భూ పండుగ
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:33 AM
సుదీర్ఘకాలంగా నిషేధ జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు ఇనాం, ఇతర ఇనాం భూములు, గృహనిర్మాణ పథకం కింద ఇచ్చిన పట్టాలకు 22ఏ జాబితా నుంచి స్వేచ్ఛ కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఎనిమిది లక్షల మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది.
- 22ఏ జాబితా నుంచి నాలుగైదు రకాల భూముల తొలగింపు
- అసైన్డ్ ఇళ్ల పట్టాలు, సర్వీసు ఈనాం భూములకు విముక్తి
- రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉమ్మడి కృష్ణాలో 2 లక్షల మందికి మేలు
- ఎనిమిది లక్షల మందికి చేకూరనున్న ప్రయోజనం
- ఫలించిన రెండేళ్ల ఎదురుచూపులు
సుదీర్ఘకాలంగా నిషేధ జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు ఇనాం, ఇతర ఇనాం భూములు, గృహనిర్మాణ పథకం కింద ఇచ్చిన పట్టాలకు 22ఏ జాబితా నుంచి స్వేచ్ఛ కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఎనిమిది లక్షల మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తుందని రెండేళ్లకుపైగా ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యమైనప్పటికీ పక్షం రోజుల్లో వీటికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుందని తెలియటంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులు
చట్ట ప్రకారం నిషేధిత చెర నుంచి విముక్తి కలగాల్సిన భూములకు ఇప్పటికీ మోక్షం లభించకపోవటంతో బాధితులు ఎంతో నష్టపోతున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించాలంటే.. న్యాయవాదులకు లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. తమ సమస్య పరిష్కారం కోసం అంత ఖర్చు చేయలేక.. ఏనాటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది
ఉమ్మడి కృష్ణాజిల్లాలో పూర్వం నుంచి లక్షలాది మందికి అసైన్డ్ పట్టాలను ప్రభుత్వాలు ఇచ్చాయి. వీటిలో కొన్ని దశాబ్దాలుగా 22ఏ జాబితా కింద మూలుగుతున్నాయి. ఈ జాబితాలో లక్షకు పైగా అసైన్డ్ ఇళ్ల పట్టాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు భూములను కొని వాటిని లే అవుట్లుగా వేసి పేదలకు నివేశనా స్థలాలు ఇవ్వటం జరిగింది. జగనన్న కాలనీలుగా గొప్పగా చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం కంటే కూడా పూర్వమే రెండున్నర సెంట్ల చొప్పున ఇళ్లపట్టాలను టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ లేఅవుట్లన్నీ అభివృద్ధి చెందిన కాలనీలుగా రూపాంతరం చెందాయి. అప్పట్లో చేసిన పొరపాటు కారణంగా ప్రైవేటు భూములను కొన్నప్పటికీ.. వాటిని పోరంబోకులుగా చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీంతో అవి కాస్తా ఆ తర్వాత క్రమంలో నిషేధిత భూముల జాబితాలో చేరిపోయాయి. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటివి మూడు వేల వరకు ఉన్నాయి. ఈ లెక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలో 42 వేల పైచిలుకు పట్టాలు ఇవే కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ భూములను నివేశనా స్థలాలుగా ఇచ్చారు. ఇవి కూడా 50 వేలకు పైగా ఉన్నాయి. ఇళ్లు కోల్పోయిన వారికి, ముంపు ప్రాంతాల్లో ఉంటున్న వారికి మరో చోట ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం 22ఏ జాబితాలో ఉన్నాయి.
యాజమాన్య హక్కులు కల్పిస్తే రిజిస్ర్టేషన్లకు అవకాశం
అసైన్డ్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం 2016కు ముందున్న వాటన్నింటినీ నిషేధిత చెర నుంచి తప్పించి వాటికి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఎవరైతే పట్టాదారులుగా ఉంటూ ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని ఉంటున్నారో వారందరికీ ముందుగా యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయి. రెవెన్యూ యంత్రాంగం నిషేధిత జాబితా నుంచి తొలగించగానే.. వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. యాజమాన్య హక్కులు పొందాక.. వాటిని అమ్ముకోవటానికి, కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ర్టేషన్లు చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. బాధితుల ఆస్తులకు చట్టబద్ధత వస్తుంది. వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు పొందటానికి అవకాశం ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్లు వంటి అవసరాలకు బ్యాంకుల్లో సెక్యూరిటీగా పెట్టుకుని రుణాలు పొందటానికి అవకాశం కలుగుతుంది.
సర్వీసు ఈనాం భూ బాధితులు మరో లక్ష
ఉమ్మడి జిల్లాలో సర్వీసు ఈనాం భూముల సమస్యలతో బాధపడుతున్నవారు మరో లక్ష మందికిపైగానే ఉన్నారు. దేవస్థానాలు, ప్రార్థనాలయాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం కేటాయించిన భూములను సర్వీసు ఈనాం భూములు అంటారు. ఇందులో అనేక రకాలు ఉంటాయి. ఆలయాల ధూప దీప నైవేద్య సమర్పణ నిర్వహణకు ఆదాయం కోసం ఇచ్చిన భూములను అప్పట్లో అర్చకులు, ట్రస్టీలుగా ఉన్నవారు అమ్మేశారు. అలాగే దేవాలయాలలో వేదపారాయణం చేయించే నిమిత్తం అవసరమైన ఖర్చులను సమకూర్చుకునేందుకు కేటాయించిన భూములను విక్రయించినవి ఉన్నాయి. ఆలయాల్లో నాట్యగత్తెలు, ఇతర నౌకరీలకు డబ్బులు చెల్లించేందుకు కేటాయించిన భూములను పూజారులు ఇతరులకు విక్రయించినవి కూడా ఉన్నాయి. మసీదుల్లో దీపం వెలిగించేందుకు కేటాయించిన భూములను విక్రయించడం, దేవస్థానం భూముల ఆదాయం ద్వారా దేవుడి గుడి అభివృద్ధి చేయాల్సి ఉండగా.. ఆ భూములను విక్రయించడం వంటివి జరిగాయి. వీటిపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనుంది.
అసైన్డ్ సాగు పట్టాలకు కూడా అవకాశం కల్పించాలి
అసైన్డ్ సాగు పట్టాలు కూడా ఉమ్మడి కృష్ణాజిల్లాలో లక్షకుపైగానే ఉన్నాయి. పేదలు సాగు చేసుకుని వృద్ధిలోకి తీసుకు రావటం కోసం 25 సెంట్ల నుంచి ఎకరం వరకు కూడా సాగు భూములు ఇవ్వటం జరిగింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ ఇంకా నిషేధిత భూముల జాబితాలోనే ఉన్నాయి. ఫ్రీహోల్డ్ ఎత్తివేస్తే వీటికి కూడా మోక్షం కలుగుతుంది.