Share News

ఈఏపీసెట్‌ ఫలితాలపై సందిగ్ధత

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:30 AM

రాష్ట్రం లో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకూ ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాల కోసం వేచిచూడగా.. ఇప్పుడు సీబీఎస్ఈ రీవెరిఫికేషన్‌ ఫలితాల..

ఈఏపీసెట్‌ ఫలితాలపై సందిగ్ధత

  • ఒకట్రెండు రోజుల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

  • సీబీఎస్ఈ రీవెరిఫికేషన్‌ కోసం వేచిచూస్తారా?

  • అలాగైతే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే..

అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకూ ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాల కోసం వేచిచూడగా.. ఇప్పుడు సీబీఎస్ఈ రీవెరిఫికేషన్‌ ఫలితాల కోసం అధికారులు మరికొద్ది రోజులు ఆగుతారా? అనే అంశంపై చర్చ నడుస్తోంది. తొలిసారిగా ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశం కల్పించారు. దీంతో వారి తుది మార్కుల కోసం ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒకట్రెండు రోజుల్లో సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఆ తర్వాత వారి మార్కులను ఈఏపీసెట్‌లో కలిపేందుకు మరో 3రోజుల సమయం పడుతుంది. ఆ వెంటనే ఫలితాలను విడుదల చేయొచ్చు. అయితే ఈ ఏడాది సీబీఎ్‌సఈ మూల్యాంకనంపై తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. మూల్యాంకనం సక్రమంగా జరగకపోవడంతో లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విద్యార్థులే అనేకమంది దరఖాస్తు చేశారు. ఈ నెలాఖరులో ఆ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకూ ఈఏపీసెట్‌ ఫలితాలను ఆపుతారా? ఇంటర్‌ ఫలితాలు రాగానే ఇచ్చేస్తారా? అనే సందేహం నెలకొంది. ఏటా సీబీఎ్‌సఈ రీవెరిఫికేషన్‌ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఈఏపీసెట్‌ ఫలితాలు ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది సీబీఎ్‌సఈ మూల్యాంకనం వివాదం కావడంతో సందిగ్ధ పరిస్థితి ఎదురైంది.

గ్రేడ్‌-3 ఈవో ఫలితాలు విడుదల

అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ గ్రేడ్‌-3 ఈవో పోస్టుల నోటిఫికేషన్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అలాగే ఏపీ సైనిక్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ పోస్టుల ఫలితాలు కూడా విడుదల చేసింది.

Updated Date - Jun 17 , 2026 | 04:31 AM