Share News

కత్తి కంటే డ్రగ్స్‌ ప్రమాదం

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:45 AM

సమాజంలో కత్తి, కర్ర వంటి ఆయుధాల కంటే మాదకద్రవ్యాలు (డ్రగ్స్‌) అత్యంత ప్రమాదకరమని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు.

కత్తి కంటే డ్రగ్స్‌ ప్రమాదం

  • యువతకు నో చెప్పే ధైర్యం రావాలి: హోంమంత్రి అనిత

  • విజయవాడలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ సైకిల్‌ ర్యాలీ ప్రారంభం

విజయవాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): సమాజంలో కత్తి, కర్ర వంటి ఆయుధాల కంటే మాదకద్రవ్యాలు (డ్రగ్స్‌) అత్యంత ప్రమాదకరమని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ తీసుకోవాలని స్నేహితులు బలవంతం చేసినప్పుడు ‘నో’ చెప్పకపోవడం వల్ల చాలామంది యువకులు చిక్కుల్లో పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం యువతలో నో చెప్పే ధైర్యం ఉండడం లేదని.. అయితే ఇలాంటి ఆఫర్లను నిర్మొహమాటంగా తిరస్కరించాలని సూచించారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే ఐదుగురు మహిళా పోలీసులు ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ పేరుతో చేపట్టిన సైకిల్‌ ర్యాలీని మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఈగల్‌ టీమ్‌ ప్రతి గంజాయి మొక్క మీదా నిఘా పెట్టి రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేసిందన్నారు. మాదకద్రవ్యాల బారినపడిన వారిని మామూలు స్థితికి తీసుకురావడానికి డీఎడిక్షన్‌ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. తాను ఓ కారాగారంలో ఖైదీలకు రాఖీ కట్టడానికి వెళ్లినప్పుడు గంజాయి కేసుల్లో ఇరుక్కుని రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. వారికి తల్లిదండ్రులు కూడా బెయిల్‌ ఇవ్వడానికి ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ... సమాజహితం కోసం పనిచేసే వాళ్లే నిజమైన సెలబ్రిటీలని అన్నారు. సినిమాల్లో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారన్నారు. భారతీయులు అంతరిక్షానికి వెళ్తుంటే కొంతమంది యువకులు డ్రగ్స్‌బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా, ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 06:46 AM