Share News

ఎకనమిక్‌ బూస్ట్‌!

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:11 AM

కీలక రంగాల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్‌ 2026 - 27 ఉమ్మడి కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా కేటాయింపులు కనిపించకపోయినా.. కేంద్ర బడ్జెట్‌ గ్రాస్‌ రూట్‌లో ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా ఉందన్నది వివిధ వర్గాల ప్రతినిధులు, రంగాలకు చెందిన అనుభవజ్ఞుల మాటగా ఉంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉన్నాయి. మరిన్ని రంగాలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్‌ ఉంది.

ఎకనమిక్‌ బూస్ట్‌!

- కేంద్ర ఆర్థిక బడ్జెట్‌తో ఉమ్మడి కృష్ణాకు మేలు

- విజయవాడతో పాటు మచిలీపట్నంలోనూ సీ ప్లేన్‌ ప్రాజెక్టుల సాకారానికి అవకాశం

- అమరావతి మీదుగా చెన్నై - హైదరాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌

- ఎలక్ర్టికల్‌ బస్సులు త్వరగా రోడ్డెక్కడానికి తోడ్పాటు!

- పారిశ్రామికంగా అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ యాక్షన్‌ ప్లాన్‌ దోహదం

- కంటైనర్‌ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రోత్సాహకాలు.. బందరుకు వరం

కీలక రంగాల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్‌ 2026 - 27 ఉమ్మడి కృష్ణాజిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా కేటాయింపులు కనిపించకపోయినా.. కేంద్ర బడ్జెట్‌ గ్రాస్‌ రూట్‌లో ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా ఉందన్నది వివిధ వర్గాల ప్రతినిధులు, రంగాలకు చెందిన అనుభవజ్ఞుల మాటగా ఉంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉన్నాయి. మరిన్ని రంగాలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్‌ ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

పర్యాటక రంగంలో ప్రధానంగా సీ ప్లేన్‌ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఏర్పాటు చేయబోయే సీ ప్లేన్‌ ప్రాజెక్టుకు వరంగా మారనుంది. సీ ప్లేన్‌ ప్రాజెక్టును విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రయోగాత్మకంగా నడపనున్నారు. సాధారణ విమానాలతో పోల్చుకుంటే సీ ప్లేన్‌కు నిర్వహణ వ్యయం ఎక్కువుగా ఉంటుంది. సీ ప్లేన్‌ నిర్వహణ వ్యయం దాటి లాభాలు రావటానికి తగినంత ఆదరణ ఉండాలి. సీప్లేన్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చే వారికి ధైర్యంగా ఉండటానికి వీజీఎఫ్‌ ఉపయోగపడుతుంది. వీజీఎఫ్‌ వల్ల మరిన్ని సీ ప్లేన్‌ ప్రాజెక్టులకు అవకాశాలు కలుగుతాయి. మచిలీపట్నం సముద్ర ప్రాంతం నుంచి కూడా పలు ప్రాంతాలకు సీ ప్లేన్లను నడపటానికి వీలు కలుగుతుంది.

తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు..

కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించటానికి తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు

చాంపియన్‌ ఎంఎస్‌ఎంఈ ప్లాన్‌కు శ్రీకారం చుట్టడం వల్ల ఉమ్మడి కృష్ణాజిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగలేదన్న లోటు తీరటానికి అవకాశం కలగనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలలో పారిశ్రామిక పార్క్‌లకు ప్రభుత్వం ఇప్పటికే చొరవ చూపుతోంది. కేంద్ర ప్రోత్సాహకం కూడా తోడైతే.. మరింతగా ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశం కలుగుతుంది. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తయారీకి వనరులున్న ప్రాంతం. ఎంఎస్‌ఎంఈలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగ అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశాలు ఉన్నాయి. ఖనిజ వనరులున్న ప్రాంతం కూడా. ప్రధానంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అనేక రకాలైన ఖనిజ వనరులు ఉన్నాయి. ఖనిజ రంగ అభివృద్ధికి రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ ప్రాజెక్టు దోహదపడే అవకాశం ఉంది.

నగరాల అభివృద్ధికి అవకాశం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పట్టణీకరణ దిశగా అడుగులు వెయ్యటానికి అనేక ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో టూ టైర్‌, త్రీ టైర్‌ నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించడంతో.. పట్టణాలలో భారీ మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలలో చెన్నై - హైదరాబాద్‌ అమరావతి మీదుగా వెళుతుంది. ఇదే కనుక అమరావతి మీదుగా హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ వెళుతుంది. రాజధాని ప్రాంత రవాణారంగంలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. మహిళల స్వయం సమృద్ధి కోసం షీ మార్టులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దటానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్‌ఎంఈ రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఉన్నా.. ఇటీవల కాలంలో స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం రైజ్‌ వంటి కార్యక్రమాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు తగిన సహకారం ఇస్తోంది.

ఎలక్ర్టికల్‌ బస్సుల వినియోగంపై ఆశలు

ఎలక్ర్టికల్‌ బస్సుల వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రకటన.. మనకు వరంగా మారనుంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆర్టీసీ తరపున 100 ఎలక్ర్టికల్‌ బస్సులు నడపాలన్న ప్రతిపాదన ఉంది. ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎలక్ర్టికల్‌ బస్సులు కొనుగోలు, నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఎలక్ర్టికల్‌ బస్సులను మరిన్ని ప్రవేశపెట్టడానికి వీలుగా కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాల ద్వారా .. ఈ బస్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ మొబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాలకు పెద్ద పీట వేయటంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రంగంలో కోర్సులు అభ్యశిస్తున్న వారికి శుభవార్త అని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కార్యకలాపాలు పెరగటానికి కూడా అవకాశం ఏర్పడనుంది. కంటైనర్‌ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రోత్సాహకాలను ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం వల్ల కృష్ణా జిల్లాలో కంటైనర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అవకాశాలు ఏర్పడనున్నాయి. మచిలీపట్నం పోర్టులో కంటైనర్‌ రవాణా కీలకపాత్ర పోషించనుంది. కృష్ణా జిల్లా కేంద్రంగా కంటైనర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్‌ నెలకొల్పగలిగితే లాజిస్టిక్‌ రంగానికి అనువుగా ఉంటుంది.

Updated Date - Feb 02 , 2026 | 01:12 AM