భూ మాయ!
ABN , Publish Date - May 02 , 2026 | 01:12 AM
భూముల రీసర్వేలో కొందరు వీఆర్వోలు, సర్వేయర్లు అక్రమాలకు తెరతీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా.. రీ సర్వేలో తమ ఇష్టానుసారం భూముల కొలతలు వేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భూమి తగ్గిన రైతులు ఆధారాలతో అర్జీ పెట్టుకుంటే సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల మార్పుల వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
- గూడూరు మండలంలో భూముల రీసర్వేపై ఆరోపణలు
- మల్లవోలులో భూమి ఒకరిది.. రికార్డుల్లో మరొకరిపేరు
- తహసీల్దార్‌కు ఫిర్యాద చేసిన బాధిత రైతు
- సరిచేయాలని వీఆర్వో, సర్వేయర్లకు తహసీల్దార్ ఆదేశం
- ఆరు నెలలుగా పట్టించుకోని ఉద్యోగులు
- కంచాకోడూరులో ఆలయ భూములకు ఇతరుల పేరు
- ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల వేడుకోలు
భూముల రీసర్వేలో కొందరు వీఆర్వోలు, సర్వేయర్లు అక్రమాలకు తెరతీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా.. రీ సర్వేలో తమ ఇష్టానుసారం భూముల కొలతలు వేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భూమి తగ్గిన రైతులు ఆధారాలతో అర్జీ పెట్టుకుంటే సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల మార్పుల వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
గూడూరు మండలంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై అనేక విమర్శలు వ్యక్తమవు తున్నాయి. వీఆర్వోలు, సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో కంచాకోడూరుకు చెందిన దావు ఆదినారాయణరావుకు సర్వే నెంబరు 66-1లో 49 సెంట్ల భూమి, 66/2లో ఒక సెంటు భూమి ఉంది. ఇటీవల జరిగిన రీసర్వేలో ఈ భూమిలో 20 సెంట్లకుపైగా భూమిని వేరే రైతు పేరున 251 ఎల్‌పీ నెంబరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ విషయాన్ని గమనించిన బాధిత రైతు తన వద్ద ఉన్న అన్ని పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో చూపి, తన పేరున ఉన్న భూమి వేరే రైతు పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని, అంతటితో ఆగకుండా సరిహద్దులను తన పొలంలో రెండు గజాల మేర ముందుకు వచ్చి నిర్ణయించారని, వాటిని సరి చేయాలని కోరుతూ అర్జీలు అందజేశాడు. గత ఆరేడు నెలలుగా పలుమార్లు తహసీల్దార్‌ను కలిసి తన గోడును వినిపించుకుంటున్నాడు.
తహసీల్దార్ చెప్పిన పని చేయని ఉద్యోగులు
దీనిపై స్పందించిన తహసీల్దార్ వెంటనే మల్లవోలు వీఆర్వో, మండల సర్వేయర్‌ను పిలిచి రైతు ఆదినారాయణరావు తన వద్ద ఉన్న ఆధారాలను చూపుతున్నాడని, పూర్తిస్థాయిలో పరిశీలించి, మళ్లీ సర్వే చేసి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ చెప్పిన ప్రతిసారి వీఆర్వో, సర్వేయర్ తన వద్ద ఉన్న భూమి పత్రాలను తీసుకోవడం, సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం, ఆ తర్వాత పట్టించుకోవడంలేదని సదరు రైతు వాపోతున్నాడు. ఇటీవల కాలంలో మళ్లీ తహసీల్దార్ వద్దకు వెళ్లి తన భూమి సమస్యను పరిష్కరించలేదని చెబితే, తహసీల్దార్ వీఆర్వో, సర్వేయర్‌లను పిలిచి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారని, దీంతో తన వద్ద వీఆర్వో, సర్వేయర్ తీసుకున్న భూమికి సంబంధించిన పత్రాలను తిరిగి తనచేతిలో పెట్టి పంపివేశారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయంపై గట్టిగా ప్రశ్నిస్తే బెదిరింపు ధోరణితో వీఆర్వో, సర్వేయర్ మాట్లాడుతున్నారని బాధిత రైతు ఆరోపించారు. ఇటీవల జరిగిన రెవెన్యూ గ్రామసభలో తన భూమి సమస్యను తహసీల్దార్ ధృష్టికి తీసుకువెళితే సర్వే నెంబరు 66/1, 66/2లోని భూమి తనపేరునే ఉందని తహసీల్దార్ ధ్రువీకరణపత్రం కూడా జారీ చేశారని, కానీ వీఆర్వో, సర్వేయర్‌లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని బాధిత రైతు చెబుతున్నాడు.
కంచాకోడూరు ఆలయ భూములను మార్చివేశారు!
గూడూరు మండలం కంచాకోడూరులో చెన్నకేశవస్వామి ఆలయానికి 79/1 నుంచి 79/6 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 4.25 ఎకరాల భూమి ఉంది. పూర్వకాలంలో గ్రామస్థుల సహకారంతో ఆలయ పూజారి దేవస్థానంలో ధూపదీప నైవేద్యాల కోసం ఈ భూమిని కొనుగోలు చేశారని గ్రామస్థులు, పెద్దలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ భూమిని రీసర్వే చేసిన సమయంలో గ్రామానికి చెందిన నలుగురి పేరున ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కంచాకోడూరు గ్రామంలో ఎకరం భూమి రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ధర ఉందని, రూ.1.27 కోట్ల వరకు పలికే ఆలయ భూముల వివరాలను సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చివేయడంతో పాటు, సర్వే చేసిన సమయంలోనూ రికార్డ్గులను తారుమారు చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. దేవదాయశాఖ, రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా వారు చూసీ, చూడ నట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వేరే ప్రాంతానికి చెందిన రెవెన్యూ అధికారులతో విచారణ చేయించి ఆలయ భూములను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కంచాకోడూరు గ్రామస్థులు కోరుతున్నారు.