Economic Crisis: అదే వ్యథ.. పాత కథ!
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:01 AM
ఇదో విష వలయం! ఆర్థికంగా ‘విలయం’! పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు! వెరసి కొండలా అవసరాలు! కానీ... ఆదాయం కొంచమే! ఆధారం... ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే!
జగన్ హయాంలో గాడి తప్పిన ‘ఆర్థికం’
కూటమి సర్కారులోనూ గతుకుల ప్రయాణం
అన్ని రకాల ఆదాయం కలిపితే రూ.లక్షన్నర కోట్లు
అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరి
పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకు అప్పులే గతి
అప్పుల రీపేమెంట్లు ఏడాదికి రూ.75,000 కోట్లు
జీతాలు, పెన్షన్లు మరో రూ.75,000 కోట్లు
డిసెంబరు నాటికే లక్ష కోట్లు దాటిన అప్పు
‘పథకాల పులి’పై ప్రభుత్వాల స్వారీ
దశాబ్దాలుగా అమలు చేస్తున్నా తగ్గని పేదరికం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇదో విష వలయం! ఆర్థికంగా ‘విలయం’! పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు! వెరసి కొండలా అవసరాలు! కానీ... ఆదాయం కొంచమే! ఆధారం... ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే! జగన్ హయాంలో జరిగిన పాత కథ ఒక్కసారిగా మారిపోయేది కాదు! కూటమి సర్కారు వచ్చాకైనా పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే... అదీ జరగడంలేదు. పైగా... జగన్ చేసిన అప్పులు, తప్పుల బాటలోనే నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికే రాష్ట్ర అప్పులు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని గాడిన పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో మెరుగుపర్చామని స్వయంగా సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ, ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే పాత అప్పులపై కట్టాల్సిన వడ్డీ, అసలే ఏడాదికి సుమారు రూ.75,000 కోట్లు ఉన్నాయి. ఇలా మరో 15 ఏళ్లు కడుతూనే ఉండాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పటి ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వాలు చేసే కొత్త అప్పులపై ఆధారపడి ఉంటుంది. ఇక... ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి ఏడాదికి దాదాపు రూ.75,000 కోట్లు ఉంటాయి. అప్పుల అసలు, వడ్డీ... ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు! ఇవి రెండూ కలిపితే లక్షన్నర కోట్లు! ఇవి అనివార్య, అత్యవసర ఖర్చులు. అప్పులపై అసలు, వడ్డీ నేరుగా రాష్ట్ర ఖాతా నుంచి ఆర్‌బీఐ మినహాయిస్తుంది. వాయిదా వేయడం కుదరదు. అసలు, వడ్డీలు చెల్లించగా మిగిలిన డబ్బులనే ఏ అవసరానికైనా వాడుకోవాలి. ఇందులో మొదటి ఖర్చు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు!
ఆదాయం అంతే...
ఏతావాతా... రాష్ట్ర ప్రభుత్వానికి అనివార్యమైన, అత్యవసర ఖర్చులే ఏటా లక్షన్నర కోట్లు! రాష్ట్ర సొంత ఆదాయం మాత్రం రూ.లక్ష కోట్లకు కొంచెం అటూఇటూగా ఉంటుంది. అంటే... ఇక్కడే 50వేల కోట్లకు ‘లోటు’ తేలింది. అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మరో రెండు ఉన్నాయి. అవి... కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా! గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.32,000 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, నవంబరు నాటికి రూ.7692 కోట్లు మాత్రమే వచ్చాయి. నెలకు కనీసం రూ.1,000 కోట్లు కూడా రావడంలేదు. ఇక... కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.40,000 కోట్లు రావచ్చని అంచనా వేశారు. నవంబరు నాటికి రూ.26,000 కోట్లు వచ్చాయి. ఇక... పన్నేతర ఆదాయం 8 నెలల్లో రూ.3,671 కోట్లు వచ్చింది. వెరసి... రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, పన్నేతర ఆదాయం కలిపి వడ్డీలు, అసలు వాయిదాల చెల్లింపులు, జీతాలు, పెన్షన్లకు సరిపోతుంది. అదీ బొటాబొటిగానే. మరి... అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, రాయితీలు, ఇతర ఖర్చుల మాటేమిటి??? మళ్లీ అప్పులు చేయడమే! లేదా... సొంత ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - నవంబరు వరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.68,102 కోట్లు వచ్చింది. ఇదే పంథా కొనసాగితే మార్చి చివరి నాటికి రూ.1,03,000 కోట్లు రావచ్చు. కానీ, జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి నెలా ఆదాయం తగ్గుతోంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం ఇంకా తగ్గొచ్చు.
మరేమిటి మార్గం...
2017 వరకు... రాష్ట్రానికి ఉన్న అప్పుల పరిమితిని కూడా పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సొంత ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటాలు, పరిమితికి లోబడిన అప్పులతో బండి చక్కగా నడిచేది. కానీ... మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది. జగన్ హయాంలో అది మరింత దిగజారింది. సొంత ఆదాయం పెంచుకోకుండా... ‘బటన్ నొక్కుడు’కు అలవాటు పడటమే దీనికి కారణం. ‘అప్పట్లో మాకు అనుమతించిన మేరకు పూర్తిగా అప్పులు తెచ్చుకోలేదు. ఇప్పుడు వాటిని తెచ్చుకునే అవకాశమివ్వండి’ అని జగన్ సర్కారు కోరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కారణాలు, అనివార్యతల నేపథ్యంలో కావొచ్చు... కూటమి కూడా ఇబ్బడి ముబ్బడిగా పథకాలు, హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. దీంతో... జగన్ హయాంలో జరిగిన అప్పులు, తప్పులను కొనసాగించక తప్పడంలేదు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడం తప్పేమీ కాదు. కానీ, ఓటుబ్యాంకు పదిలం చేసుకునేందుకు, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు భారీగా అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
కార్పొరేషన్ల మాటున...
ప్రస్తుతం రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చే అప్పులు సరిపోవడం లేదు. అందుకే, కార్పొరేషన్ల ముసుగులో అప్పులు తెచ్చుకోవడం మొదలైంది. ‘ఎన్నికల గండం గడవాలి’ అనే లక్ష్యంతో 2019లో చంద్రబాబు ‘పసుపు కుంకుమ’ ప్రకటించారు. దీనికోసం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చారు. దీనిని జగన్ సీఎం అయ్యాక ‘పీక్స్’కు తీసుకెళ్లారు. కార్పొరేషన్లకు ప్రభుత్వమే వేలకోట్ల గ్యారెంటీలు ఇచ్చి, ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి, తిరిగిరాని ఖర్చుల కోసం వాడటం ‘అలవాటు’గా మారింది.
అప్పుల చిట్టా...
ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఆర్‌బీఐ ద్వారా రూ.77,040 కోట్లు అప్పు తెచ్చినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబరులో రూ.7,000 కోట్లు అప్పు తెచ్చారు. జనవరి 6న ఏకంగా రూ.6,500 కోట్లు అప్పు తెచ్చారు. ప్రస్తుతానికి అప్పు రూ.90,540 కోట్లకు చేరింది. రాజధాని కోసం తెస్తున్న అప్పులు, వివిధ కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి తెస్తున్నవి అదనం. అన్నీ కలిపితే డిసెంబరు నాటికే రూ.లక్ష కోట్లు దాటింది.
తిరిగి వచ్చేలా...
అప్పులతో రహదారులు, రేవులు, విద్యుత్ కేంద్రాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ఖర్చుచేస్తే ఆ అప్పులు గుదిబండలుగా మారవు. ఆ సదుపాయాల వల్ల అభివృద్ధి జరిగి అప్పులు తీర్చే స్థోమతను ఇస్తాయి. మానవవనరులను అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతారు.
అంతులేని కథ...
రాష్ట్రాలు, కేంద్రం దశాబ్దాల తరబడి పదులకొద్దీ సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్, ఇతర పథకాలకు తోడు కేంద్రం 131 పథకాలను అమలు చేస్తోంది. అయినప్పటికీ వైద్యం ఖర్చులు భరించలేని సామాన్యులు, ఫీజులు కట్టలేని విద్యార్థులు, ఉద్యోగాల్లేని యువత పెరుగుతూనే ఉన్నారు.
మచ్చుకు ఒక లెక్క!
సొంత ఆదాయం పెంచుకోవడంతోపాటు... పథకాల్లో వృథా తగ్గించి, ‘లీకేజీ’లు లేకుండా అమలు చేస్తే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుంది. ఉదాహరణకు... రేషన్‌బియ్యం కోసం ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సమీకరణ, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఒక్క కిలో బియ్యం కోసం ప్రభుత్వం రూ.40 దాకా ఖర్చు పెడుతోంది. కానీ... రేషన్ బియ్యాన్ని వండుకుని తినేది ఎంతమంది? అవి సముద్రాలు దాటి ఎలా స్మగ్లింగ్ అవుతున్నాయి. దీన్ని ఎందుకు సంస్కరించకూడదు.?
పాత పంథాలోనే...
ప్రభుత్వాలు సాధ్యమైనంత తక్కువ వడ్డీకి అప్పులు తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తాయి. కానీ, జగన్ హయాంలో 12 శాతం వరకు వడ్డీకి అప్పులు తెచ్చారు. ‘కొంత నయం’ అనిపించినా, కూటమి ప్రభుత్వానిదీ ఇదే బాట. ప్రస్తుతం మార్కెట్లో వడ్డీరేటు 8 శాతం ఉండగా, ఇటీవల కూటమి ప్రభుత్వం మార్కెట్లో బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను విక్రయించి 9.5 శాతం వడ్డీకి రూ.5,750 కోట్లు అప్పు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీపీడీసీఎల్, ఏపీఎ్‌సపీడీసీఎల్, పౌరసరఫరాల సంస్థ, ఏపీఎండీసీ, ఏపీ మార్క్‌ఫెడ్, జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్, ఏపీఐఐసీ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీమార్క్‌ఫెడ్‌కు వేలకోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది.
బిల్లుల చెల్లింపు కూడా వైసీపీ తరహాలోనే చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రూ.30,000 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ వెనక్కి పంపింది. ఆ బిల్లులను తిరిగి వ్యవస్థలోకి తీసుకురావాలంటే సంబంధిత శాఖల్లో కొత్తగా ఫైళ్లు పెట్టించుకుని తెచ్చుకోవాలి లేదా కోర్టుకి వెళ్లి పోరాడాలి.