Share News

దూసుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - May 15 , 2026 | 04:39 AM

డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా 16మంది గాయపడ్డారు.

దూసుకొచ్చిన మృత్యువు

  • డివైడర్‌ దాటివచ్చి బస్సును ఢీకొన్న టిప్పర్‌

  • యువకుడి మృతి.. 16 మందికి గాయాలు

రాజమహేంద్రవరం/దేవరపల్లి, మే 14(ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా 16మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును డివైడర్‌ దాటుకుని వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ శ్రీవెంకట రమణ ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సు శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి బయలుదే రింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు గురువారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో యర్నగూడెం వద్దకు చేరింది. నల్లజర్లలో కంకర దిగుమతి చేసి దేవరపల్లి వైపు వెళుతున్న టిప్పర్‌ ఒక్కసారిగా డివైడర్‌ దాటి దూసుకొచ్చి ట్రావెల్స్‌ బస్సును డ్రైవరు వైపు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయింది. ప్రమాదధాటికి డ్రైవరు వెనుక సీట్లో కూర్చున్న శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పనసలవలస గ్రామానికి చెందిన నారు సాయి అనిల్‌ కుమార్‌(24) పగిలిన అద్దం నుంచి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. బస్సు డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్‌, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారితో సహా 16 మందికి గాయాలయ్యాయి. దేవరపల్లి పోలీసులు వెంటనే క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు అనిల్‌ కుమార్‌ తన తమ్ముడు, తల్లిదండ్రులతో గన్నవరంలోని ఓ వేడుకకు వెళుతున్నాడు. తిరిగి వచ్చాక విశాఖపట్నంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవరు కంటిపై కునుకు పడడంతో టిప్పర్‌ అదుపు తప్పిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.

Updated Date - May 15 , 2026 | 04:39 AM