డి పిటిషన్‌పై సిట్‌ కౌంటర్‌..

మద్యం రవాణా కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సిట్‌ అధికారులు గురువారం కౌంటర్‌ దాఖలు చేశారు. మద్యం రవాణాలో అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. సిట్‌ అధికారులు ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని భావించిన ఆయన ముందస్తు బెయిల్‌ కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆదేశంతో సిట్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 04:25 AM