డీఎస్సీపై గొడ్డలి పార్టీ దుష్ప్రచారం
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:29 AM
కష్టపడి డీఎస్సీ రాసి ఉద్యోగాలు సాధిస్తే.. తమపై గొడ్డలి పార్టీ వైసీపీ విష ప్రచారం చేస్తోందని డీఎస్సీ విజేతలు గర్జించారు. డైవర్షన్ రాజకీయాల కోసం తమను అవమానిస్తోందని...
విశాఖలో డీఎస్సీ విజేతల గర్జన
ఏడాది తర్వాత విమర్శలు ఏమిటని నిరసన
తమను అవమానిస్తోందని ఆగ్రహం
విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
నాలుగు జిల్లాల నుంచి 600 మంది హాజరు
వేపగుంట (విశాఖపట్నం), జూన్ 1(ఆంధ్రజ్యోతి): కష్టపడి డీఎస్సీ రాసి ఉద్యోగాలు సాధిస్తే.. తమపై గొడ్డలి పార్టీ వైసీపీ విష ప్రచారం చేస్తోందని డీఎస్సీ విజేతలు గర్జించారు. డైవర్షన్ రాజకీయాల కోసం తమను అవమానిస్తోందని, అనుమానిస్తోందని మండిపడ్డారు. విశాఖ శివారువేపగుంటలోని వీఎంఆర్‌డీఏ కన్వెన్షన్‌లో సోమవారం ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ అధ్యక్షతన డీఎస్సీ విజేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి సుమారు 600 మంది 2025-డీఎస్సీ విజేతలు తరలివచ్చారు. డీఎస్సీలో అవకతవకలంటూ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ‘జగన్ ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, ఉద్యోగాలు కూడా ఇస్తే అందులో కుట్ర జరిగిందని.. ఏడాది తరువాత ఇప్పుడు వారి రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని విజేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ అభ్యర్థులతో గొడ్డలి పార్టీ రాజకీయాలు చేయడం బాధాకరమని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. డీఎస్సీపై 242 కేసులు వేస్తే, వాటిని పరిష్కరించాకే పారదర్శకంగా పోస్టులు భర్తీ చేశారన్నారు. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్‌మోహన్‌రెడ్డికి ఇంకా తెలిసి రాలేదని హెచ్చరించారు.
నిరుద్యోగులను మోసగించిన జగన్
ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని హామీ ఇచ్చి.. ముఖ్యమంత్రి ఉద్యోగం పొందిన తరువాత నిరుద్యోగులను మోసం చేసిన ఘనుడు జగన్ అని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ విమర్శించారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా, సమర్థంగా డీఎస్సీ నిర్వహించి 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఏడాదిగా వారంతా నిబద్ధతతో ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు విషప్రచారం చేయడం దారుణమన్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) కేటగిరీలో జిల్లా టాపర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేపరు లీకైందని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం వల్లే తమకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతిరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.