Share News

దుబాయ్‌ పిలుస్తోంది!

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:44 AM

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్‌లో మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.., పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా.., ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.., మరో అడుగు ముందుకేసి సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా! అయితే ఆలస్యం ఎందుకు.. వెంటనే రండి అంటూ ఆహ్వానం పలుకుతోంది దుబాయ్‌. బెజవాడలోని స్టార్‌ హోటల్స్‌ వేదికగా ఔత్సాహిక వ్యాపారవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. దుబాయ్‌ ప్రాపర్టీ షోలు చూపించేందుకు టికెట్లను సైతం బుక్‌ చేస్తోంది. దుబాయ్‌ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.

దుబాయ్‌ పిలుస్తోంది!

- బెజవాడ నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆహ్వానం

- ఉమ్మడి కృష్ణాజిల్లా వారికి వ్యాపార అవకాశాలపై ఆఫర్లు

- నగరంలోని స్టార్‌ హోటల్స్‌ వేదికగా సంప్రదింపులు

- దుబాయ్‌ ప్రాపర్టీ షోలకు టికెట్లను బుక్‌ చేస్తున్న వ్యాపార సంస్థలు

- ఫ్రీ జోన్లలో ప్రభుత్వం కల్పించే రాయితీల గురించి విస్తృత ప్రచారం

- ఏపీ చాంబర్స్‌ ప్రతినిధి వర్గాలకు కూడా ఆహ్వానం

- తొలి విడతలో దుబాయ్‌ వెళ్లి వచ్చిన పలువురు ప్రతినిధులు

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్‌లో మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.., పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా.., ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.., మరో అడుగు ముందుకేసి సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా! అయితే ఆలస్యం ఎందుకు.. వెంటనే రండి అంటూ ఆహ్వానం పలుకుతోంది దుబాయ్‌. బెజవాడలోని స్టార్‌ హోటల్స్‌ వేదికగా ఔత్సాహిక వ్యాపారవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది. దుబాయ్‌ ప్రాపర్టీ షోలు చూపించేందుకు టికెట్లను సైతం బుక్‌ చేస్తోంది. దుబాయ్‌ ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

దుబాయ్‌ ప్రాపర్టీ షో, దుబాయ్‌ బిజినెస్‌ ఆఫర్ల పేరుతో దుబాయ్‌ పెట్టుబడి ప్రోత్సాహక బృందాలు, ప్రతినిఽధి బృందాలు టూటైర్‌ సిటీ బెజవాడపై దృష్టి సారించాయి. దుబాయ్‌లో సొంతంగా పెట్టుబడులు, వ్యాపారాలు, కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తామంటూ ఊదరగొడుతున్నాయి. ఏకంగా పలు సంస్థలు నగరంలోని కొన్ని స్టార్‌ హోటల్స్‌లో ఔత్సాహిక మీట్స్‌ నిర్వహిస్తున్నాయి. దుబాయ్‌ ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు టికెట్లను బుక్‌ చేస్తున్నాయి. ఏపీ చాంబర్స్‌ వంటి సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాయి. మొదటి విడతలో కొంతమంది చాంబర్స్‌ ప్రతినిధులు కూడా వెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబాయ్‌ ఆహ్వానం బిజినెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇన్‌స్టా వేదికగా భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదంతా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న పొటెన్షియల్‌ను చూసేనని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వంతో ద్వైపాక్షిక ఒప్పందాల ఫలితమే!

మన దేశంతో దుబాయ్‌కు ఉన్న బలమైన స్నేహ బంధం, విస్తరిస్తున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగానే తమ దేశంలో పెట్టుబడులకు దుబాయ్‌ చెయ్యి అందిస్తోంది. దుబాయ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడం అంటే ఆషామాషీ కాదు. ఇలా ఆహ్వానించడం కొత్తకాదు. అప్పట్లో చాంబర్స్‌ వర్గాలు దుబాయ్‌ సంస్థలను బెజవాడ పిలిపించి వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించేవి. కాకపోతే ఇప్పుడు అవే సంస్థలు క్షేత్రస్థాయిలోకి నేరుగా వచ్చేశాయి. విస్తృతంగా పెట్టుబడుల కల్పనకు ఆహ్వానం పలుకుతున్నాయి.

అక్కడి ప్రాపర్టీ షోలను వీక్షించేందుకు ఏర్పాట్లు

బెజవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, నిర్మాణ తదితర రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పెట్టుబడిదారులతో పాటు, కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, స్టార్టప్స్‌ వంటి వాటికి దుబాయ్‌లో వ్యాపార ఫలాలు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకు తమ ప్రభుత్వం నిర్వహించే ప్రాపర్టీ షోలకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. తమ దగ్గర ఉన్న అవకాశాలను వివరించటానికి ఆయా సంస్థలకు చెందిన కొంతమంది ప్రతినిధులు నగరంలో స్టార్‌ హోటల్స్‌లో ఉంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రాపర్టీ షోలను వీక్షించేందుకు దుబాయ్‌కు విమాన టికెట్లను బుక్‌ చేస్తున్నాయి.

వ్యాపార అవకాశాలపై అవగాహన

విజయవాడ నగరం టూ టైర్‌ సిటీ కావటంతో ప్రధానంగా నిర్మాణ రంగానికి పలు సంస్థలు వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. దుబాయ్‌లో నిర్మాణ రంగానికి ఉన్న డిమాండ్‌ రీత్యా .. అక్కడి సంస్థలతో కలిసి పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవటంతో పాటు.. సొంతంగా నిర్మాణ సంస్థలు పెట్టుకుని ప్రాజెక్టులు చేపడతామన్నా గైడ్‌ చేస్తున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంకా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నాయి. సొంత నిర్మాణ కంపెనీల కోసం పలు ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు కూడా పని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు వివరిస్తున్నారు. రూ. కోటిన్నర లోపు, రూ.1.50 కోట్ల నుంచి రూ. 3 కోట్లు, రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లపైన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ గురించి తెలియజేస్తున్నారు. దుబాయ్‌లో ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నారు. పన్నులు లేని ఆదాయం (ట్యాక్స్‌ ఫ్రీ ఇన్‌కమ్‌), పది సంవత్సరాల గోల్డెన్‌ యూఏఈ వీసా వంటి వాటి గురించి చెబుతున్నారు. ఇంకా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం అందించే సదుపాయాల గురించి వివరిస్తున్నారు.

ఫ్లాట్స్‌ కొనుగోళ్లకు అవకాశం

వ్యాపార పరంగా కాకపోయినా.. దుబాయ్‌లో ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. దుబాయ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన శోభ, డామాక్‌, అజీజీ, దానాద్‌ తదితర నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఆకాశ హర్మ్యాలలో ఫ్లాట్స్‌ కొనుగోలుకు సంబంధించి కూడా ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వాటి గురించిన సమాచారాన్ని అందిస్తున్నాయి.

దుబాయ్‌ ప్రభుత్వ ప్రోత్సాహకాలు

దుబాయ్‌లోని ఫ్రీ జోన్లలో మన పెట్టుబడిదారులకు అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను దుబాయ్‌ ప్రభుత్వం అందిస్తోంది. నూరుశాతం విదేశీయులే పెట్టుబడులు పెట్టుకునే అవ కాశం కల్పించింది. భాగస్వామి అవసరమన్న నిబంధనలను తొలగించింది. విదేశీయులు తమ వ్యాపారాలపై పూర్తి అధికారం, నియంత్రణతో ఉండటానికి వీలు కల్పించింది. ఫ్రీ జోన్లలో ఏర్పడిన కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తీసివేసింది. వస్తువుల దిగుమతి, ఎగుమతులపై కూడా పన్ను మినహాయింపులు ఇచ్చింది. వ్యక్తిగత ఆదాయపన్ను కూడా లేదు. ఫ్రీ జోన్లలో సంపాదించిన లాభాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వదేశానికి పంపుకొనే వెసులుబాటు కల్పించింది. వ్యాపార లైసెన్స్‌ ద్వారా ఇన్వెస్టర్‌ వీసాలు, ఉద్యోగులకు వీసాలు పొందే అవకాశం ఇచ్చింది. వీసాలలో ఎన్నో సడలింపులు కల్పించింది. ఫ్రీ జోన్లలో కంపెనీలను స్థాపించటానికి సులభతరమైన ప్రక్రియ ఉంటుంది. కొద్ది గంటలు, రోజులలోనే కంపెనీని ఏర్పాటు చేసుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దింది. బ్యాంకింగ్‌ సౌలభ్యాలతో పాటు ఇతర సుంకాల తగ్గింపు, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనటం, స్టార్టప్‌లకు అనుకూల విధానాలు వంటివి మరెన్నో కల్పించింది.

వ్యాపార విస్తరణకు మంచి అవకాశం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో సెజ్‌లు ఉన్నాయి. దుబాయ్‌, రస్‌ ఆల్‌ ఖైమా, అబుదాబి, షార్జా, అజ్మాన్‌, ఉమ్మ్‌ ఆల్‌ ఖువైన్‌, ఫుజైరా వంటివి యూఏఈలో అంతర్భాగం. వీటిలో ఫ్రీ జోన్లు ఉంటాయి. వ్యాపారాలు, పెట్టుబడుల కోసం మనకు అనుకూల ధరల్లో భూములు ఇస్తారు. అక్కడి నుంచి మనకు ఆఫ్రికన్‌ మార్కెట్‌ కలుస్తుంది. మన వాళ్లకు చాలా అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఆఫ్రికా, యూఏఈ సంబంధాలు కూడా మన వాళ్లకు కలిసి వస్తాయి. ఎకనమిక్‌ జోన్లలో పెట్టుబడులకు సంబంధించి చాంబర్‌ తరఫున ఎన్నాళ్ల నుంచో మేము కూడా అవగాహన కల్పిస్తున్నాం. మనవాళ్లు ఆరఽఫికన్‌ మార్కెట్‌కు స్వేచ్ఛగా ఎగుమతులు చేసుకోవచ్చు. వ్యాపార విస్తరణకు దుబాయ్‌ మంచి అవకాశం. మన దగ్గర నుంచి కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఎక్కువుగా పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారు.

పొట్లూరి భాస్కరరావు, ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు

Updated Date - Feb 26 , 2026 | 12:44 AM