కారుమూరి కొడుకు అరెస్ట్
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:57 AM
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కాంట్రాక్టుల స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
మద్యం రవాణా స్కాంలో ఈడీ దూకుడు
తండ్రి నాగేశ్వరరావుకూ సమన్లు
23న విచారణకు రావాలని శ్రీముఖం
కొడుకు సునీల్‌కు 25 వరకు రిమాండ్
ఆ రోజు కసిరెడ్డి, వాసుదేవరెడ్డితో పాటు ఆయన్నూ హాజరుపరచాలని కోర్టు ఆదేశం
సిగ్మా నుంచి సబ్ కాంట్రాక్టుల దాకా..
కారుమూరి కుటుంబంపై ప్రత్యేక దృష్టి
వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్‌కు నో
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కాంట్రాక్టుల స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని నాగేశ్వరరావుకు కూడా సమన్లు జారీ చేశారు. గురువారం సునీల్ కుమార్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ అధికారులు తొలుత తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కొద్ది సేపు విచారించిన తర్వాత అరెస్టు విషయాన్ని ప్రకటించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సునీల్‌ను నాంపల్లిలోని ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయాధికారి ఆయనకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. తదుపరి వాయిదాలో ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక సూత్రధారులు, నిందితులు రాజ్‌కసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలతో కలిపి సునీల్ కుమార్‌ను కూడా హాజరుపరచాలని తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నాటి ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సంగతి విదితమే. నాటి తనిఖీల్లో కారుమూరి ఇంట్లో రూ.94 లక్షల ఖరీదైన వాచీలను, రవాణా కాంట్రాక్టులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు.. తన నాయనమ్మ చనిపోయారని.. తనకు వారం రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ కోర్టు గురువారం విచారణ జరిపింది. వాదనలు విన్న తర్వాత వ్యాజ్యాన్ని డిస్మిస్ చేస్తున్నట్లు ఈడీ కేసుల ప్రత్యేక న్యాయాధికారి ప్రకటించారు.
ఖజానాకు రూ.195.33 కోట్లు నష్టం...
మద్యం రవాణా స్కాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ రవాణా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి.. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీఎస్‌పీఎల్), ఆ తర్వాత ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్‌కు అనుకూలంగా రూపొందించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థలు కేవలం ముందువరుస సంస్థలుగా వ్యవహరించగా, వాస్తవ ఆర్థిక, నిర్వహణ నియంత్రణ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, వారి అనుచరుల చేతుల్లోనే ఉన్నట్లు ఈడీ గుర్తించింది. రాజ్ కసిరెడ్డి, తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డి, అంజనీ కుమార్ కలిసి వాసుదేవరెడ్డి సహకారంతో మార్కెట్ రేట్ల కంటే అధిక ధరలకు లిక్కర్ రవాణా టెండర్లు దక్కించుకుని అక్రమంగా భారీ లాభాలు పొందినట్లు విచారణలో తేలింది. కేంద్రీకృత రవాణా విధానం తెరపైకి తెచ్చి ఒక్కో కార్టూన్ రవాణా సగటు ధర రూ.19.68 ఉండగా.. దానిని రూ.35.57 వరకు పెంచి సిండికేట్‌కు భారీ లాభాలు చేకూర్చి ఆ నిధులను షెల్ కంపెనీలు, హవాలా ద్వారా బినామీలకు చేర్చారని గుర్తించింది. నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ ఈ రవాణా విధానంలో తమ వాటా తాము తీసుకున్నారని.. సిగ్మా కంపెనీకి కేవలం నాలుగుశాతం వాటా ఇచ్చి మిగతా మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి సిండికేట్‌లోని వారందరికీ పంపిణీ చేశారని, దాదాపు రూ.10 కోట్లకు పైగా కారుమూరి కుటుంబానికి అందినట్లు ఈడీ గుర్తించింది.