Teacher Recruitment: ఫిబ్రవరిలో మరో డీఎస్సీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:28 AM
ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
2,500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ
ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపర్
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దుచేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలు తీసుకువచ్చారు. 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి తరగతికి ఒక టీచర్‌ను నియమించారు. దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1,146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సుమారు 2 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య 2,500కు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు.
ఆంగ్లం + కంప్యూటర్
ఈసారి డీఎస్సీలో కొత్తగా ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు డీఎస్సీ అంటే కేవలం సంబంధిత సబ్జెక్టు పేపర్‌తోనే పరీక్ష జరుగుతోంది. ఏపీపీఎస్సీ కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తోంది. అలాగే టీచర్లకు కూడా ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కంప్యూటర్‌పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి ఒక పేపర్‌గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. డీఎస్సీతో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ కంటే ముందే!
ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 9లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ఫలితాలు విడుదల చేయాలి. కానీ, షెడ్యూల్ కంటే ముందే పరీక్షలు ముగిశాయి. దీంతో ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ విడుదల చేశారు. త్వరలో తుది ‘కీ’ విడుదల చేసి, అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.