Share News

ఈఏపీసెట్‌ ఫలితాలపై గందరగోళం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:22 AM

ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీయడంతో పాటు విమర్శలకు తావిస్తోంది. ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదని ఓవైపు మంత్రి లోకేశ్‌ చెబుతుంటే..

ఈఏపీసెట్‌ ఫలితాలపై గందరగోళం

  • పూర్తిగా రాని సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ఫలితాలు.. 13 శాతం పెండింగ్‌లోనే

  • రేపు ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు సిద్ధమైన జేఎన్‌టీయూకే అధికారులు

  • అలా చేస్తే కొందరికి అన్యాయం.. వెయిటేజీలో మార్కులు కోల్పోయే ప్రమాదం

అమరావతి/జేఎన్టీయూకే, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీయడంతో పాటు విమర్శలకు తావిస్తోంది. ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదని ఓవైపు మంత్రి లోకేశ్‌ చెబుతుంటే.. కొందరు అధికారులు తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థుల ఇంప్రూవ్‌మెంట్‌, సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ఫలితాల కోసం వేచిచూశారు. ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయి. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు. అయినా ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు జేఎన్‌టీయూ-కాకినాడ అధికారులు సిద్ధంకావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 30న (మంగళవారం) ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఏపీసెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సీఎస్ఆర్కే ప్రసాద్‌ ఆదివారం తెలిపారు. అయితే ఇంకా 13శాతం మంది సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల రీవాల్యుయేషన్‌ ఫలితాలు రావాల్సి ఉంది. అవి రాకుండానే, వారి సవరణ మార్కుల వివరాలపై డిక్లరేషన్‌లు సమర్పించకుండానే.. అధికారులు ముందుకు వెళ్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.


మరి వారి పరిస్థితి ఏంటి?

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 1 నాటికే ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం కల్పించారు. ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాల కోసం 18 రోజులు ఆగాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఏడాది సీబీఎ్‌సఈ పరీక్షల మూల్యాంకనం వివాదం కావడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటి కోసం ఈఏపీసెట్‌ ఫలితాలను మరోసారి ఆపేశారు. ఈ నెల 21న వారిలో 87 శాతం మంది విద్యార్థుల ఫలితాలను సీబీఎ్‌సఈ విడుదల చేసింది. మరో 13 శాతం మంది ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే జేఎన్‌టీయూ-కే అధికారులు మాత్రం ఈ నెల 27 నాటికి మార్కుల వివరాలతో ఆన్‌లైన్‌లో డిక్లరేషన్‌లు సమర్పించాలని ఆదేశించారు. మరి ఫలితాల కోసం వేచి చూస్తున్న మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటఅనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటి వరకు వచ్చిన రీవాల్యుయేషన్‌ ఫలితాలతోనే ఈఏపీసెట్‌ ఫలితాలు ప్రకటిస్తే.. పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రీవాల్యుయేషన్‌లో మెరుగైన మార్కులు వచ్చినా, వాటిని వెయిటేజీలోకి తీసుకోరు. ప్రస్తుత మార్కులతోనే ర్యాంకులు ప్రకటిస్తారు.

రేపు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల హాల్‌టికెట్లను మంగళవారం నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఏపీపీఎస్సీ ఆదివారం వెల్లడించింది. జూలై 7 నుంచి 11 వరకు జరిగే ఈ పరీక్షలకు 49,117 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. హాల్‌ టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఈ నెల 30 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Updated Date - Jun 29 , 2026 | 05:24 AM