Share News

Drunk incident: గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై మందుబాబు హల్‌చల్‌

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:05 AM

తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి భద్రతా సిబ్బందికి తెలియకుండా ఆలయంలోకి ప్రవేశించి ఏకంగా....

Drunk incident: గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై  మందుబాబు హల్‌చల్‌

  • అర్ధరాత్రి గుడిలోకి వెళ్లి పైకెక్కి వీరంగం

  • మూడు గంటలు శ్రమించి కిందకు దింపిన సిబ్బంది

  • నిందితుడు తెలంగాణ వాసిగా గుర్తింపు.. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

  • భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఇద్దరు ఆలయ సిబ్బందిపై వేటు

తిరుపతి/కామారెడ్డి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి భద్రతా సిబ్బందికి తెలియకుండా ఆలయంలోకి ప్రవేశించి ఏకంగా ఆలయ ప్రధాన గోపురంపైకి చేరుకున్నాడు. కలశాలు ఊడబెరుకుతూ హంగామా చేశాడు. ఆలస్యంగా గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మూడు గంటలు శ్రమించి మందుబాబును గోపురంపై నుంచి కిందకు తీసుకొచ్చారు. కాగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం టీటీడీకి చెందిన ప్రధాన ఆలయాల్లో ఒకటి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ గుడిని శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. సుమారు 11.15 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన పందిరి నిమిత్తం గోడకు నిలిపిన కర్రలు, నిచ్చెన సాయంతో ఆలయ ప్రధాన గోపురం మూడవ అంతస్తు వద్దకు చేరాడు. గోపురం పైనుంచి శబ్ధాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జమేదార్‌ పట్టాభి రెడ్డి, డ్యూటీ గార్డు గోపురంపై ఓ వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. అతన్ని కిందకు దించడానికి యత్నించి విఫలమయ్యారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా రప్పించినా ఫలితం లేకపోయింది. మందుబాబు కిందకు దిగకపోగా తనకు 90 ఎంఎల్‌ కావాలంటూ కేకలు పెట్టాడు. ఆలయ సిబ్బంది గోపురం పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఎవరైనా పైకి వస్తే తాను కిందకు దూకేస్తానంటూ మందుబాబు బెదిరింపులకు దిగాడు. సమీపించిన సిబ్బంది ఒకరిని కిందకు తోసేయడానికి యత్నించాడు. ఆపై గోపురంపై అమర్చిన ట్యూబ్‌ లైట్‌ను పగలగొట్టడంతో పాటు గోపురం చివరి అంతస్తు చేరుకుని రెండు కలశాలను తొలగించేందుకు విఫలయత్నం చేశాడు.


దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయ సిబ్బంది ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీనివాసులుకు సమాచారమిచ్చారు. ఆయన పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని వెంటబెట్టుకుని ఆలయం వద్దకు చేరుకున్నారు. అతన్ని కిందకు దించడానికి వారి ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో చివరికి అగ్నిమాపక సిబ్బంది వాటర్‌ క్యానన్‌ ప్రయోగించడంతో ఎట్టకేలకు మందుబాబు గోపురంపై నుంచి కిందకు దిగాడు. అతన్ని ఈస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో మందుబాబు పేరు కుత్తాడి తిరుపతి (42) అని, తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌ భరత్‌ నగర్‌ వలస వెళ్లిన అతనికి భార్య, ఇంటర్‌ చదివే కుమార్తె, 9వ తరగతి చదివే కొడుకు ఉన్నట్టు గుర్తించారు. అక్కడ భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుని బతికేవారని తేలింది. ఇంట్లో భార్యతో గొడవపడి అలిగి పది రోజుల కిందట తిరుపతి చేరుకున్నాడని, అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్సు ఆవరణలో ఉచిత భోజనం తిని అక్కడే ఉంటున్నట్టు గుర్తించారు. మద్యం మత్తులో గుడిలోకి వెళ్ళానే తప్ప మరే ఇతర ఉద్దేశం లేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఆలయ జమేదార్‌ పట్టాభి రెడ్డి ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ పోలీసులు తిరుపతిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంత సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుడు శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత ఆలయం వెలుపల ఐదారుసార్లు అటూఇటూ తిరుగాడినట్టు గుర్తించారు.

జమేదార్‌పై చర్యలు: సీవీఎ్‌సవో

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి విచారిస్తున్నాం. ఆలయ జమేదార్‌ పట్టాభిరెడ్డిపై చర్యలు తీసుకుంటాం. ఆలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తాం. భవిష్యత్తులో భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jan 04 , 2026 | 04:05 AM