Share News

మాదకద్రవ్యాలపై నిఘా

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:44 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నార్కోటిక్స్‌ గోడౌన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్‌, న్యాయవ్యవస్థకు చెందిన అధికారులు నార్కోటిక్స్‌ గోడౌన్‌ కోసం రెండు ప్రాంతాల్లో స్థలాన్వేషణ చేశారు. ఆ వివరాలను కలెక్టర్‌ ద్వారా సీసీఎల్‌ఏకు పంపారు. గతేడాది జూలైలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో పాటు, మంత్రివర్గ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మచిలీపట్నంలో నార్కోటిక్స్‌ గోడౌన్‌, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇది మచిలీపట్నానికి మరో మణిహారంగా మారనుంది.

మాదకద్రవ్యాలపై నిఘా

- మచిలీపట్నంలో నార్కోటిక్స్‌ గోడౌన్‌, కార్యాలయం!

- ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుకు స్థలం ఎంపిక

- పట్టుబడిన మాదకద్రవ్యాల నిల్వ, నిందితుల విచార ణ ఇక్కడే

- ల్యాబ్‌ల ఏర్పాటు, ప్రత్యేక అధికారుల నియామకం

- ఇక జిల్లా, సరిహద్దుల్లో నిరంతర నిఘా

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నార్కోటిక్స్‌ గోడౌన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్‌, న్యాయవ్యవస్థకు చెందిన అధికారులు నార్కోటిక్స్‌ గోడౌన్‌ కోసం రెండు ప్రాంతాల్లో స్థలాన్వేషణ చేశారు. ఆ వివరాలను కలెక్టర్‌ ద్వారా సీసీఎల్‌ఏకు పంపారు. గతేడాది జూలైలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో పాటు, మంత్రివర్గ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మచిలీపట్నంలో నార్కోటిక్స్‌ గోడౌన్‌, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇది మచిలీపట్నానికి మరో మణిహారంగా మారనుంది.

ఆంరఽధజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలో పట్టుబడిన గంజాయి, ఇతరత్రా మాదకద్రవ్యాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా గోడౌన్‌ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో గోడౌన్‌ నిర్మాణం చేసేందుకు స్థలం కావాలని సీసీఎల్‌ఏ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదన వచ్చింది. దీంతో మచిలీపట్నం సౌత మండలంలోని ఇనుగుదురుపేటలో నార్కోటిక్స్‌ గోడౌన్‌ నిర్మాణం కోసం 30 సెంట్ల మేర స్థలాన్ని తొలుత ఎంపిక చేసి సీసీఎల్‌ఏ ఆమోదం కోసం పంపారు. ఈ స్థలాన్ని పరిశీలించిన నిపుణుల బృందం ఈ ప్రాంతం అనుకూలంగా లేదని తిరస్కరించింది. అనంతరం ఉన్నతాధికారుల సూచన మేరకు మచిలీపట్నం నార్త్‌ మండలంలోని ఒకటీ రెండు స్థలాలను పరిశీలించారు. చివరిగా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని స్థలం ఈ నార్కోటిక్స్‌ గోడౌన్‌కు అనుకూలమైనదిగా గుర్తించి ఈ ప్రతిపాదనను సీసీఎల్‌ఏకు పంపారు. ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌ స్థలం అత్యంతం కట్టుదిట్టమైనదిగా ఉండటంతో ఇక్కడ నార్కోటిక్స్‌ గూడౌన్‌ను ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైనట్లేనని అధికారులు చెప్పుకుంటున్నారు.

పట్టుకున్న మాదకద్రవ్యాల నిల్వ

జిల్లాతో పాటు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఉంచి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్‌ గోడౌన్‌కు తరలిస్తారు. ఈ తరహా కేసుల్లో నిందితులను కూడా ఇక్కడే ఉంచి విచారణ చేస్తారు. అవసరమైన సమయాల్లో పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌కు సమీపంలోనే ఉన్న జిల్లా కోర్టుకు నిందితులను విచారణ నిమిత్తం తరలిస్తారు. దీంతో పోలీస్‌ బందోబస్తుతో పాటు, రవాణా చార్జీల భారం, నిందితుల తరలింపులో సమయం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని అధికారుల భావన.

ప్రత్యేక అధికారి పర్యవేక్షణ

ఏయే రకాల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి, వాటి విలువ, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, పట్టుబడిన నిందితులు, తదితర అంశాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐపీఎస్‌ కేడర్‌ అధికారి పర్యవేక్షణలో విచారణ ఇక్కడే చేస్తారు. నార్కోటిక్స్‌ గోడౌన్‌లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి సాంకేతిక పరంగా అన్నిరకాల పరీక్షలు జరుపుతారు. నార్కోటిక్స్‌ గోడౌన్‌ ఈ ప్రాంతంలో ఏర్పాటైతే పోలీస్‌, నార్కోటిక్స్‌శాఖల పరంగా జాతీయ రహదారులు, రాష్ట్రరహదారుల వెంబడి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మచిలీపట్నంలో ఏర్పాటు చేసే నార్కోటిక్స్‌ కార్యాలయం లేదా గోడౌన్‌ నుంచే మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక అధికారి ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది.

గంజాయి, డ్రగ్స్‌ రవాణా, వాడకానికి ఇక చెక్‌

జిల్లాలోని పలు ప్రాంతాలకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంతో పాటు ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను స్మగ్లర్లు గుట్టు చప్పుడుకాకుండా తీసుకువస్తున్నారు. జాతీయ రహదారులతో పాటు చిన్నపాటి రోడ్ల మార్గంలోనూ గంజాయిని తెస్తున్నారు. ఇటీవల తోట్లవల్లూరులో 50 కిలోలకుపైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద రూ.70 లక్షల విలువైన 140కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న ప్రాంతాల్లో గంజాయిని దిగుమతి చేసుకుని జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కొద్దికొద్దిగా తరలించి విక్రయాలు జరుపుతున్నారు. ప్రతిరోజూ పోలీసుల నిఘా ఉండకపోవడంతో స్మగ్లర్లు ఏదో ఒక సమయంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పోలీసుల కళ్లుగప్పి రవాణా చేస్తూనే ఉన్నారు. నార్కోటిక్స్‌ గోడౌన్‌ ఏర్పాటు చేస్తే మాదకద్రవ్యాల రవాణాపై నిఘా మరింతగా పెరిగి స్మగ్లర్ల కార్యకలాపాలకు జిల్లాలో కొంత మేరకయినా చెక్‌ పడనుంది.

Updated Date - Mar 24 , 2026 | 12:44 AM