Share News

కాలువలో పది కిలోమీటర్లు కొట్టుకుపోయి..!

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:45 AM

విధి రాతను ఎవరూ తప్పించలేరు.. చావాలనుకున్నా మరణం రాదు... బతకాలనుకున్నా మృత్యువు ఆగదు.. అని నిరూపించేలా.. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో..

కాలువలో పది కిలోమీటర్లు కొట్టుకుపోయి..!

  • జీవితంపై విరక్తితో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

  • మృతదేహం అనుకుని వెలికితీసిన ఉపాధి కూలీలు.. నిలిచిన ప్రాణం

  • ఆసుపత్రిలో కోలుకుంటున్న వృద్ధురాలు

అనపర్తి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): విధి రాతను ఎవరూ తప్పించలేరు.. చావాలనుకున్నా మరణం రాదు... బతకాలనుకున్నా మృత్యువు ఆగదు.. అని నిరూపించేలా.. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో వెలుగు చూసిన ఘటన రుజువుచేసింది. మండపేటకు మండలం చినద్వారపూడికి చెందిన కోట రామలక్ష్మి సత్యనారాయణ అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి వివాహాలై పిల్లాపాపలతో ఉన్నారు. కొద్ది రోజుల కిందట భార్య రామలక్ష్మిపై అలిగిన సత్యనారాయణ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో రామలక్ష్మి ఇక తానెవరి కోసం బతకాలంటూ జీవితంపై విరక్తి పెంచుకుంది. నాలుగు రోజుల కిందట ఇద్దరు కుమారులు.. తండ్రి చితాభస్మాన్ని కాశీలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రామలక్ష్మి సోమవారం తెల్లవారుజామున చినద్వారపూడిలో కాకినాడ కాలువలో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె అలా చినద్వారపూడి నుంచి అనపర్తి మీదుగా కొప్పవరం వరకు కాలువలో సుమారు పది కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. ఉదయం కొప్పవరంలో ఉపాధి పనులు చేస్తున్న కొంతమంది కూలీలు నీటిలో కొట్టుకుపోతున్న ఆమెను గమనించి.. మృతదేహం అనుకుని బయటికి లాగారు. అయితే.. ఆమెలో కొద్దిగా చలనం గమనించి.. మాజీ సర్పంచ్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి వెంకటరామారెడ్డి సహకారంతో హుటాహుటిన అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆమెకు సపర్యలు చేస్తున్నారు. కుమారులు, కోడళ్లు తనను బాగానే చూసుకుంటున్నారని, భర్త మరణంతో జీవితంపై విరక్తితో ఇలా చేశానని ఆ వృద్ధురాలు చెబుతోంది. కాశీకి వెళ్లిన కుమారులు మంగళవారం ఇంటికి చేరుకుంటారని.. వారు వచ్చిన తర్వాత వృద్ధురాలిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 04:46 AM